రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత జాతీయ గీతం “జన గణ మన” ను గౌరవిస్తూ తన నడకను ఆపి నిలబడినట్లు కనిపిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత జాతీయ గీతాన్ని గౌరవిస్తూ తన నడకను ఆపి నిలబడిన వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక ఎడిటెడ్ వీడియో. అసలు వీడియోలో USSR జాతీయ గీతం ప్లే అయినప్పుడు పుతిన్ నిలబడ్డాడు, భారత జాతీయ గీతం కాదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ వీడియో యొక్క ఇంకో వెర్షన్ ఉన్న అనేక సోషల్ మీడియా పోస్ట్‌లు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. దీంట్లో భారత జాతీయ గీతం లేదు, USSR (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్) జాతీయ గీతం మనకు వినబడుతుంది.
ఈ వీడియోలో స్టేజి వెనుక భాగంలో, ‘Congress of the All-Russian Political Party United Russia 23–24 September 2011, Moscow’ (రష్యన్ నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేశాం) అని రాసి ఉన్న బోర్డు ఉండటం మేము గమనించాము.

అలాగే, వీడియో యొక్క కింద భాగంలో www.1TV.RU అనే టెక్స్ట్ ఉండడం మేము గమనించాము. దీని ఆధారంగా తీసుకొని మేము Yandexలో ఒక కీవర్డ్ సెర్చ్ చేయగా, 24 సెప్టెంబర్ 2011న 1tv.ru న్యూస్ ప్రచురించిన ఒక వార్తా కథనంలో ఈ వీడియో యొక్క పూర్తి వెర్షన్ మాకు లభించింది (ఆర్కైవ్ చేయబడింది). వైరల్ వీడియోలోని దృశ్యాలు మనకు ఇందులో 0:00:52 టైం స్టాంప్ దగ్గర కనిపిస్తాయి, ఇందులో పుతిన్ నిలబడింది USSR గీతానికి, భారత జాతీయ గీతానికి కాదు.

ఈ కథనం ప్రకారం, ఈ వీడియో రష్యాలోని మాస్కోలోని లుజ్నికి స్పోర్ట్స్ ప్యాలెస్‌లో చిత్రించబడింది . అక్కడ 2011 సెప్టెంబర్ 23-24 తేదీల్లో, ఆల్-రష్యన్ పొలిటికల్ పార్టీ “యునైటెడ్ రష్యా” యొక్క కాంగ్రెస్ (సమావేశం) జరిగింది. ఈ సమావేశంలో, అప్పటి రష్యా అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్, 2012 అధ్యక్ష ఎన్నికలకు పార్టీ అభ్యర్థిగా వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రతిపాదించాడు.
అదనంగా, ఈ సమావేశానికి చెందిన మరిన్ని వార్తా కథనాలను మీరు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 2011 నాటి ఈ సమావేశంలో USSR గేయం ప్లే చేయబడినప్పుడు తీసిన వీడియో క్లిప్పును ఎడిట్ చేసి, “జన గన మన”ను జోడించి, తప్పుడు క్లైయిముతో మన వాళ్ళు ఇప్పుడు షేర్ చేస్తున్నారు
చివరగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత జాతీయ గీతాన్ని గౌరవిస్తూ నిలబడిన వీడియో అని చెప్తూ, ఒక ఎడిటెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు.