Fake News, Telugu
 

చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డ ఈ ఫోటో 2019 నాటిది, ఏప్రిల్ 2025 సంఘటనకి చెందినది కాదు.

0

హైదరాబాదులోని చారిత్రాత్మక కట్టడం అయిన చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) చక్కర్లు కొడుతోంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: ఏప్రిల్ 2025లో పెచ్చులు ఊడి పడిపోయి ఉన్న చార్మినార్‌ను ఈ ఫోటో చూపిస్తుంది.

ఫ్యాక్ట్: భారీ వర్షాల కారణంగా 3 ఏప్రిల్ 2025న చార్మినార్‌లోని ఒక మినార్ (నాలుగు స్తంబాల్లో ఒకటి) నుంచి పెచ్చులు ఊడి కింద పడిపోయాయి అని చాలా వార్తా కథనాలు ఉన్నాయి. కానీ ఈ ఫోటో మాత్రం ఇప్పటిది కాదు, 2019లో ఇదే విధంగా చార్మినార్ నుంచి సున్నం పెచ్చులు ఊడి పడినప్పటిది. కాబట్టి, ఈ క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

ఈ క్లయిమ్‌ను వెరిఫై చేయడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, 3 ఏప్రిల్ 2025న హైదరాబాదులో కురిసిన అకాల భారీ వర్షం కారణంగా, చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి అని చెప్పి మాకు పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

ఈ కథనాల ప్రకారం, భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న ఒక మినార్ (నాలుగు స్తంబాల్లో ఒకటి) నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. కానీ ఈ సంఘటనకి చెందిన ఈ వార్తా కథనాల్లో ఉన్న దృశ్యాలకి, వైరల్ ఫోటోకి మధ్య వ్యత్యాసం ఉంది అని మేము గమనించాం. అలాగే, ఈ కథనాల్లో వైరల్ అవుతున్న ఫోటో కూడా లేదు.

వైరల్ ఫోటో గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ ఫోటో 2019 నాటిది అని మాకు తెలిసింది. మే 2019 నాటి బిబిసి వారి ఒక వార్తా కథనం ప్రకారం, అప్పుడు కూడా ఇప్పుడు జరిగినట్లుగానే చార్మినార్లోని ఒక మినార్ నుంచి సున్నం పెచ్చులు ఊడి పడ్డాయి. 

ఈ వార్తా కథనం ప్రకారం ‘చార్మినార్‌కి ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గత 20-30 సంవత్సరాల్లో అనేకసార్లు చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. కానీ అప్పుడెప్పుడూ జరగనట్టుగా, ఈసారి 2 మీటర్లపైనే వెడల్పున్న భాగం ఊడి పడింది.’ ఈ ఫోటోకి, వైరల్ ఫోటోకి మధ్య ఉన్న పోలికను మీరు ఈ కింది కొల్లాజ్‌లో చూడవచ్చు.

ఇదే విషయంపై మే 2019లో వచ్చిన మరిన్ని వార్తా కథనాలను మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 

చివరగా, చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డ ఈ ఫోటో 2019 నాటిది, ఏప్రిల్ 2025 సంఘటనకి చెందినది కాదు

Share.

About Author

Comments are closed.

scroll