పాత పెన్షన్ పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందంటూ క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. అన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు వీలైనంత త్వరగా పాత పెన్షన్ స్కీమ్‌ను అందించాలని దేశంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని కూడా పోస్టు చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా అ విషయనికి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: పాత పెన్షన్ పునరుద్ధరించాలి, దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు వీలైనంత త్వరగా పాత పెన్షన్ స్కీమ్‌ను అందించాలి – సుప్రీంకోర్టు.
ఫాక్ట్ (నిజం): కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు చెప్పలేదు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దిస్తామని ప్రకటించాయి. ఐతే కేంద్ర ప్రభుత్వం మాత్రం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే ఉద్దేశం లేదని ఇటీవల పలు సందర్భాలలో పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు చెప్పలేదు. పాత పెన్షన్ విధానం అమలుపై సుప్రీంకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒకవేళ సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు వెలువరించి ఉంటే, మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని ఈ విషయానికి సంబంధించి మాకు ఎటువంటి కథనాలు లభించలేదు.
గత నెల, రాజస్తాన్ ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ప్రకటించారు. అదేవిధంగా గత వారం, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దిస్తామని ప్రకటించారు. ఇదే క్రమంలో అనేక రాష్ట్రాలలో కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్స్ వస్తున్నాయి.
ఐతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు సందర్భాలలో కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించే ఉద్దేశం లేదని పార్లమెంట్‌లో స్పష్టం చేసింది (ఇక్కడ మరియు ఇక్కడ).
ఐతే కొన్ని బ్లాగ్స్ (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) సుప్రీంకోర్టు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తీర్పు చేప్పిందంటూ రాయడంతో సోషల్ మీడియాలో ఈ వార్త షేర్ అవుతుంది. కానీ ఈ వార్తలకు విశ్వసనీయత లేదు.
చివరగా, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ఏది లేదు.
Update (26 మార్చ్ 2022)
01 జనవరి 2004 కన్నా ముందే నియామక పరిక్షలో సెలెక్ట్ అయ్యి, 01 జనవరి 2004 తర్వాత ఉద్యోగంలో నియమించబడ్డ వారు తమకు పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని కోర్టును సంప్రదించడంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
కోర్టు తీర్పు నేపథ్యంలో 01 జనవరి 2004 ముందే నియామక పరీక్ష ఫలితాలు విడుదలై సెలెక్ట్ (వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ) అయినవారు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972 ( పాత పెన్షన్ విధానం )కి అర్హులని 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా 01 జనవరి 2004 కన్నా ముందే నియామక పరిక్షలో సెలెక్ట్ అయ్యి, 01 జనవరి 2004 తర్వాత ఉద్యోగంలో నియమించబడ్డవారు ఉద్యోగులేవరైతే కొత్త పెన్షన్ పొందుతున్నారో వారికి పాత పెన్షన్ పొందేందుకు ఒక అవకాశం ఇచ్చింది (one time option). వీరు కొత్త లేదా పాత పెన్షన్ విధానంలో ఏదైనా ఒకటి ఎంచుకోవొచ్చు.
కాకపోతే కేవలం 01 జనవరి 2004 కన్నా ముందు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలై 01 జనవరి 2004 తరవాత నియామక ప్రక్రియ పూర్తయిన వారికి మాత్రం కొత్త పెన్షన్ విధానమే అమలవుతుంది. వీరికి పాత పెన్షన్ పొందే అవకాశాన్ని ఇవ్వలేదు.