అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జో బైడెన్‌ని అభినందిస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ కి బదులిస్తూ జో బైడెన్ చేసిన ట్వీట్ లో మోదీని ప్రపంచ నాయకుడని సంబోధించాడని, ఈ ట్వీట్స్ యొక్క ఫోటో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ మోదీని ప్రపంచ నాయకుడని సంబోధిస్తూ ట్వీట్ చేసాడు.
ఫాక్ట్ (నిజం): జో బైడెన్ మోదీని ప్రపంచ నాయకుడని సంబోధిస్తూ ట్వీట్ చేయలేదు. పైగా అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జో బైడెన్ ని అభినందిస్తూ మోదీ చేసిన ట్వీట్ కి జో బైడెన్ బదులిస్తూ ట్వీట్ చేయలేదు. పోస్టులో జో బైడెన్ ఎకౌంటుగా చెప్తున్నది నిజానికి ఒక ఫేక్ ఎకౌంటు, దానిలో వెరిఫైడ్ సింబల్ లేకపోవడం గమనించొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జో బైడెన్ ని అభినందిస్తూ ప్రధాని మోదీ 20 జనవరి 2021న ట్వీట్ చేసాడు. ఐతే ఈ ట్వీట్ కి బదులిస్తూ పోస్టులో చెప్తునట్టుగా జో బైడెన్ ఎటువంటి ట్వీట్ చేయలేదు. తన పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ మరియు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ రెంటి నుండి కూడా జో బైడెన్ మోదీ ట్వీట్ కి బదులిస్తూ ఇప్పటివరకైతే ఎటువంటి ట్వీట్ చేయలేదు.
పోస్టులో జో బైడెన్ ఎకౌంటుగా చెప్తున్నది నిజానికి ఒక పేరడీ ఎకౌంటు. పోస్టులోని బైడెన్ ట్వీట్ ని గమనిస్తే అందులో వెరిఫైడ్ సింబల్ లేదు, కాని జో బైడెన్ ఎకౌంటుకి వెరిఫైడ్ సింబల్ ఉంటుంది. పైగా పోస్టులో చెప్తున్న జో బైడెన్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా తప్పు. జో బైడెన్ అసలైన ఎకౌంటు నుండి చేసిన ఒక ట్వీట్ ని పోస్టులో ఉన్న ట్వీట్ తో పోల్చిచూస్తే ఈ తేడాలు గమనించొచ్చు.
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జో బైడెన్ ని అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేసిన నేపధ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు.
చివరగా, జో బైడెన్ మోదీని ప్రపంచ నాయకుడని సంబోధిస్తూ ట్వీట్ చేయలేదు.