‘ఇవి దీపావళి భూ చక్రాలు అనుకునేరు కాదంన్డోయ్.. హైదరాబాదులో ఒక విచిత్రమైన వింత ఆక్సిడెంట్ .. దానివల్ల ట్రాఫిక్ జామ్..!! ఇద్దరు వాహనదారులు సేఫ్..’ అని చెప్తూ రెండు మోటార్ బైకులు ఒక దానికి ఒకటి అల్లుకుని రోడ్డుపై తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: రెండు మోటార్ బైకులు ఒకదానికి ఒకటి అల్లుకొని రోడ్డుపై తిరుగుతున్న ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది.
ఫ్యాక్ట్ (నిజం): ఈ సంఘటన ఇండోనేషియాలోని పేకాన్‌బరు నగరంలో ఉన్న జలాన్ ఆరిఫిన్ అహ్మద్ అనే ప్రదేశంలో జరిగింది. ఈ వీడియోతో హైదరాబాదుకి గానీ, భారత దేశానికి గానీ సంబంధం లేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వీడియో గురించి వచ్చిన కొన్ని భారతీయ వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) . ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటన జైపుర్‌లోని మానసరోవర్ ప్రదేశంలో జరిగిందని ఈ కథనాలు పేర్కొన్నాయి.

ఈ కథనాల్లో @jaipurkajalwa అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ వారు పోస్ట్ చేసిన వీడియోని లింక్ చేశారు. ఈ పోస్టులో, ఈ సంఘటన మానసరోవర్ ఏరియాలో జరిగిందని చెప్తూ, #jaipur #jaipurcity అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి అప్లోడ్ చేశారు (ఆర్కైవ్ లింక్) .

అయితే, ఈ వీడియోలో ఉన్న ఒక మోటార్ బైక్ పైన ఉన్న నెంబర్ ప్లేట్ చూశాక, మాకు ఇది భారతదేశంలో జరిగిన సంఘటన కాకపోవచ్చు అనే అనుమానం కలిగింది. ఆ బండి నెంబర్ – BM 3675 FC. భారత్‌లో BM అనే కోడ్ ఏ రాష్ట్రానికీ లేదు.

ఆ తర్వాత, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, BM అనేది ఇండోనేషియా దేశంలోని రియావు ప్రావిన్స్ యొక్క కోడ్ అని మాకు తెలిసింది (ఇక్కడ, ఇక్కడ). దీన్ని ఆధారంగా తీసుకొని, ఇండోనేషియన్ భాష (భాషా ఇండోనేషియా) కీవర్డ్స్ ఊయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వీడియోకి సంబంధించిన కొన్ని ఇండోనేషియన్ వార్తా సంస్థల సోషల్ మీడియా పోస్టులు మాకు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ ).
అలాగే ఈ సంఘటన ఇండోనేసియాలోని రియావు ప్రావిన్స్‌లో ఉన్న పేకాన్‌బరు నగరంలోని జలాన్ ఆరిఫిన్ అహ్మద్ అనే ఏరియాలో జరిగిందని మరికొన్ని ఇండోనేషియన్ మీడియా సంస్థల వారు 18 ఆగస్ట్ 2025న అప్లోడ్ చేసిన తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో పేర్కొన్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

ఆ తర్వాత, ఈ వీడియోని తీసిన ప్రదేశాన్ని మేము గూగుల్ మ్యాప్స్‌లో కనుగొన్నాము. ఈ సంఘటన పేకాన్‌బరు నగరంలోని ‘124, Jil Arfin Ahmad Road’లో జరిగింది. వైరల్ వీడియోలో ఉన్న ప్రదేశానికి గూగుల్ మ్యాప్స్‌లో మేము కనుగొన్న ఈ ప్రదేశానికి మధ్య ఉన్న పోలికలను మీరు ఈ కింది కొల్లాజ్‌లలో చూడవచ్చు. దీనిబట్టి ఈ వీడియోకు భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదని మనకు అర్థం అవుతుంది.


చివరగా, రెండు బైకులు ఒకదానికి ఒకటి అల్లేసుకొని రోడ్డుపై గుండ్రంగా తిరుగుతున్న ఈ వీడియో ఇండోనేషియాలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించింది, భారత్ కాదు.