Fake News, Telugu
 

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో అమ్మాయిపై కత్తితో దాడి చేసిన ఘటనలో లవ్ జిహాద్ కోణం లేదు

0

బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ ప్రాంతంలో లవ్ జిహాద్ నేపథ్యంలో ఒక ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని కత్తితో పొడిచి చంపాడంటూ, రోడ్డుపై అమ్మాయిని కత్తితో పొడుస్తున్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ ఘటనకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ ప్రాంతంలో లవ్ జిహాద్ నేపథ్యంలో ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని కత్తితో పొడిచి చంపిన వీడియో.

ఫాక్ట్ (నిజం): బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ జిల్లా మంఝాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో లవ్ జిహాద్ కోణం లేదు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు, బాధితురాలు ఇద్దరు ఒకే మతానికి చెందినవారు. ఇదే విషయం మంఝాగర్ పోలీస్ సిబ్బంది స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ జిల్లా మంఝాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, ఈ నెల 19న సోషల్ జస్టిస్ ఆర్మీ అఫ్ ఇండియా అనే స్వచంధ సంస్థ తమ ట్విట్టర్‌లో షేర్ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది.

ఐతే ఈ ఘటనకు సంబంధించి ‘గోపాల్‌గంజ్ జిల్లా మంఝాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతాపూర్ గ్రామానికి చెందిన అష్రఫ్ అలీ కుమారుడైన గుడ్డా అనే యువకుడు 8వ తరగతి చదువుతున్న అమ్మయిని ఎనిమిది సార్లు కత్తితో పొడిచినట్టు, ఆ యువకుడు తరచూ ఆ అమ్మయిని వేధిస్తుండేవాడని’ అంటూ అనేక వార్తా సంస్థలు ఈ వీడియోని రిపోర్ట్ చేసాయి. ఈ వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. 

ఐతే ఏ ఒక్క వార్తా సంస్థ కూడా ఈ ఘటనలో బాధితురాలు పేరుగాని, లేక ఆమె హిందూ అని రిపోర్ట్ చేయలేదు. ఈ విషయంపై స్పష్టత కోసం మేము మంఝాగర్ పోలీసులతో సంప్రదించగా ఈ ఘటనలో లవ్ జిహాద్ కోణం లేదని, ఘటనకు సంబంధించి నిందితుడు మరియు బాధితురాలు ఇద్దరు ఒకే మతానికి చెందినవారని స్పష్టం చేసారు. అలాగే  ఈ దాడిలో గాయపడ్డ అమ్మాయి చనిపోయినట్టు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు.

చివరగా, బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో అమ్మాయిపై కత్తితో దాడి చేసిన ఘటనలో లవ్ జిహాద్ కోణం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll