Fake News, Telugu
 

సిరియన్ గాయని సరియా అల్-సావాస్‌కు వివిధ దేశాలకు చెందిన వేర్వేరు భర్తలతో నలుగురు పిల్లలు ఉన్నారని ఒక ఫేక్ వార్త షేర్ చేస్తున్నారు

0

సరియా అల్వాస్ అనే సిరియాకు చెందిన సామాజిక కార్యకర్త, తన నలుగురు పిల్లలతో దిగిన ఫోటో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమెకు నలుగురు భర్తలని, ఒక్కో అతను ఒక్కో దేశానికి చెందిన వ్యక్తి అని చెప్తూ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఈ నలుగురు పిల్లల్లు ఒక్కొక్కరు ఒక్కో తండ్రికి పుట్టారని, అలాగే తను ఇప్పుడు తన ఐదవ భర్తతో, ఇంకో బిడ్డకు తల్లి కాబోతుంది అని వైరల్ పోస్టు యొక్క వివరణలో పేర్కొన్నారు సోషల్ మీడియా యూజర్లు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు సరియా అల్వాస్. సిరియాకు చెందిన ఈమెకు నలుగురు వేరే దేశ పురుషులతో పెళ్లి అయ్యింది. ఈ ఫొటోలో ఉన్న ఒక్కో బిడ్డకు తండ్రి ఈ ఒక్కో దేశానికి చెందిన తన భర్తలు.  

ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక ఎడిట్ చేసిన ఫోటో. అసలు ఫొటోలో సరియా అల్-సావాస్ ముగ్గురు పిల్లల పక్కన నిలబడి ఉంటారు. వైరల్ ఫోటోలోని ఇద్దరు ఆడపిల్లలు తన సొంత కుమార్తెలని, వారి తండ్రి సిరియన్ అని, అబ్బాయి తన మేనల్లుడు అని సరియా అల్-సావాస్ స్పష్టం చేసింది. తనకు నాలుగు వివాహాలు కాలేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు సరియా అల్-సావాస్ అని మాకు తెలిసింది. వైరల్ పోస్టులో చెప్తున్నట్లుగా, ఈమె సిరియా దేశానికి చెందిన వారు. ఆమె ఒక గాయని. వైరల్ క్లెయిమ్ గురించి ఒక వివరణ ఇస్తూ, సరియా 14 డిసెంబర్ 2019న ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేసారు (ఆర్కైవ్ లింక్) . ఇందులో తను వైరల్ అవుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. కానీ ఈ ఫొటోలో ముగ్గురు పిల్లలు మాత్రమే ఉన్నారు. అంటే వైరల్ ఫొటోలో ఉన్న అబ్బాయిని ఎడిట్ చేసి జోడించారని మనకు అర్థం అవుతుంది. 

ఈ ఫోటో గురించి సరియా ఈ పోస్టు ద్వారా మాట్లాడుతూ, అందులో ఉన్న ఇద్దరు బాలికలు తన సొంత కుమార్తెలని, ఆ బాలుడు తన మేనల్లుడని  చెప్పారు. వీళ్ళందరూ సిరియా దేశ పౌరులేనని, తనకు చాలా సార్లు పెళ్లి అయింది అనే పుకారుని తోసిపుచ్చారు.  

అదనంగా, ఈ విషయంపై సరియా అల్-సావాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఒక వివరణ ఇచ్చారు అని చెప్పి మాకో వార్తా కథనం దొరికింది. తను ముగ్గురు అరబ్ దేశస్థులను పెళ్లాడింది అనే పుకార్లలో నిజం లేదని తను ఈ స్టోరీ ద్వారా చెప్పిందని ఈ రిపోర్ట్ పేర్కొంది. 

2018లో సరియా ఆల్-సావాస్ ఇరాక్ దేశ ఎంపీ తలాల్ అల్-జవావిని పెళ్లి చేసుకోనుంది అని కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తలాల్ అల్-జవావి మీడియాకు చెప్పారు (ఇక్కడ, ఇక్కడ). 

చివరగా, సిరియన్ గాయని సరియా అల్-సావాస్‌కు వివిధ దేశాలకు చెందిన వేర్వేరు భర్తలతో పిల్లలు ఉన్నారని ఒక ఫేక్ వార్త షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll