ఫార్ములా-ఈ రేసు కేసులో తెలంగాణ మాజీ మంత్రి కే. తారక రామారావుపై విచారణకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అనుమతించిన నేపథ్యంలో, తనని అరెస్టు చేస్తే రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ ఆదేశించారంటూ “తెలంగాణ న్యూస్ టుడే డైలీ” పేరుతో ఉన్న ఒక న్యూస్ క్లిప్పింగ్ (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: తనని అరెస్టు చేస్తే రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ ఆదేశించారంటూ “తెలంగాణ న్యూస్ టుడే డైలీ” పేరుతో ఉన్న ఒక న్యూస్ క్లిప్పింగ్.
ఫాక్ట్: ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో పేర్కొన్న ‘telangananewstodaydaily.com’ డొమైన్ ఇంకా రిజిస్టర్ కాలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా ఈ విషయంపై తెలంగాణలోని అన్ని ప్రముఖ మీడియా సంస్థల వెబ్సైట్లలో వెతకగా కే. తారక రామారావు ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎక్కడా రిపోర్ట్ కాలేదు. ఇక వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో పేర్కొన్న “తెలంగాణ న్యూస్ టుడే” గురించి ఇంటర్నెట్లో వెతకగా ఈ పేరుతో ఉన్న ఎటువంటి ఈ- పేపర్ లభించలేదు.
స్థానిక ఈ- పేపర్లను పబ్లిష్ చేసే ‘Readwhere’ & ‘Magzter’ వంటి వెబ్సైట్లలో కూడా ఈ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. ఇక న్యూస్ క్లిప్పింగ్‌లో ఇచ్చిన లింక్ కూడా మనుగడలో లేనట్లు గుర్తించాం.
ఇక ‘telangananewstodaydaily.com’ అనే డొమైన్ (వెబ్సైట్ యొక్క అడ్రస్) గురించి వివిధ డొమైన్ రిజిస్ట్రీ డేటాబేస్‌లలో వెతకగా ఈ పేరుతో ఎటువంటి డొమైన్ రిజిస్టర్ కాలేదని, ప్రస్తుతం అమ్మకానికి ఉందని తెలిసింది.
ఇదే “తెలంగాణ న్యూస్ టుడే డైలీ” పేరుతో మరొక న్యూస్ క్లిప్పింగ్ కూడా ప్రచారంలో ఉన్నట్లు గుర్తించాం. కేటీఆర్ తనకి మంచి మిత్రుడని, ఆయన్ని పార్క్ హయాత్ హోటల్లో కలిశానని వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి మీడియా సమావేశంలో చెప్పినట్లు ఈ న్యూస్ క్లిప్పింగ్ పేర్కొన్నారు. అయితే ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు మరే ఇతర వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. అలాగే, ఈ క్లిప్పింగ్ కింద ఇచ్చిన లింక్ కూడా మనుగడలో లేదు. దివ్వెల మాధురి ఈ పేపర్ క్లిప్పింగ్ పై స్పందిస్తూ (ఇక్కడ, ఇక్కడ), ఇది పూర్తిగా అవాస్తవమని, తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని, ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేస్తానని చెప్పారు.
పై ఆధారాలను బట్టి, “తెలంగాణ న్యూస్ టుడే డైలీ” అనే ఈ- పేపర్ మనుగడలో లేదని, ఈ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలో న్యూస్ క్లిప్పింగ్స్ ఫేక్ అని నిర్ధారించవచ్చు.
చివరిగా, “తెలంగాణ న్యూస్ టుడే డైలీ” పేరుతో ప్రచారంలో ఉన్న న్యూస్ క్లిప్పింగ్స్ ఫేక్. ఈ పేరుతో ఈ- పేపర్ మనుగడలో లేదు.