Fake News, Telugu
 

SMS, WhatsApp ద్వారా పంపబడిన ఈ పెండింగ్ ట్రాఫిక్ చలాన్ లింకులు ఫేక్

0

ఇటీవల వాట్సాప్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు, SMS ద్వారా పెండింగ్ ట్రాఫిక్ చలాన్ లింక్‌లు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ మెసేజెస్ అసలైన ట్రాఫిక్ పోలీసుల అధికారిక నోటిఫికేషన్‌ను పోలి ఉండి, ట్రాఫిక్ జరిమానా పెండింగ్‌లో ఉందని పేర్కొంటూ, చెల్లింపు చేయడానికి లింక్‌పై క్లిక్ చేయమని అడుగుతున్నాయి. ఈ లింక్‌లు నిజమైనవా కాదా అని స్పష్టత కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్ (+91 92470 52470) కు అనేక అభ్యర్థనలు వచ్చాయి. దీని వెనుక ఉన్న నిజానిజాలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ చెల్లింపు వెబ్‌సైట్‌ లింక్‌లు SMS, WhatsApp ద్వారా షేర్ చెయ్యబడుతున్నాయి.

ఫాక్ట్ (నిజం): ఈ లింకులు నిజమైనవి కావు, వినియోగదారులను మోసం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. సైబర్ మోసగాళ్ళు అధికారిక ట్రాఫిక్ పోలీసు నోటిఫికేషన్‌లను అనుకరించే నకిలీ ఇ-చలాన్ మెసేజ్‌లను పంపి, బాధితుల కార్డు వివరాలు, OTPలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఫేక్ వెబ్‌సైట్‌లను షేర్ చేస్తున్నారు. అధికారిక పరివాహన్ ఇ-చలాన్ పోర్టల్ లేదా రాష్ట్ర ట్రాఫిక్ పోలీసు వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే చలాన్‌లను ధృవీకరించాలని, మెసేజ్‌లలో చెల్లింపు లింక్‌లను క్లిక్ చేయకుండా ఉండాలని పోలీసులు పౌరులకు సూచించారు. కాబట్టి, పోస్ట్‌లో చేసిన వాదన తప్పు.

వైరల్ మెసేజ్‌లలో ఇచ్చే లింకులను వెరిఫై చేయటానికి వాటిపై క్లిక్ చేసి ఒక చెల్లని వాహనం యొక్క నంబర్‌ను ఎంటర్ చేశాము. ఇది చెల్లుబాటు అయ్యే వాహన సంఖ్య కానప్పటికీ, వేగంగా వాహనం నడపడం వాళ్ల ₹500 చలాన్ పెండింగ్‌లో ఉందని చూపించింది. తర్వాత, వేరు వేరు అక్షరాలు, సంఖ్యలను ఎంటర్ చేస్తు పరీక్షించగా, ప్రతిసారీ లింక్ అదే ₹500 జరిమానాను చూపించడం గమనించాం. ఇది లింక్ నిజమైనది కాదని సూచిస్తుంది. గడువు తేదీలోపు జరిమానా చెల్లించడంలో విఫలమైతే అదనపు భారీ జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్, కోర్టు సమన్లు, చట్టపరమైన చర్యలు, తీవ్రమైన కేసులలో వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని పేజీలోని ఒక వెబ్సైటులో ఒక నోటీసు పేర్కొంది.

తదుపరి, లింక్ యొక్క URL లో సాధారణంగా అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో ఉండే “.gov” లేదని మేము గమనించాము. మేము దానిని తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఈ-చలాన్ వెబ్‌సైట్, కేంద్రం యొక్క పరివాహన్ ఈ-చలాన్ పోర్టల్‌తో పోల్చాము, ఈ రెండింటి వెబ్ అడ్రస్‌లలొ “.gov” ఉంది. వైరల్ లింక్‌లలో ఈ ఫీచర్ లేదు. 

దీని గురించి మరింత వెతికితే, తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఈ-చలాన్ వెబ్‌సైట్‌లో తెలంగాణ ఈ-చలాన్ సేవలను అనుకరిస్తూ మోసపూరిత వెబ్‌సైట్‌లు, మొబైల్ అప్లికేషన్‌లు షేర్ చెబ్బడుతున్నాయని పేర్కొంటూ ఒక నోటీసు కూడా జారీ చేయటం మేము గమనించాము. తెలంగాణ ఈ-చలాన్ సేవలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయాలని, అధికారులు ఫోన్ కాల్‌లు, ఇమెయిల్‌లు, సందేశాలు లేదా లింక్‌ల ద్వారా పాస్‌వర్డ్‌లు, OTPలు, చెల్లింపు వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ అడగరని నోటీసు స్పష్టం చేస్తుంది. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే సమీప పోలీసు అధికారులకు నివేదించాలని మరియు అధికారిక SMS హెడర్ “ECHALN-*” నుండి అందుకున్న తెలంగాణ ట్రాఫిక్ చలాన్ సందేశాలను మాత్రమే నమ్మాలని వినియోగదారులకు సూచించింది. హైదరాబాద్ పోలీసులే కాకుండా బెంగళూరు పోలీసులు, ఢిల్లీ పోలీసులు కూడా దీని గురించి పౌరులను హెచ్చరించారు.

సైబర్ మోసగాళ్ళు అధికారిక ట్రాఫిక్ పోలీసు నోటిఫికేషన్‌లను అనుకరిస్తూ నకిలీ ఈ-చలాన్ సందేశాలతో వాహనదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, దీనివల్ల గణనీయమైన ఆర్థిక నష్టాలు సంభవిస్తున్నాయని అనేక మీడియా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) హైలైట్ చేశాయి. ఈ నకిలీ లింక్‌లను క్లిక్ చేయడం వల్ల వినియోగదారులు కార్డు వివరాలు, OTPలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే నకిలీ వెబ్‌సైట్‌లకు దారి తీస్తాయి. అధికారిక పరివాహన్ ఈ-చలాన్ పోర్టల్ లేదా సంబంధిత రాష్ట్ర ట్రాఫిక్ పోలీసు వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే చలాన్ వివరాలను ధృవీకరించాలని, సందేశాల నుండి చెల్లింపు లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దని అధికారులు సలహా ఇస్తున్నారు.

చివరగా, SMS, WhatsApp ద్వారా పంపబడిన ఈ పెండింగ్ ట్రాఫిక్ చలాన్ లింకులు ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll