ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాన్న భోజనంలో భాగంగా పిల్లలకు గుడ్లు పెట్టినట్టు పెట్టి వెనక్కి తీసుకున్న అంగన్వాడీ టీచర్ అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. ఒక మహిళ మొదట పిల్లలకు గుడ్లు వడ్డించి, వీడియో రికార్డ్ చేసి, ఆయా తరువాత పిల్లల ప్లేట్ల నుండి గుడ్లను వెనక్కి తీసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు (ఇక్కడ & ఇక్కడ). ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాన్న భోజనంలో భాగంగా అంగన్వాడీ టీచర్ పిల్లలకు గుడ్లు పెట్టినట్టు పెట్టి వెనక్కి తీసుకుంటున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ ఘటన కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జరిగింది. ఇద్దరు అంగన్వాడీ టీచర్లు పిల్లలకు గుడ్లు వడ్డించడం వీడియో రికార్డు చేసి, ఆ తరవాత పిల్లల ప్లేట్ల నుండి వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వం ఈ ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియో నిజంగానే ఒక అంగన్వాడీ టీచర్ పిల్లల ప్లేట్ల నుండి వెనక్కి తీసుకున్న ఘటనకు సంబంధించిందే అయినప్పటికీ, ఈ ఘటన జరిగింది కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్‌లో కాదు. ఈ విషయానికి సంబంధించి కీవర్డ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోను ఇటీవల 10 ఆగస్ట్ 2024న రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు మాకు కనిపించాయి.
ఈ కథనం ప్రకారం ఈ ఘటన కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జరిగింది. లక్ష్మి మరియు షైనజా బేగం అనే ఇద్దరు అంగన్వాడీ టీచర్లు పిల్లలకు గుడ్లు వడ్డించడం వీడియో రికార్డు చేసి, ఆ తరవాత పిల్లల ప్లేట్ల నుండి వెనక్కి తీసుకున్నారు. ఐతే ఈ వీడియో వైరల్ అయ్యి ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ ఇద్దరు అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేసింది.
కర్ణాటక రాష్ట్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖా మంత్రి ఆ జిల్లా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌ను కూడా సస్పెండ్ చేసింది. ఈ వీడియోను కర్ణాటకలో జరిగిన ఘటనగా రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ సమాచారాన్ని బట్టి ఈ వీడియోకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.
చివరగా, అంగన్వాడీ కార్యకర్తలు పిల్లలకు వడ్డించిన గుడ్లను వెనక్కి తీసుకున్న ఈ ఘటన కర్ణాటకలో జరిగింది, ఆంధ్రప్రదేశ్‌లో కాదు.