రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో YSRCPకి 50% ఓట్లు వస్తాయని, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన ఎన్దీఏ కూటమికి (NDA) 41% ఓట్లు వస్తాయని చెప్తున్న News18 (న్యూస్ 18) ఒపీనియన్ పోల్ స్క్రీన్‌షాట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో YSRCPకి 50% ఓట్లు వస్తాయని News18 సంస్థ ఒపీనియన్ పోల్ ఫలితాలు విడుదల చేసింది.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ News18 ఒపీనియన్ పోల్ ఫలితాలను చూపుతున్న స్క్రీన్‌షాట్ ఎడిట్ చేయబడినది. వాస్తవంగా, 14 మార్చ్ 2024న News18 సంస్థ లోక్‌సభ ఎన్నికలు 2024కి సంబంధించి ‘మెగా ఒపీనియన్ పోల్’ ఫలితాలని విడుదల చేసింది. ఈ ఒపీనియన్ పోల్ ఫలితాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన NDA కూటమికి 50 శాతం ఓట్లు, 18 సీట్లు వచ్చే అవకాశం ఉందని. అలాగే, YSRCPకి 41 శాతం ఓట్లు, 7 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
2024 లోక్‌సభ ఎన్నికలకి సంబంధించి న్యూస్18 చేపట్టిన ‘మెగా ఒపీనియన్ పోల్’ ఫలితాలని, News18 (న్యూస్ 18) సంస్థ 14 మార్చ్ 2024న విడుదల చేసింది. ఈ ఒపీనియన్ పోల్స్ ప్రకారం మొత్తం 543 లోక్‌సభ సీట్లలో, బీజేపీ నాయకత్వంలోని NDA కూటమికి 411 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న I.N.D.I.A కూటమికి 105 సీట్లు వస్తాయని, ఇతరులకు 27 సీట్లు వస్తాయని తెలిపింది. ఈ ఫలితాలను 14 మార్చ్ 2024న News18 తమ యూట్యూబ్ ఛానల్ నందు లైవ్ ప్రసారం కూడా చేసారు. ఇదే ఫలితాలను NEWS 18 తమ వెబ్సైట్లో కూడా పబ్లిష్ చేసింది.

ఈ News18 విడుదల చేసిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన NDA కూటమికి 50 శాతం ఓట్లు, 18 సీట్లు వచ్చే అవకాశం ఉందని. అలాగే, YSRCPకి 41 శాతం ఓట్లు, 7 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అసలు వీడియోలో YSRCP పేరు మొదటి వరుసలో ఉండగా, వైరల్ స్క్రీన్‌షాట్‌లో YSRCP పేరు రెండవ వరుసలో ఉంది. దీన్ని బట్టి పార్టీల వరుసలు ఎడిట్ చేస్తూ ఈ వైరల్ స్క్రీన్‌షాట్‌ను రూపొందించారని నిర్థారించవచ్చు.

చివరగా, News18 విడుదల చేసిన 2024 లోక్‌సభ ఎన్నికల ఒపీనియన్ పోల్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో YSRCP ముందుంది అని చెప్తున్న ఈ స్క్రీన్‌షాట్ ఎడిట్ చేయబడినది.