నోట్ల కట్టలతో పట్టుబడ్డ నారా లోకేష్ అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ‘ఎన్నికల సందర్భంగా పోలీసులు జరిపిన తనిఖీలలో లోకేష్ కాన్వాయ్‌లో ఎనిమిది కోట్ల నగదు దొరికాయని’ న్యూస్ రీడర్ వార్త చదువుతున్నట్టు ఈ వీడియోలో పోలీసులు లోకేష్ కాన్వాయ్ తనిఖీ చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: పోలీసులు జరిపిన తనిఖీలలో నారా లోకేష్ కాన్వాయ్‌లో ఎనిమిది కోట్ల నగదు దొరికింది.
ఫాక్ట్(నిజం): ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు పలు సార్లు నారా లోకేష్ కాన్వాయ్‌ను తనిఖీ చేసారు. ఐతే ఈ తనిఖీలలో డబ్బులు/అభ్యంతరకర వస్తువులేవి దొరకలేదు. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో రెండు వేరువేరు ఘటనలకు సంబంధించిన ఆడియో రిపోర్ట్‌లను డిజిటల్‌గా జోడించి రూపొందించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నారా లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు పలు సార్లు తనిఖీలు చేసిన వార్త నిజమే అయినప్పటికీ, ఈ తనిఖీలలో లోకేష్ కాన్వాయ్‌లో డబ్బులు దొరికాయన్న వార్తలో ఎలాంటి నిజం లేదు. కాగా ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసింది.
ముందుగా షేర్ అవుతున్న ఈ వీడియోలో రెండు భిన్నమైన ఆడియోలను గమనించవచ్చు. ఇందులోని మొదటి ఆడియోలో ‘TDP యువనేత నారా లోకేష్ కారును పోలీసులు తనిఖీ చేసారు, ఉండవల్లి కరకట్ట సమీపంలో లోకేష్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీలు జరిపారు’ అంటూ మహిళా న్యూస్ రీడర్ వార్త చదువుతుండడం గమనించవచ్చు. ఐతే దీని ఆధారంగా ఈ వార్తలకు సంబంధించిన రిపోర్ట్స్ కోసం యూట్యూబ్‌లో వెతకగా ఇదే ఆడియోతో ఉన్న లోకేష్ కాన్వాయ్ తనిఖీ ఘటనకు సంబంధించిన ABN వార్తా కథనం మాకు కనిపించింది.

ప్రస్తుతం షేర్ అవుతున్న దృశ్యాలు ఈ రిపోర్ట్ నుండి సేకరించినవే. ఐతే ఈ కథనంలో ఇది ఒక సాధారణ తనిఖీ అని, లోకేష్ పోలీసులకు పూర్తిగా సహకరించారని, తనిఖీల్లో లోకేష్ కాన్వాయ్‌లో డబ్బులు/అభ్యంతరకర వస్తువులేవీ దొరకలేదని రిపోర్ట్ చేసారు.
కాగా వైరల్ అవుతున్న వీడియోలోని రెండో ఆడియోకు సంబంధించి యూట్యూబ్‌లో వెతకగా అక్టోబర్ 2022లో హైదరాబాద్‌లో ఎనిమిది కోట్ల హవాల డబ్బు పట్టుకున్న వార్తకు సంబంధించిన ETV Telangana రిపోర్ట్ మాకు కనిపించింది. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నట్టే ఈ కథనంలో న్యూస్ రీడర్ ‘సుమారు ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా నగదు పట్టుబడింది’ అంటూ వార్తను చదువుతూ ఉంటుంది.

దీన్నిబట్టి రెండు వేరువేరు ఘటనలకు సంబంధించిన వార్తా కథనాలలోని ఆడియోలను డిజిటల్‌గా అతికించి నారా లోకేష్ కాన్వాయ్‌లో డబ్బులు దొరికినట్టు చిత్రీకరించారని స్పష్టమవుతుంది. కాగా నారా లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు పలు సార్లు తనిఖీలు చేయడంతో అయన అసహనం వ్యక్తం చేసినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). కానీ, అయన కాన్వాయ్‌లో డబ్బు దొరికినట్టు మాత్రం ఎలాంటి రిపోర్ట్స్ లేవు.
చివరగా, నారా లోకేష్ కాన్వాయ్‌లో ఎనిమిది కోట్ల నగదు దొరికిందంటూ డిజిటల్‌గా ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.