ఒక భారత ఫెన్సింగ్ క్రీడాకారిణి ఏడు నెలల గర్భిణిగా ఉన్నా కూడా ఒలంపిక్స్‌లో మెడల్ సాధించారు అని చెప్తున్న పోస్ట్(ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆ క్రీడాకారిణి ఫోటోలు షేర్ చేస్తూ, ఈమె పడ్డ శ్రమని, కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు అని, ఆమె క్రికెటర్ కాదనే కదా ఇలా జరిగింది అని ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా యూజర్లు ఈ గ్రాఫిక్‌ను షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఈ గ్రాఫిక్‌లో ఉన్న భారత దేశ ఫెన్సింగ్ క్రీడాకారిణి ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఒలింపిక్ మెడల్ సాధించారు.
ఫ్యాక్ట్(నిజం): ఈ గ్రాఫిక్‌లో ఉన్న మహిళ పేరు నదా హఫిజ్. ఈమె ఈజిప్ట్ దేశానికి చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి, భారత్ కాదు. ఈమె ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు 2024 పారిస్ ఒలంపిక్స్‌లో పాల్గొని, ప్రీ – క్వార్టర్స్ (రౌండ్ అఫ్ 16)లో ఓడిపోయారు. కావున వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, వైరల్ గ్రాఫిక్‌లో ఉన్న మహిళ యొక్క ఫోటోలు కలిగిన కొన్ని వార్తా కథనాలు(ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) మాకు లభించాయి.

ఈ కథనాల ప్కారం ఈమె పేరు నదా హఫిజ్, ఈమె 2024 పారిస్ ఒలంపిక్స్‌లో ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు పాల్గొన్నారు. ఈమె ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక ఫెన్సింగ్ క్రీడాకారిణి. ఇదే విషయం గురించి ఒలింపిక్స్ వాళ్లు తమ అధికారిక వెబ్సైటులో 31 జూలై 2024న ఒక కథనాన్ని ప్రచురించారు.

ఒలంపిక్స్‌లో పాల్గొన్నప్పుడు తను ఏడు నెలల గర్భవతి అన్న విషయాన్ని స్వయానా నదానే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా చెప్పారు అని ఇందులో చెప్పారు. నదా యొక్క పోస్టుని మీరు ఇక్కడ చూడవచ్చు. 2024 పారిస్ ఒలింపిక్స్ ఫెన్సింగ్ పోటీల్లో ప్రీ – క్వార్టర్స్ (రౌండ్ అఫ్ 16) వరకు చేరుకున్నందుకు తనకు ఆనందంగా ఉంది అని ఇందులో తాను చెప్పారు.
ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ ఫెడరేషన్ మరియు ఒలింపిక్స్ వెబ్సైటులలో నదా హఫిజ్ ఈజిప్ట్ దేశానికి చెందిన క్రీడాకారిణి అని స్పష్టంగా ఉంది. ఈమెని భారతదేశానికి చెందిన క్రీడాకారిణి అని తప్పుగా వైరల్ పోస్టులో షేర్ చేస్తున్నారు.

అలాగే, భారతదేశానికి చెందిన ఫెన్సింగ్ క్రీడాకారులలో ఎవరూ కూడా 2024 పారిస్ ఒలంపిక్స్‌కి అర్హత పొందలేదు(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). మన దేశం తరుపున ఒలంపిక్స్‌లో పోటీ చేసిన మొదటి ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి. 2024 పారిస్ ఒలంపిక్స్‌లో భారత క్రీడాకారులు ఆరు మెడల్స్ గెలుచుకున్నారు, ఈ జాబితాని మీరు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ఒక భారత ఒలింపియన్, తను ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఒలంపిక్స్‌లో పాల్గొని మెడల్ సాధించారు అని చెప్పి ఈజిప్ట్ ఫెన్సింగ్ క్రీడాకారిణి నదా హఫిజ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు.