Fake News, Telugu
 

కేరళ ప్రభుత్వం 12 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వృధా చేసిందన్న వార్తలో నిజం లేదు

0

కేరళ ప్రభుత్వం 12 లక్షల వ్యాక్సిన్ డోసులను వృధా చేసిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళ ప్రభుత్వం 12 లక్షల వ్యాక్సిన్ డోసుల వృధా చేసింది.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మే వరకు అందించిన సమాచారం ప్రకారం 11 మే 2021 నాటికి కేరళలో వ్యాక్సిన్ వేస్టేజీ శాతం “-5.6%” గా ఉంది, అంటే కేరళలో కరోనా వ్యాక్సీన్ వృథా కాకుండా, కేంద్ర అందించిన డోసుల కంటే ఎక్కువగా వ్యాక్సినేషన్ జరిగింది. ప్రధానమంత్రి కూడా ఈ విషయంలో హెల్త్ కేర్ వర్కర్స్ ని అభినందిస్తూ ట్వీట్ చేసారు. కేరళ ప్రభుత్వం 12 లక్షల వ్యాక్సిన్ డోసులను వృధా చేసినట్టు ఎటువంటి అధికారిక సమాచారం గాని లేక వార్తా కథనాలు గాని లేవు. ఇటీవల కేరళ ఆరోగ్య మంత్రి, ముఖ్య మంత్రి పలు సందర్భాలలో మాట్లాడుతూ కేరళలో జీరో వ్యాక్సిన్ వేస్టేజీ ఉందని పేర్కొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది అబద్ధం.

సాధారణంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్రం ఎంత శాతం వ్యాక్సిన్ వేస్ట్ చేసిందో వివరాలు విడుదల చేస్తుండేది. కాని ప్రస్తుతానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలు విడుదల చేయట్లేదు. చివరిగా ఈ సంవత్సరం మేలో ఈ వివరాలు విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం కేరళలో వ్యాక్సిన్ వేస్టేజీ శాతం “-5.6%”గా ఉంది, అంటే కేరళలో కరోనా వ్యాక్సీన్ వృథా కాకుండా, కేంద్ర అందించిన డోసుల కంటే ఎక్కువగా వ్యాక్సినేషన్ జరిగింది.

సాధారణంగా ఐదు మిల్లీ లీటర్ల వ్యాక్సీన్ సీసాలో 10 డోసులు ఉంటాయి. అంటే ఒక సీసా తెరిస్తే పదిమందికి టీకాలు వేయవచ్చు. వ్యాక్సీన్ తక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో వ్యాక్సీన్ తయారీదారి సంస్థలు ప్రతీ సీసాలోనూ కొన్ని అదనపు టీకా చుక్కలను సరఫరా చేస్తున్నాయి. అంటే ప్రతీ సీసాలోను 0.55 మి.లీ లేదా 0.6 మి.లీల ఔషధం అదనంగా ఉంటోంది. మంచి శిక్షణ పొందిన నర్సులు ఒక్క టీకా చుక్క కూడా వృథా కాకుండా సీసా తెరిచిన తరువాత పదిమందికి బదులు 11 లేదా 12 మందికి వ్యాక్సీన్ వేయడం వల్ల కేంద్ర ఇచ్చిన డోసుల కన్నా ఎక్కువ వేయగలిగామని’  కేరళ ప్రభుత్వ కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యుడు మీడియాతో అన్నారు.

కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించినదానికంటే ఎక్కువ డోసులు అందిస్తుందని చెప్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వీట్ చేయగా, ఈ ట్వీట్ కి స్పందిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టీకా వృథాను తగ్గించడంలో ఆరోగ్య కార్యకర్తలు మరియు నర్సుల కృషిని ప్రశంసించారు.

కేరళ ప్రభుత్వ కరోనా పోర్టల్‌లో వేస్టేజీకి సంబంధించి ఎటువంటి వివరాలు అందించట్లేదు. పైగా కేరళ ప్రభుత్వం 12 లక్షల వ్యాక్సిన్ డోసుల వృధా చేసినట్టు ఎటువంటి అధికారిక సమాచారం గాని లేక వార్తా కథనాలు గాని లేవు. ఇటీవల కేరళ ఆరోగ్య మంత్రి మరియు ముఖ్య మంత్రి పలు సందర్భాలలో మాట్లాడుతూ కేరళలో జీరో వ్యాక్సిన్ వేస్టేజీ ఉందని పేర్కొన్నారు. కాబట్టి పోస్టులో చెప్తున్నది కేవలం కల్పితం మాత్రమే అని అర్ధమవుతుంది.

చివరగా, కేరళ ప్రభుత్వం 12 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వృధా చేసిందన్న వార్తలో నిజంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll