శ్రీ కృష్ణుడు పూరించిన “పాంచజన్య శంఖు” ని శ్రీలంకలోని కొలంబో నేషనల్ మ్యూజియంలో పొందుపరిచినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. అధ్బుతంగా చెక్కబడిన ప్రాచీన శంఖం యొక్క ఫోటోని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: శ్రీలంక కొలంబో నేషనల్ మ్యూజియంలో పొందుపరిచిన శ్రీ కృష్ణుడి శంఖం యొక్క ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో కనిపిస్తున్న ఈ శంఖం శ్రీలంకలోని కొలంబో నేషనల్ మ్యూజియంలో పొందుపరిచిన మాట వాస్తవం. ఈ శంఖం 16 లేదా 17 శతాబ్దంలో తమిళ శాసనాలతో చెక్కబడినట్టు శ్రీలంక టూరిస్ట్ గైడ్ వెబ్సైటు ‘Lanka Pradeepa’ తెలిపింది. భారతీయ ఇతిహాసాలు శ్రీ కృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో జీవించినట్టు తెలుపుతున్నాయి. దీన్ని బట్టి, ఈ శంఖంతో శ్రీ కృష్ణుడికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టమయింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన శంఖం యొక్క ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే శంఖం యొక్క ఫోటోని పలు వెబ్సైటులో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ అధ్బుత శంఖం శ్రీలంకలోని కొలంబో నేషనల్ మ్యూజియంలో పొందుపరిచినట్టు ఈ వెబ్ సైట్స్ తెలిపాయి.
కొలంబో నేషనల్ మ్యూజియంలో పొందుపరిచిన ఈ శంఖం యొక్క చరిత్ర కోసం కీ పదాలు ఉపయోగించి గూగుల్ లో వెతకగా, ఈ శంఖం యొక్క చరిత్రను వివరిస్తూ శ్రీలంక టూరిస్ట్ వెబ్సైటు ‘Lanka Pradeepa’ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. హంస ఆకారంలో ఉన్న ఈ శంఖాన్ని 16 లేదా 17 శతాబ్దంలో తమిళ శాసనాలతో చెక్కబడినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. ఈ శంఖం హిందూ మహా సముద్రంలో లభించే వాలంపురి శంఖాల రకానికి సంబంధించిందని ఇందులో తెలిపారు. ఈ శంఖం పై చెక్కిన శివ లింగం మరియు నంది విగ్రహాల బట్టి, ఈ శంఖాన్ని ఒక శైవ దేవాలయానికి బహుమతిగా ఇచ్చినట్టు శ్రీలంక చరిత్రకారుడు పాత్మనతాన్ నిర్ధారించినట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది.
భారతీయ ఇతిహాసాల ప్రకారం శ్రీ కృష్ణుడు ఐదువేల సంవత్సరాల క్రితం (కనీసం 3228 BC సంవత్సరాల క్రితం) భారతదేశంలోని మథుర నగరంలో జన్మించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ న్యూస్ సంస్థలు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి, కొలంబో నేషనల్ మ్యూజియంలో పొందుపరిచిన ఫోటోలోని శంఖానికి శ్రీ కృష్ణుడికి చరిత్రకి ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, కొలంబో నేషనల్ మ్యూజియంలో పొందుపరిచిన ఈ అద్భుత శంఖంతో శ్రీకృష్ణుడి చరిత్రకు ఎటువంటి సంబంధం లేదు.