‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఉన్నాయి’ అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించిందని BBC ప్రచురించినట్టు ఆ సంస్థ టెంప్లేట్‌తో ఒక న్యూస్ క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘చంద్రబాబుకు ఇదే చివరి ఎన్నిక కావడంతో ప్రజలను మోసం చేసి, పీఠం ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు. పార్టీ శ్రేణులు కేంద్రంలో బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోనే పరిగణలోకి తీసుకోవాలని’ కూడా పురందేశ్వరి అన్నట్టు ఈ క్లిప్‌లో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ క్లిప్‌కు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఉన్నాయి’ అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించింది – BBC న్యూస్ క్లిప్
ఫాక్ట్(నిజం): ఈ వార్తను తాము ప్రచురించలేదని, ఇది ఫేక్ న్యూస్ అని BBC స్పష్టం చేసింది. పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేసినట్టు మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. టీడీపీ, జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను స్వాగతిస్తున్నామని BJP స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు కలిసి ‘ప్రజాగళం’ పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో BJP రాష్ట్ర సహ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ కానీ, ఏపీ BJP అధ్యక్షురాలు పురందేశ్వరి ఫోటో లేకపోవడంపై పలు రకాల చర్చ జరుగుతోంది. దీనిపై సీఎం జగన్ మాట్లాడుతూ ఆచరణకు సాధ్యం కాని హామీలకు బీజేపీ దూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే పురందేశ్వరి కూడా ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేసినట్టు BBC పేరుతో ఒక క్లిప్ షేర్ అవుతుంది. ఐతే నిజానికి BBC ఈ క్లిప్‌ను ప్రచురించలేదు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో దీనిపై వివరణ ఇస్తూ ‘ఇది BBC ప్రచురించింది కాదు. ఇది ఫేక్ న్యూస్’ అని తెలిపింది. కాగా BJP అధ్యక్షురాలు పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేసినట్టు మాకు ఆధారాలు కూడా లభించలేదు.
ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు విడుదల చేసిన మేనిఫెస్టోకు దూరంగా ఉంటుందన్న వార్తలపై BJP స్పందించింది. టీడీపీ, జనసేన మేనిఫెస్టోని స్వాగతిస్తున్నట్లుగా బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధికార ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టీడీపీ, జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో – 2024ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది’ అని ట్వీట్ చేసింది. దీనితో మేనిఫెస్టోకు BJP మద్దతు ఉందని తెలుస్తుంది.
చివరగా, టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను పురందేశ్వరి విమర్శించిందంటూ BBC పేరుతో షేర్ అవుతున్న ఈ క్లిప్ ఫేక్.