Fake News, Telugu
 

14 నవంబర్ 2025న గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో వివాహ వేడుకకు కొన్ని గంటల ముందు వధువును హత్య చేసిన వరుడి పేరు సాజన్ బరేయా; అతను హిందువు

0

“సజ్జన్ ఖాన్,తన అందమైన గర్ల్ ఫ్రెండ్ సోని సింఘ్ పెళ్లి కొన్ని గంటల్లో ఉండగా డబ్బులు ఇమ్మని లేదంటే నిన్ను వాడిన వీడియోలు చూపిస్తూ విషయం మొత్తం చెప్పి మీ కుటుంబం సచ్చేలాగా చేస్తా లేదంటే నాకు డబ్బులు ఇవ్వు అని ఇద్దరి మధ్య వాదనలు పెరగడంతో వాడి వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్ తో నెత్తి పగిలి మెదడు బయటకు వచ్చేలా కొట్టి చంపేశాడు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సజ్జన్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి తన కాబోయే భార్య, గర్ల్ ఫ్రెండ్ సోనీ సింగ్‌ను వారి వివాహానికి కొన్ని గంటల ముందు హత్య చేశాడు.

ఫాక్ట్(నిజం): 14 నవంబర్ 2025న గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో వివాహ వేడుకకు కొన్ని గంటల ముందు వధువు సోనీ హిమ్మత్ రాథోడ్‌ను హత్య చేసిన వరుడు సాజన్ ఖన్నాబాయి బరేయా ముస్లిం కాదు, అతను హిందువు. సాజన్ ఖన్నాబాయ్ బరేయా హిందువు అని కేసు దర్యాప్తు చేస్తున్న గంగాజలియా పోలీస్ స్టేషన్ SHO మాకు (Factly) తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ పోస్టులోని ఫోటోలను రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం, గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన 22 ఏళ్ల సోనీ రాథోడ్‌కు, సాజన్ అనే వ్యక్తితో 15 నవంబర్ 2025న వివాహం జరగాల్సి ఉంది. సోనీ హిమ్మత్ రాథోడ్ (22) వివాహానికి కొన్ని గంటల ముందు ఆమెకు కాబోయే భర్త చేతిలోనే హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన 14 నవంబర్ 2025 అర్ధరాత్రి భావ్‌నగర్‌లోని ప్రభుదాస్ లేక్ (సరస్సు) సమీపంలోని సోనీ రాథోడ్ ఇంట్లో జరిగింది. నిందితుడు, ఆమెకు కాబోయే వరుడు, 26 ఏళ్ల సాజన్ ఖన్నాబాయి బరేయా అని, ఈ హత్య సంఘటనకు సంబంధించి గంగాజలియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని ఈ కథనాలు పేర్కొన్నాయి.

ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న గంగాజలియా పోలీసులను మేము సంప్రదించగా, గంగాజలియా పోలీస్ స్టేషన్ SHO మాతో (Factly) మాట్లాడుతూ, “ఈ హత్యలో ఎలాంటి మతపరమైన కోణం లేదు, నిందితుడు ముస్లిం కాదు. నిందితుడు సాజన్ ఖన్నాబాయి బరేయా, మృతురాలు సోని రాథోడ్ ఇద్దరూ హిందువులే”  అని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి గంగాజలియా పోలీస్ స్టేషన్‌లో నమోదైన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు. FIR ప్రకారం, ఈ ఘటన 14 నవంబర్ 2025 రాత్రి 8.00 గంటల ప్రాంతంలో జరిగింది.

చివరగా, 14 నవంబర్ 2025న గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో వివాహ వేడుకకు కొన్ని గంటల ముందు వధువు సోనీ హిమ్మత్ రాథోడ్‌ను హత్య చేసిన వరుడు సాజన్ ఖన్నాబాయి బరేయా ముస్లిం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll