ఐరోపాలోని నార్వేలోని E-69 హైవే చివరకు వెళ్తే, సముద్రం కనిపిస్తుంది అని, ఈ ప్రదేశంలో భూమి, ఆకాశం కలుస్తాయి అని way2news కథనం ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఐరోపాలోని నార్వేలోని E-69 హైవే ప్రదేశంలో భూమి ఆకాశం కలుస్తాయి.
ఫాక్ట్(నిజం): ఐరోపాలోని నార్వేలోని E-69 రహదారి ఉత్తర ధ్రువానికి అత్యంత సమీపంలో ఉన్న చివరి రోడ్డు లేదా ప్రపంచంలోని చివరి రహదారి. అంతే కానీ, ఇక్కడ భూమీ, ఆకాశం కలవవు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
ఐరోపాలోని నార్వేలోని E-69 హైవే గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ఇది అంతర్జాతీయ రహదారి నెట్వర్క్కు ప్రపంచంలోని అత్యంత ఉత్తరాన ఉన్న హైవే. ఈ రహదారి ఉత్తరాన 71° వరకు చేరుకుంటుంది, 129 కి.మీ పొడవు మరియు మొత్తం 15.5 కి.మీ పొడవుతో ఐదు సొరంగాలను కలిగి ఉంది. అంతే కాకుండా, ఇది ఉత్తర ధ్రువానికి అత్యంత సమీపంలో ఉన్న చివరి రోడ్డు లేదా ప్రపంచంలోని చివరి రహదారి అని తెలుసుకున్నాం (ఇక్కడ మరియు ఇక్కడ). కానీ, ఇక్కడ భూమీ, ఆకాశం కలుస్తాయి అని అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు.

దీని గురించి మరింత వెతకగా, ఈ రహదారి యొక్క ప్రత్యేకమైన భౌగోళిక స్థానం కారణంగా, ఈ ప్రాంతం తీవ్రమైన గాలులు మరియు అధిక చలికి లోబడి ఉంటుంది. ఇక్కడ తీర రేఖకు సమీపంలో వెళుతున్నప్పుడు, ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వాతావరణం తీవ్రంగా మారిపోవచ్చు. ఈ రహదారి యొక్క ఉత్తర భాగం చలికాలంలో మూసివేయబడుతుంది. దీని కారణంగా, E-69 హైవే పై ప్రయాణికులు ఒంటరిగా నడవడానికి లేదా వాహనాలు నడపడానికి అనుమతి లేదు అని తెలుసుకున్నాం (ఇక్కడ మరియు ఇక్కడ).

భూమి ఉపరితలం, ఆకాశం కలిసినట్టు కనిపించే చోటును హోరిజోన్ అని అంటారు. ఈ సమావేశ స్థానం భూమి యొక్క వక్రత (curvature) వల్ల కలిగే ఒక దృశ్యభ్రమ (optical illusion) మాత్రమే. వాస్తవానికి, ఆకాశం మరియు భూమి యొక్క ఉపరితలం భౌతికంగా కలవవు.
చివరిగా, నార్వేలోని E-69 హైవే ఉత్తర ధ్రువానికి అత్యంత సమీపంలో ఉన్న చివరి రోడ్డు; ఇక్కడ భూమీ ఆకాశం కలవవు.