కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ సైకిళ్లను (Free Electric Cycles) అందిస్తోంది అంటూ ప్రధాని మోదీ మాట్లాడుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలలో ప్రధాని మోదీ, స్కూల్ విద్యార్థులు అందరికీ ఉచితంగా సైకిళ్లను అందిస్తానని చెప్పడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ సైకిళ్లను అందిస్తోంది.
ఫాక్ట్(నిజం): కేంద్ర ప్రభుత్వం లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులకు ఎలక్ట్రిక్ సైకిళ్లను అందించడం కోసం ఎటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు. అయితే, పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు ఉచిత సాధారణ సైకిళ్లను అందిస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల నుండి 12వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. అలాగే, ప్రధానమంత్రి మోదీ విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిల్ పథకాన్ని ప్రకటించారని షేర్ అవుతున్న ఈ వైరల్ వీడియోలు కూడా ఫేక్, AI జనరేటెడ్. అసలు వీడియోలకు AI జనరేటెడ్ ఆడియోను జోడించి ఈ వైరల్ వీడియోలను రూపొందించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా ఈ వైరల్ పోస్టులలో చెప్పినట్లుగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిల్ పథకాన్ని ప్రకటించారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ప్రధాని మోదీ ఇలాంటి ప్రకటన చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ వార్తా కథనాలు మాకు లభించలేదు. ఒకవేళ ప్రధాని మోదీ లేదా భారత ప్రభుత్వ వర్గాలు ఇలాంటి పథకాన్ని ప్రకటించి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ఖచ్చితంగా కథనాలను ప్రచురించేవి.
తదుపరి, మేము భారత ప్రభుత్వ పథకాల గురించి సమాచారం అందించే MyScheme వెబ్‌సైట్‌ను, భారత ప్రభుత్వం యొక్క ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) జారీ చేసిన పత్రికా ప్రకటనలను కూడా సమీక్షించాము. అయితే, ఇలాంటి పథకం ప్రధాని మోదీ ప్రకటించినట్లు ఎటువంటి సమాచారం మాకు లభించలేదు. అలాగే, ప్రధాని మోదీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) కూడా తనిఖీ చేసాము. అక్కడ కూడా ఆయన విద్యార్థులకు ఇలాంటి ఉచిత ఎలక్ట్రిక్ సైకిల్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎటువంటి పోస్టులు చేయలేదు.
తదుపరి పోస్టులలో షేర్ అవుతున్న వీడియోలకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియోల యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వైరల్ వీడియోలకు సంబంధించిన అసలు వీడియోలు లభించాయి (ఇక్కడ & ఇక్కడ). మొదటి వీడియోను భారత ప్రధాని మోదీ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్ 24 అక్టోబర్ 2025న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము, ఈ వీడియో 24 అక్టోబర్ 2025న బీహార్‌లోని సమస్తిపూర్‌లో NDA నిర్వహించిన 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలో ప్రధానమంత్రి మోదీ ప్రసంగాన్ని చూపిస్తుంది. అలాగే, రెండోవ వీడియోను భారత ప్రధాని కార్యాలయంకు సంబంధించిన అధికారిక యూట్యూబ్ ఛానెల్ 24 ఫిబ్రవరి 2019న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము, 24 ఫిబ్రవరి 2019న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (PM-KISAN పథకం) ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఈ వీడియో చూపిస్తుంది.
ఈ రెండు ప్రసంగాల్లోనూ, కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యుత్ సైకిళ్లను అందిస్తుందని ప్రధానమంత్రి మోదీ ప్రకటించలేదు. దీన్ని బట్టి అసలు వీడియోలకు AI జనరేటెడ్ ఆడియోను జోడించి ఈ వైరల్ వీడియోలను రూపొందించినట్లు అర్థమవుతుంది. తదుపరి, ఈ వైరల్ వీడియోలలోని ఆడియోను AI ఉపయోగించి రూపొందించబడిందా లేదా అని నిర్ధారించడానికి, ఈ వీడియోలను Resemble AI, & Hiya వంటి వివిధ AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వీడియోలను పరిశీలించగా, ఈ వైరల్ వీడియోలలోని ఆడియోలు AI-జనరేటెడ్ ఆడియో కావచ్చని ఫలితాన్ని ఇచ్చాయి.

ఈ వైరల్ క్లెయిమ్‌ను షేర్ చేసిన పలు సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) పరిశీలించినప్పుడు, ఈ ఖాతాలు తరచుగా ప్రధానమంత్రి మోదీ వీడియోలను/ఫోటోలను ఉపయోగిస్తూ, ఉచిత రీఛార్జ్ పథకం, ఉచిత కుట్టు మిషన్ పథకం, ఉచిత బైక్ పథకం వంటి ఉచిత పథకాలను మోదీ/కేంద్రం ప్రకటించిందని పేర్కొంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని మేము గుర్తించాము.
అయితే, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడు వంటి పలు రాష్ట్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు, ఉచిత సాధారణ సైకిళ్లను అందిస్తున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పథకాలు సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే బాలికలకు విద్య అందుబాటును మెరుగుపరచడానికి ఉద్దేశించినవి. అలాగే, మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో 12వ తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తున్నారు.
చివరగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులకుఎటువంటి ఎలక్ట్రిక్ సైకిళ్లపథకాన్ని ప్రకటించలేదు. ఈ వైరల్ వీడియోలు ఫేక్.

