మెదక్ జిల్లా ఆజాంపురాలో ఉన్న ‘చైతన్య భారతి హై స్కూల్’ పూర్తిగా ఇస్లామిక్ సంస్కృతికి అనుగుణంగా వ్యవహరిస్తుంది అంటూ ఆ స్కూల్ పేరుతో ఒక పాంఫ్లెట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ముస్లింలకు ఫీజులో ప్రత్యేక డిస్కౌంట్ అందించడం, వారికి ప్రత్యేకించి అరబిక్ క్లాసులు ఏర్పాటు చేయడం మొదలైన సదుపాయాలు వారికి అందిస్తుంది అంటూ ఈ పాంఫ్లెట్‌లో పేర్కొన్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: మెదక్‌లోని చైతన్య భారతి స్కూల్ ఇస్లామిక్ సంస్కృతికి ప్రోత్సహిస్తూ ముస్లింలకు ప్రత్యేక సదుపాయాలూ కల్పిస్తున్నట్టు చెప్తూ ముద్రించిన పాంఫ్లెట్.
ఫాక్ట్(నిజం): చైతన్య భారతి స్కూల్ పేరుతో షేర్ అవుతున్న పాంఫ్లెట్ ఫేక్ అని, ఆ పాంఫ్లెట్‌లో చెప్తున్న విషయాలన్నీ అవాస్తవమని, కొందరు ఆకతాయిలు ఇలా తమ స్కూల్ పేరుతో ఫేక్ పాంఫ్లెట్ సృష్టించి షేర్ చేస్తున్నారని స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది. తమ స్కూల్లో అన్ని మతాలను సమానంగా చూస్తామని, ముస్లింలకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవని తెలిపింది. అలాగే తమ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికనే ఫాలో అవుతున్నామని, అరబిక్ బోధన లేదని తెలిపింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ విషయానికి సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ఇదే అంశానికి సంబంధించి చైతన్య భారతి స్కూల్ మీడియాతో మాట్లాడిన రిపోర్ట్ మాకు కనిపించింది. స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కొందరు తమ స్కూల్‌పై ఇలా ఫేక్ పాంఫ్లెట్‌లు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ పాంఫ్లెట్‌లో చెప్తున్న విషయాలు అవాస్తవమని తెలిపారు. తమ స్కూల్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు తెలిపారు.
ఇదే విషయానికి సంబంధించి స్పష్టత కోసం స్కూల్ యాజమాన్యంతో మేము మాట్లాడగా ఈ పాంఫ్లెట్ ఫేక్ అని, పాంఫ్లెట్‌లో పేర్కొన్న విషయాలు అన్ని అవాస్తవమని, తమ స్కూల్‌లో ముస్లింలకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయట్లేదని తెలిపారు. అన్ని స్కూల్స్ లాగే తమ స్కూల్‌లో ప్రభుత్వ ప్రణాళికనే ఫాలో అవుతున్నామని, అన్ని మతాలను సమానంగా చూస్తామని, ముస్లింలకు ప్రత్యేక ఏర్పాట్లు ఏమి లేవని, తమ స్కూల్‌లో అరబిక్ బోధన లేదని తెలిపారు. తమ స్కూల్‌కు సంబంధించిన పలు పాంఫ్లెట్‌లు మాకు షేర్ చేసారు.
చివరగా, మెదక్‌లోని చైతన్య భారతి స్కూల్ ఇస్లామిక్ సంస్కృతిని ప్రోత్సహిస్తుందంటూ ఈ పాంఫ్లెట్‌లో చెప్తున్న విషయాలు వాస్తవం కాదని స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది.