ఆవు పేడ పిడకలపై రోజూ పది నుండి పదేహేను నిమిషాలు పాదాలు ఉంచడం ద్వారా మధుమేహాన్ని పూర్తిగా నియంత్రించవచ్చని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఉమేష్ అనే వ్యక్తి రోజుకు 10 నుండి 15 సార్లు పది నిమిషాల సమయం ఆవు పేడ పిడకలపై పాదాలు పెట్టడం ద్వారా 15 రోజుల్లోనే అతని మధుమేహం 250 నుండి 129కి వచ్చిందంటూ ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆవు పిడకల ద్వారా శరీరంలో షుగర్ లెవెల్స్‌లను నియంత్రించడం ద్వారా కాలేయం, మూత్రపిండాలు మరియు గుండెపై వచ్చే దుష్ప్రభావాలు కూడా చాలా వరకు తక్కువ చేసుకోవచ్చని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఆవు పేడ పిడకలపై ఎక్కువసేపు పాదాలు పెట్టడం ద్వారా మధుమేహం వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చు.
ఫాక్ట్ (నిజం): ఆవు పేడకు మధుమేహం వ్యాధిని నియంత్రించగలిగే సామర్ధ్యం ఉన్నట్టు గానీ, ఆవు పేడ పిడకలపై పాదాలు పెట్టడం ద్వారా కాలేయం మరియు గుండె జబ్బులు తక్కువ చేసుకోవచ్చని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. 2007లో ఆవు పేడపై నడవడం ద్వారా మధుమేహం తగ్గుతుందని హైదరాబాద్ నగరవాసులు కొందరు గోశాలలో అమర్చిన ఆవు పేడపై నడిచిన ఘటనను పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అయితే, ఆవు పేడ యొక్క వైద్య లక్షణాలకు సంబంధించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇదంతా తమకు ఒక కామెడీగా కనిపిస్తుందని డాక్టర్లు ఈ ఘటనకు సంబంధించి అప్పుడు స్పందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఆవు పేడ పిడకలపై పాదాలు పెట్టడం ద్వారా మధుమేహం వ్యాధిని తక్కువ చేసుకోవచ్చని ఏ ఒక్క శాస్త్రీయ అధ్యయనం నిర్ధారించలేదని తెలిసింది.
ఆవు పాలు, మూత్రం, పేడ, నెయ్యి, పెరుగు/మజ్జిగ మిశ్రమంతో తయారుచేసే పంచగవ్య ఉత్పత్తులను ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. పంచగవ్య ఉత్పత్తులకు క్యాన్సర్, హెచ్ఐవి ఎయిడ్స్, డయాబెటిస్ మరియు ఇతర వ్యాధులను ఎదుర్కొనే శక్తి ఉంటుందని తెలుపుతూ అమెరికా నేషనల్ సెంటర్ ఫర్ బైయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) వెబ్సైట్లో భారత దేశానికి చెందిన కొందరు పరిశోధకులు పేపర్లు పబ్లిష్ చేశారు. కానీ, ఆవు పేడపై నడవడం వలన మధుమేహం తగ్గుతుందని ఏ ఒక్క శాస్త్రీయ పరిశోధన నిర్ధారించలేదు.
భారత ప్రభుత్వ పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ పంచగవ్య ఉత్పత్తులకు సంబంధించి, వాటి వైద్య ఉపయోగాలకు సంబంధించి తమ వెబ్సైటులో తెలిపారు. చర్మ వ్యాధులు, బ్రైట్స్ మరియు ఇతర కొన్ని వ్యాధులకు పంచగవ్య ఉత్పత్తులను ఔషధాలుగా ఉపయోగిస్తారని పశుసంవర్ధక శాఖ తెలిపింది. కానీ, పంచగవ్య ఉత్పత్తులను ఉపయోగించి మధుమేహం వ్యాధిని తక్కువ చేసుకోవచ్చని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ తమ వెబ్సైట్లో ఎక్కడ తెలుపలేదు.
మధుమేహం (డయాబెటిస్) అనేది ఒక దీర్గకాలిక వ్యాధి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పై ప్రభావం చూపే ఈ వ్యాధికి ప్రపంచ దేశాలలోని డాక్టర్లు, పరిశోధకులు ఇంతవరకు శాశ్వత చికిత్స కనుగొనలేదు. అమెరికా ‘Centre for Disease control’ డయాబెటిస్‌కు సంబంధించి పబ్లిష్ చేసిన ఒక ఎడిషన్‌లో, డయాబెటిస్‌తో బాధపడుతున్న పేషెంట్లు మందులు వాడటంతో పాటు బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం మరియు శారీరకంగా చురుకుగా ఉండటం అలవాటు చేసుకోవాలని తెలిపారు. డయాబెటిస్‌ని తొందరగా గుర్తించి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించిన వారు డయాబెటిస్ తీవ్ర పరిణామాల నుండి బయటపడవచ్చని WHO మరియు భారత ప్రభుత్వ NCDC వారు తమ వెబ్సైటులో తెలిపారు. కానీ, ఆవు పేడ ద్వారా మధుమేహం వ్యాధిని అదుపు చేసుకోవచ్చని WHO లేదా మరే ఇతర సంస్థ తెలుపలేదు.
2007లో ఆవు పేడపై నడవడం ద్వారా మధుమేహం తగ్గుతుందని హైదరాబాద్ నగరవాసులు కొందరు గోశాలలో అమర్చిన ఆవు పేడపై నడిచిన ఘటనను పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ ఘటనకు సంబంధించి పంచగవ్య ప్రాక్టిషనర్ గంగా సత్యం అప్పుడు మీడియాతో మాట్లాడుతూ, తాజా ఆవు పెడపై నడవడం ద్వారా చాలా మంది మధుమేహం వ్యాధి తక్కువ చేసుకున్నారని, చర్మంపై పూసుకునే ఏ మిశ్రమమైన చర్మ పొరల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయనే సూత్రంపై పంచగవ్య ఉత్పత్తులను మధుమేహం నియంత్రణ కోసం ఉపయోగించవచ్చని తెలిపారు. అయితే, ఆవు పెడ యొక్క వైద్య లక్షణాలకు సంబంధించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, మా వరకు ఇదంతా ఒక కామెడీ మాత్రమే అని డాక్టర్లు ఈ ఘటనకు సంబంధించి అప్పుడు స్పంధించారు.
చివరగా, ఆవు పేడ పిడకలపై పాదాలు పెట్టడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని చెప్పడానికి శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు.