Fake News, Telugu
 

అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్‌ను చట్టవిరుద్ధమైన దేశంగా ప్రకటించలేదు; ఇజ్రాయెల్ సార్వభౌమాధికారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు

0

“ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం అక్రమ రాజ్యంగా ప్రకటించింది, ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌ను సార్వభౌమ రాజ్యంగా గుర్తించకూడదని నిర్ణయించింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). దీనికి మద్దుతగా పాలస్తీనా విదేశాంగ మంత్రి అల్-మాలికీ మీడియాతో మాట్లాడుతున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం చట్టవిరుద్ధమైన దేశంగా ప్రకటించింది, ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇజ్రాయెల్‌ను సార్వభౌమ దేశంగా గుర్తించకూడదని నిర్ణయించింది అని పాలస్తీనా విదేశాంగ మంత్రి అల్-మాలికీ మీడియాతో చెప్పారు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడంపై 19 జూలై 2024న అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇచ్చిన నివేదిక గురించి పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్-మాలికీ మీడియాకు వివరించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ప్రెస్ మీట్‌లో పాలస్తీనా విదేశాంగ మంత్రి అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్‌ను చట్టవిరుద్ధమైన దేశంగా ప్రకటించిందని చెప్పలేదు. డిసెంబర్ 2022లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(UNGA) తూర్పు జెరూసలేం సహా ఇజ్రాయెల్‌ ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ విధానాలు మరియు తద్వారా వచ్చే చట్టపరమైన పరిణామాలను పరిష్కరించడానికి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని సలహాను (Advisory Opinion) కోరింది. ఇదే అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానం తమ నివేదికను 19 జూలై 2024న ప్రకటించింది. ఈ నివేదికలో తూర్పు జెరూసలేం సహ పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడం చట్టవిరుద్ధమని మాత్రమే ICJ పేర్కొంది. ఈ నివేదికలో అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఇజ్రాయెల్‌ను చట్టవిరుద్ధమైన దేశంగా పేర్కొనలేదు, ఇజ్రాయెల్ సార్వభౌమాధికారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోలో మీడియాతో మాట్లాడుతున్న వ్యక్తి  పాలస్తీనా విదేశాంగ మంత్రి అల్-మాలికీ అని పేర్కొన్ని ఉంది. అలాగే ఈ వైరల్ వీడియో ‘TRT world’ అని రాసి ఉండటం మనం గమనించవచ్చు. దీని ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇదే వీడియోను టర్కీకి చెందిన ‘TRT world’ అనే మీడియా సంస్థ వారి అధికారిక యుట్యూబ్ ఛానెల్‌లో 19 జూలై 2024న షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియో వివరణ ప్రకారం, పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడంపై 19 జూలై 2024న అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇచ్చిన నివేదిక గురించి పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్-మాలికీ మీడియాకు వివరించిన దృశ్యాలను ఈ  వీడియో చూపిస్తుంది.

ఈ వీడియోలో పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్-మాలికీ మీడియాతో “ఇజ్రాయెల్ ఆక్రమణ చట్టవిరుద్ధమని అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ) ప్రకటించిందిని, ఇజ్రాయెల్ వీలైనంత త్వరగా పాలస్తీనా భూభాగాలను వదిలి వెళ్ళాలి అని షరతు విధించిందని, చట్టవిరుద్ధమైన ఇజ్రాయెల్ ఆక్రమణ UN మానవ హక్కుల చార్టర్ మరియు అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘిస్తుందని, ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగంలోని ఇజ్రాయెల్ నివాసాలన్నీ చట్టవిరుద్ధమైనవని మరియు వాటిని వెంటనే కూల్చివేయాలని మరియు ఇజ్రాయెల్ స్థిరనివాసులందరినీ అక్కడ నుండి వెంటనే ఖాళీ చేయించాలిని అంతర్జాతీయ న్యాయస్థానం పేర్కొన్నది” అని అన్నారు. ఈ ప్రెస్ మీట్‌లో పాలస్తీనా విదేశాంగ మంత్రి అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్‌ను చట్టవిరుద్ధమైన దేశంగా ప్రకటించిందని చెప్పలేదు.

తదుపరి వైరల్ పోస్టులో పేర్కొన్నట్లు ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్‌ను చట్టవిరుద్ధమైన దేశంగా ప్రకటించిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలిపే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. ఈ క్రమంలోనే 19 జూలై 2024న పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడం చట్టవిరుద్ధమని అంతర్జాతీయ న్యాయస్థానం పేర్కొన్నట్లు పలు వార్త కథనాలు రిపోర్ట్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

డిసెంబర్ 2022లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(UNGA) పాలస్తీనా- ఇజ్రాయెల్‌ సమస్య పరిష్కరానికి, తూర్పు జెరూసలేం సహా ఇజ్రాయెల్‌ ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ విధానాలు మరియు తద్వారా వచ్చే చట్టపరమైన పరిణామాలను పరిష్కరించడానికి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని సలహాను (Advisory Opinion) కోరింది. ఇదే అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానం తమ నివేదికను 19 జూలై 2024న ప్రకటించింది. ఈ నివేదికకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఇక్కడ చూడవచ్చు. ఈ నివేదికలో తూర్పు జెరూసలేం సహ పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడం చట్టవిరుద్ధమని మాత్రమే ICJ పేర్కొంది. ఈ నివేదికలో అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఇజ్రాయెల్‌ను చట్టవిరుద్ధమైన దేశంగా పేర్కొనలేదు మరియు ఇజ్రాయెల్ సార్వభౌమాధికారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.


చివరగా, అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇజ్రాయెల్‌ను చట్టవిరుద్ధమైన దేశంగా ప్రకటించలేదు. తూర్పు జెరూసలేం సహ పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడం చట్టవిరుద్ధమని మాత్రమే ICJ ప్రకటించింది.

Share.

About Author

Comments are closed.

scroll