డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ తన కుమారుడు చనిపోయినా ఆ అంతిమ యాత్రలో ఉండకుండా, లండన్‌కు వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీతో యుద్ధం చేసి, ఓటు హక్కును సాధిస్తే మనము దానిని నాయకులు ఇచ్చే డబ్బుకు ఆశపడి దుర్వినియోగం చేస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో (ఇక్కడ మరియు ఇక్కడ) ఒక పోస్టు షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ తన కుమారుడు చనిపోయినా ఆ అంతిమ యాత్రలో ఉండకుండా, లండన్‌కు వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీతో యుద్ధం చేసి, ఓటు హక్కును సాధించారు.
ఫాక్ట్ (నిజం): బాబాసాహెబ్ అంబేడ్కర్ చివరి సంతానం అయిన రాజరత్నం 19 జులై 1926న మరణించాడు. లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 12 నవంబర్ 1930 నుండి 19 జనవరి 1931 వరకు జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు నేరుగా ఓటు హక్కు స్థాపనకు దారితీయలేదు, ఇది కమ్యూనల్ అవార్డుకు దారి తీసింది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేసిన క్లెయిమ్ గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, అంబేడ్కర్ చివరి సంతానం అయిన రాజరత్నం 19 జులై 1926న మరణించాడు అని తెలిసింది (ఇక్కడ మరియు ఇక్కడ). అయితే, లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబల్ సమావేశం 12 నవంబర్ 1930 నుండి 19 జనవరి 1931 వరకు జరిగింది. ఈ సమాచారం ద్వారా అంబేడ్కర్ కొడుకు రాజరత్నం రౌండ్ టేబుల్ సమావేశాలు మొదలయ్యే నాలుగు సంవత్సరాల ముందే మరణించాడు అని తెలుస్తుంది. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫామిలీ ట్రీ (కుటుంబ వివరాలు) ఈ లింకులో చూడొచ్చు.
1932 ఆగస్టులో బ్రిటీష్ ప్రధాన మంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం ఈ సమావేశాల యొక్క ముఖ్య పరిణామం. మతపరమైన మైనారిటీలు, ప్రత్యేకించి ముస్లింలు, సిక్కులు మరియు అణగారిన వర్గాలకు ప్రత్యేక ఓటర్లు మరియు ప్రాతినిధ్య సమస్యను పరిష్కరించడానికి కమ్యూనల్ అవార్డు ఉద్దేశించబడింది. అంటే, రౌండ్ టేబుల్ సమావేశాలు నేరుగా ఓటు హక్కు స్థాపనకు దారితీయలేదు, ఇది ఈ వర్గాలకు ప్రత్యేక ఓటర్లను మంజూరు చేసింది (ఇక్కడ మరియు ఇక్కడ).
అంతే కాదు, అందరికీ ఓటు హక్కు అన్న డిమాండ్ రాజ్యాంగం రూపొందించే సమయం కన్నా ముందు నుండే ఉంది. స్వాతంత్రోద్యమం సమయంలో 1928లో రాజ్యాంగ సంస్కరణల కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్‌కు నిరసనగా, మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలోని ఒక కమిటీ ఒక ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించింది. ఈ కమిటీ సెక్రటరీగా జవహర్‌లాల్ నెహ్రూ వ్యవహరించారు. ఈ కమిటీ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కు ఉండాలని ప్రతిపాదించింది.
ఆ తరవాత 1931లో కరాచీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సర్దార్ పటేల్ నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో ప్రాథమిక హక్కులు మరియు ఆర్థిక విధానంపై కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ముసాయిదా తీర్మానాన్ని జవహర్‌లాల్ నెహ్రూ రూపొందించారు. ఐతే ముసాయిదా తీర్మానంలో పేర్కొన్న ప్రాధమిక హక్కులలో కూడా అందరికి ఓటు హక్కు ఉండాలన్నది ఉంది.
పోస్టులో చెప్తున్నదానికి వ్యతిరేకంగా గాంధీ కూడా అందరికీ ఓటు హక్కు ఉండాలని ముందు నుండి ప్రచారం చేస్తున్నారు. 1927-28 మధ్య కాలంలో ఆయన రాసిన యంగ్ ఇండియా అనే పుస్తకంలో దీని గురించి రాసారు. అందరికీ ఓటు హక్కుకు సంబంధించి గాంధీ ఈ పుస్తకంలో రాసిన కొన్ని వ్యాఖ్యలు కింద చూడొచ్చు.
చివరిగా, బాబాసాహెబ్ అంబేడ్కర్ తన కుమారుడు చనిపోయినప్పటికీ లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనట్టు ఎటువంటి ఆధారాలు లేవు.