“మధ్యప్రదేశ్, సింగ్రౌలిలో అదానీ పవర్ ప్లాంట్ కోసం రైతులు నుంచి భూములు లాక్కొని, వాళ్ళు నష్టపరిహారం అడుగుతుంటే ఇవ్వకుండా పోలీసులు చేత కొట్టిస్తున్న బీజేపీ సర్కార్” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో అదానీ పవర్ ప్లాంట్ భూసేకరణ కోసం రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు జనవరి 2025లో రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని సరసాని గ్రామంలో JSW సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంఘటనకు సంబంధించినవి. అంతేకాకుండా, మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో అదాని పవర్ ప్లాంట్ భూసేకరణ కోసం ఇటీవల రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేసినట్లు ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను కలిగిన అధిక నిడివి గల వీడియోను (ఆర్కైవ్డ్) 08 జనవరి 2025న రాజస్థాన్‌లోని సికర్ లోక్‌సభ ఎంపీ అమ్రా రామ్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్లు కనుగొన్నాము. “నాగౌర్‌లోని సరసాని గ్రామంలో, జెఎస్‌డబ్ల్యు (JSW) కంపెనీ నుండి తమ భూమిని కాపాడుకోవడానికి రైతులు 145 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈరోజు, జిల్లా యంత్రాంగం ఆ కంపెనీతో కలిసి నిరాయుధులైన రైతులపై పోలీసులతో లాఠీచార్జి చేయించింది. ఇందులో చాలా మంది పురుష, మహిళా రైతులు గాయపడ్డారు. ఇది చాలా దారుణమైన నేరం” అని ఈ వీడియో వివరణలో పేర్కొన్నారు (హిందీ నుండి తెలుగులోకి అనువదించగా). అలాగే ఈ క్రమంలోనే, ఇదే వైరల్ వీడియో షేర్ చేస్తూ ఈ వీడియో రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని సరసాని గ్రామంలో JSW కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంఘటనకు సంబంధించింది అని పేర్కొన్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

ఇదే వీడియోను నాగౌర్ ఎంపీ హనుమాన్ బేనివాల్ తన అధికారిక X(ట్విట్టర్)లో 08 జనవరి 2025న షేర్ (ఆర్కైవ్డ్) చేశారు. ఈ వీడియో వివరణ కూడా ఈ దృశ్యాలు రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని సరసాని గ్రామంలో JSW కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంఘటనకు సంబంధించినవి అని పేర్కొంది.
ఈ వీడియోలను వైరల్ వీడియోతో పోల్చి చూస్తే రెండూ ఒకే సంఘటను చూపిస్తున్నాయని స్పష్టమవుతుంది. దీన్ని బట్టి వైరల్ వీడియో జనవరి 2025లోరాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని సరసాని గ్రామంలో JSW కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన దృశ్యాలను చూపిస్తుందని మనం నిర్ధారించవచ్చు. వైరల్ వీడియో, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు షేర్ చేసిన వీడియో మధ్య పోలికలను క్రింద చూడవచ్చు.

తదుపరి ఈ ఘటనకు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ ఘటన 08 జనవరి 2025న నాగౌర్‌లోని సరసాని గ్రామంలో జరిగింది. సరసాని గ్రామస్తులు 134 రోజులుగా JSW సిమెంట్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. అయితే 08 జనవరి 2025న నిరసన తెలుపుతున్న ప్రజలను తొలగించడానికి భారీగా పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి, దీంతో అక్కడ ఉన్న ప్రజలు పోలీసులపై రాళ్ళు రువ్వారు. ప్రతిస్పందనగా, పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు, ఈ ఘటనలో 30 మందికిపైగా గాయపడినట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి.

వార్తా కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ), 14 ఫిబ్రవరి 2025న మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో బొగ్గుతో నిండిన ట్రక్కు మోటార్‌సైకిల్‌పై బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు, దీనితో ఆగ్రహించిన స్థానికులు రోడ్డు దిగ్బంధనం చేసి కనీసం 10 బస్సులు, ట్రక్కులకు నిప్పు పెట్టారు. అంతేకాకుండా గ్రామస్తులు విద్యుత్ ప్లాంట్‌ను (అదానీ ప్లాంట్) ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విద్యుత్ ప్లాంట్ సమీపంలో దాదాపు 200 మంది పోలీసులను మోహరించారు.
చివరగా, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు జనవరి 2025లోరాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని సరసాని గ్రామంలో JSW సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంఘటనకు సంబంధించినవి.