Fake News, Telugu
 

08 మే 2025న ఓ పాకిస్తాన్ వైమానిక దళ పైలట్‌ను భారత సైన్యం పట్టుకుంది అని వైరల్ అవుతున్న ఫోటో ఇటీవలిది కాదు; ఈ ఫోటో 2016 నాటిది.

0

22 ఏప్రిల్ 2025న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, 07 మే 2025న భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లోని పలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. ఈ దాడులు లష్కర్-ఎ-తోయిబా (LeT), జైష్-ఎ-మహ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల శిబిరాలపైనే జరిగాయని, పాక్ సైనిక స్థావరాలను తాకలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. పాకిస్తాన్ కూడా తమ భూభాగంపై భారత దాడి చేసినట్లు ధృవీకరించింది (ఇక్కడఇక్కడ, & ఇక్కడ). పాకిస్తాన్ దళాలు సరిహద్దు వెంబండి జనావాసాలపై దాడులకు తెగబడింది, ఈ దాడులల్లో  పలువురు పౌరులు మరణించారని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. పాకిస్థాన్ 08 మే 2025న సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లపై పాకిస్థాన్ దాడికి ప్రయత్నించింది. జమ్మూ ఎయిర్‌పోర్ట్, సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో పాక్ చేసిన దాడులను భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టింది. భారతదేశం పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను అడ్డగించడమే కాకుండా, పాకిస్తాన్ యుద్ధ విమానాలను, వైమానిక హెచ్చరిక నియంత్రణ వ్యవస్థను (AWACS) కూడా కూల్చివేసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). భారత దళాలు పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చివేసాయని, జైసల్మేర్‌లో పాకిస్తాన్ వైమానిక దళ పైలట్‌ను భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ నేపథ్యంలో, భారత సైన్యం అదుపులో ఉన్న పాకిస్థాన్ ఫైటర్ జెట్ పైలట్ అంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ప్రముఖ తెలుగు మీడియా సంస్థ ఈనాడు వంటి పలు మీడియా సంస్థలు కూడా ఈ ఫోటోను రిపోర్ట్ చేస్తూ కథనాలను ప్రచురించాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 08 మే 2025న భారత సైన్యం అదుపులోకి తీసుకున్న పాకిస్థాన్ ఫైటర్ జెట్ పైలట్ ఫోటో.

ఫాక్ట్(నిజం): 08 మే 2025న ఓ పాకిస్తాన్ వైమానిక దళ పైలట్‌ను భారత సైన్యం పట్టుకుంది అని వైరల్ అవుతున్న ఫోటో ఇటీవలిది కాదు. ఈ ఫోటో 2016లో టర్కీలోని డియార్‌బాకిర్ సమీపంలో జరిగిన టర్కిష్ ఫైటర్ జెట్ ప్రమాదానికి సంబంధించినది. భారత దళాలు పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చివేసాయని, జైసల్మేర్‌లో పాకిస్తాన్ వైమానిక దళ పైలట్‌ను భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అయితే, దీనిపై భారత ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న ఓ ఫోటో స్టాక్ ఇమేజ్ ప్రొవైడర్ ‘గెట్టి ఇమేజెస్’ వెబ్‌సైట్‌లో లభించింది. ఈ ఫోటోను “టర్కీ-ప్లేన్-క్రాష్” అనే అనే శీర్షికతో అప్‌లోడ్ చేయబడింది. “డిసెంబర్ 12, 2016న డియార్‌బాకిర్‌లో కూలిపోయిన టర్కిష్ ఎఫ్-16 యుద్ధ విమానం సమీపంలో టర్కిష్ సైనిక సిబ్బంది చేరుకున్నారు. డియార్‌బాకిర్‌లోని విమానాశ్రయం సమీపంలో టర్కిష్ ఫైటర్ జెట్ కూలిపోయిందని సైన్యం తెలిపింది, కానీ పైలట్ విమానం నుంచి సురక్షితంగా ఎజెక్ట్ చేయగలిగాడు. క్రాష్‌కు కారణం గురుంచి సమాచారం లేదు, కానీ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది” అని ఈ ఫోటో వివరణలో పేర్కొన్నారు. ఈ ఫోటోను పరిశీలిస్తే, ఇదే ఫోటోను క్రాప్ చేసి, బ్రైట్ నెస్ (brightness) మార్చి ఉపయోగించినట్లు అర్థమవుతుంది.

దీని ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వెతకగా, ఇదే ఫోటోను రిపోర్ట్ చేస్తూ ఇదే విషయాన్ని పేర్కొంటూ 2016 లో ప్రచురితమైన ఒక వార్త కథనం లభించింది. అలాగే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని రిపోర్ట్స్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

రాజస్థాన్‌లో పాకిస్తాన్ పైలట్ పట్టుబడ్డారనే వార్త గురించి ఫాక్ట్-చెకింగ్ సంస్థ BOOM భారత వైమానిక దళ ప్రతినిధిని సంప్రదించగా, ఆయన దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

చివరగా, ఈ వైరల్ ఫోటో 2016లో టర్కీలోని డియార్‌బాకిర్ సమీపంలో జరిగిన టర్కిష్ ఫైటర్ జెట్ ప్రమాదానికి సంబంధించినది.

Share.

About Author

Comments are closed.

scroll