Fake News, Telugu
 

గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బీజేపీ టోపీ, కండువా ధరించి ఉన్న ఫోటోను ‘ఆజ్ తక్’ రిపోర్ట్ చేయలేదు; ఈ వైరల్ ఫోటో AI వాడి తయారు చేసినది

0

భారతదేశ సమాచారాన్ని పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హిసార్ పోలీసులు 17 మే 2025న అరెస్టు చేశారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చేరవేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలో, ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఆజ్ తక్’ లోగోతో కూడిన జ్యోతి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ ఫోటోలో జ్యోతి మల్హోత్రా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) టోపీ, కండువా ధరించి ఉండటం మనం చూడవచ్చు. ఆమెకు బీజేపీతో సంబంధం ఉన్నట్లుగా ‘ఆజ్ తక్’ ఈ ఫోటోను రిపోర్ట్ చేసినట్లుగా ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ ఫోటోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశ సమాచారాన్ని పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బీజేపీ టోపీ, కండువా ధరించి ఉన్న ఫోటోను మీడియా సంస్థ ‘ఆజ్ తక్’ రిపోర్ట్ చేసింది.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటోను మీడియా సంస్థ ‘ఆజ్ తక్’ రిపోర్ట్ చేయలేదు. ఈ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడింది. ‘ఆజ్ తక్’ ఫాక్ట్-చెక్ విభాగం కూడా ఈ వైరల్ ఫోటోను ‘ఆజ్ తక్’ రిపోర్ట్ చేయలేదని స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా ఈ వైరల్ ఫోటోను మీడియా సంస్థ ‘ఆజ్ తక్’ రిపోర్ట్ చేసిందా అని తెలుసుకోవడానికి, మేము ‘ఆజ్ తక్’ వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) పరిశీలించాము. అయితే, ఈ వైరల్ ఫోటోను ‘ఆజ్ తక్’ షేర్ చేసినట్లు ఎలాంటి సమాచారం మాకు లభించలేదు.

ఈ వైరల్ ఫోటోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, పలు లోపాలను ఈ ఫోటోలో మనం గుర్తించవచ్చు, ఇవి ఈ వైరల్ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా తయారు చేసింది ఏమో అనే అనుమానం కలుగుతోంది.

తదుపరి, మేము ఈ వైరల్ ఫోటో AI-జనరేటెడ్? కాదా? అని నిర్ధారించడానికి,  HivewasitAISightengine, వంటి పలు AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్స్ ని ఉపయోగించి ఈ వైరల్ ఫోటోను పరిశీలించగా, ఈ వైరల్ ఫోటో 99% AI-జనరేటెడ్ ఫోటో కావచ్చని ఫలితాన్ని ఇచ్చాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి రూపొందించిందని మనం నిర్ధారించవచ్చు.

అలాగే ‘ఆజ్ తక్’ సంస్థకు చెందిన ఫాక్ట్-చెక్ విభాగం కూడా ఈ వైరల్ ఫోటోను ‘ఆజ్ తక్’ రిపోర్ట్ చేయలేదని, ఇది AI-జనరేటెడ్ ఫోటో అని పేర్కొంటూ ఫాక్ట్-చెక్ కథనాన్ని 19 మే 2025న ప్రచురించింది. అయితే, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని మేము స్వతంత్రంగా నిర్ధారించలేము.

చివరగా, గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బీజేపీ టోపీ, కండువా ధరించి ఉన్న ఫోటోను మీడియా సంస్థ ‘ఆజ్ తక్’ రిపోర్ట్ చేయలేదు. ఈ వైరల్ ఫోటో AI-జనరేటెడ్.

Share.

About Author

Comments are closed.

scroll