హర్యానాలో, ఇర్ఫాన్ అనే 21 ఏళ్ల వ్యక్తి తన 65 ఏళ్ల అమ్మమ్మ సుల్తానా ఖాటూన్‌ను వివాహం చేసుకున్నాడు అంటూ ఒక స్త్రీ, పురుషుడు మెడలో పూల దండలు ధరించి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హర్యానాలో, ఇర్ఫాన్ అనే 21 ఏళ్ల వ్యక్తి తన 65 ఏళ్ల అమ్మమ్మ సుల్తానా ఖాటూన్‌ను వివాహం చేసుకున్నాడు, అందుకు సంబంధించిన ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో యోగేష్ తివారీ అనే వ్యక్తి తన భార్యకి, ఆమె ప్రియుడికి వివాహం చేసిన సంఘటనకు సంబంధించినది. కాన్పూర్ దేహత్‌లోని రసూలాబాద్‌కు చెందిన 40 ఏళ్ల యోగేష్ తివారీకి, సోని(30) తో 2010లో పెళ్లి జరిగింది. అయితే, భార్య సోనీకి కన్నౌజ్‌కు చెందిన వికాస్ ద్వివేది (35)తో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న యోగేష్ ఇటీవల జూన్ 2025లో వారికి ఓ ఆయలంలో పెళ్లి జరిపించాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోను రిపోర్ట్ చేస్తూ జూన్ 2025లో ప్రచురించబడిన పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ వైరల్ ఫోటో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో యోగేష్ తివారీ అనే వ్యక్తి తన భార్యకు, ఆమె ప్రియుడికి వివాహం చేసిన సంఘటనకు సంబంధించినది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా దేహత్‌లోని రసూలాబాద్‌కు చెందిన 40 ఏళ్ల యోగేష్ తివారీకి, సోని(30) తో 2010లో పెళ్లి జరిగింది. వీరికి ప్రస్తుతం 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, కన్నౌజ్‌కు చెందిన 35 ఏళ్ల వికాస్ ద్వివేది, సోని మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోని ఇటీవల తన పుట్టింటికి వెళ్లింది. అయితే 23 జూన్ 2025న తిరిగి భర్త ఇంటికి వచ్చింది. అయిత్, ఆ రోజు తర్వాత, వికాస్ కూడా ఆ గ్రామంలో కనిపించాడు. అతన్ని గమనించిన యోగేష్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అతడు అక్కడినుంచి పారిపోయాడు. ఆతర్వాత యోగేష్ గ్రామ పెద్దలతో పంచాయతీ ఏర్పాటు చేయించాడు. ఈ సందర్భంగా వికాస్‌ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు సోని చెప్పింది. యోగేష్‌తో 15 ఏళ్ల వైవాహిక బంధాన్ని రద్దు చేసుకునేందుకు ఆమె అంగీకరించింది. అందరి సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సంఘటన తర్వాత యోగేష్ తన భార్య సోని, ఆమె ప్రియుడు వికాస్‌ను తిస్తీ పోలీస్ పోస్ట్ సమీపంలో ఉన్న ఆలయానికి తీసుకెళ్లి పోలీసులు, గ్రామస్తుల సమక్షంలో వారిద్దరికి పెళ్లి జరిపించాడు.

చివరగా, ఈ వైరల్ ఫోటో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో యోగేష్ తివారీ అనే వ్యక్తి తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం చేసిన సంఘటనకు సంబంధించినది.