“జాతీయ జెండాని కాలుస్తున్న ఆర్ఎస్ఎస్ వ్యక్తి ” అని చెప్తూ, కాలుతున్న జాతీయ జెండాని పట్టుకున్న వ్యక్తి యొక్క ఫోటో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ ఫోటోకి సంబంధించి వివరణ కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు (+91 92470 52470) చాలా అభ్యర్ధనలు వచ్చాయి. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: తమిళనాడులో టీచర్ గా పని చేస్తున్న RSS వ్యక్తి భారత దేశ జెండాని కాషాయంగా మార్చాలని జాతీయ జెండాని కాల్చి వీడియో పెట్టాడు.
ఫ్యాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్న వ్యక్తి, తమిళనాడుకు చెందిన టీచర్. ఈయన 31 మార్చి 2018లో ఒక వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియోలో మత్స్యకారులు, కావేరి మ్యానేజ్మెంట్ బోర్డు, న్యూట్రినో ప్రాజెక్టు, హైడ్రోకార్బన్ అన్వేషణ, కూడంకుళం వంటి తమిళనాడుకు కీలకమైన పలు సమస్యలపై కేంద్రం వైఖరిని ఖండిస్తూ జాతీయ జెండాను దగ్ధం చేస్తూ ప్రభు కనిపిస్తారు. పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కావున , పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, కొన్ని పాత వార్తా కథనాలు దొరికాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఈ కథనాల ప్రకారం, తమిళనాడులోని తంజావూరు జిల్లాకు చెందిన ప్రభు ఒక ప్రైవేట్ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్నారు. 31 మార్చి 2018లో ఈయన జాతీయ జెండాను కాలుస్తున్న వీడియోను సోషల్ మీడియా షేర్ చేశాడు. ఈ వీడియోలో మత్స్యకారులు, కావేరి, న్యూట్రినో ప్రాజెక్టు, హైడ్రోకార్బన్ అన్వేషణ, కూడంకుళం వంటి తమిళనాడుకు కీలకమైన పలు సమస్యలపై కేంద్రం వైఖరిని ఖండిస్తూ జాతీయ జెండాను దగ్ధం చేస్తూ ప్రభు కనిపిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశించినా కూడా కావేరీ మ్యానేజ్మెంట్ బోర్డు ఏర్పాటును ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయి అంటూ వీడియోలో ఆయన చెప్పారు. ఈ వీడియో వైరల్ కావడంతో, పోలీసుల బృందం ప్రభును అరెస్టు చేసింది. అతనిపై సెక్షన్ 153A , (వివిధ జాతులు, నివాసం మరియు భాషల మధ్య అసమానతను ప్రోత్సహించడం) మరియు 504 (2) కింద జాతీయ గౌరవానికి అవమానాన్ని నిరోధించే చట్టం (శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వక అవమానం) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ వీడియోలో ఎక్కడా కూడా, భారతదేశ జెండాని కాషాయ జెండాగా మార్చాలని ఆయన అనలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, కేంద్ర ప్రభుత్వo తన రాష్ట్ర సమస్యలను నిర్లక్ష్యం చేయడంపై నిరసనగా ఈయన జాతీయ జెండాని కాల్చారు.