“పేరు ఎంపిక/మార్చుకోవడం రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది, విద్యాశాఖ తన స్కూలు సర్టిఫికెట్‌లోని పేరును మార్చడానికి నిరాకరించిందంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు ఇచ్చింది” అని చెప్తూ ఉన్న ’Way2News’ వార్తాకథనం క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే పలు మీడియా సంస్థలు కూడా భారత రాజ్యాంగం ప్రకారం పేరును ఎంచుకోవడం లేదా మార్చుకోవడం ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొంటూ ఇటీవల ఫిబ్రవరి 2025లో కథనాలు ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సర్టిఫికెట్లపై పేరు మార్చుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కని అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఫిబ్రవరి 2025లో తీర్పును ఇచ్చింది.
ఫాక్ట్(నిజం): భారత రాజ్యాంగం ప్రకారం సర్టిఫికెట్లపై పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందనే పూర్తిగా నిజం కాదు. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాకు చెందిన షానవాజ్ అనే వ్యక్తి మొహమ్మద్ సమీర్ రావుగా తన పేరును 2020లో మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తన కొత్త పేరు మీద తిరగి సర్టిఫికెట్లను జారీ చేయాలని అతను ఉత్తరప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డుకు దరఖాస్తు చేశాడు. అయితే, బోర్డు అతని దరఖాస్తును తిరస్కరించింది. దీంతో అతను తన పేరు మార్పునకు అనుగుణంగా తిరిగి కొత్త సర్టిఫికెట్లను జారీ చేయాలని బోర్డును ఆదేశించాలని కోరుతూ, అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి అజయ్ భానోత్, “రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మరియు 21 ప్రకారం, పేరును మార్చుకునే హక్కు ప్రాథమిక హక్కు” అని పేర్కొంటూ 25 మే 2023న ఎండీ సమీర్ రావుకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ, ఉత్తరప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు జూన్ 2023లో అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ 2023లో సమీర్ రావు రిట్ పిటిషన్‌పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ ఉత్తర ప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, భారత రాజ్యాంగం ప్రకారం సర్టిఫికెట్లపై పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఫిబ్రవరి 2025లో తీర్పు ఇచ్చిందా?అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, 15 ఫిబ్రవరి 2025న హిందీ మీడియా సంస్థ జాగరణ్ (Jagran) ప్రచురించిన వార్తాకథనం ఒకటి లభించింది. “అలహాబాద్ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పులో పేరు మార్చుకోవడం అనేది ఒక వ్యక్తి ప్రాథమిక హక్కు కాదని పేర్కొంది, ఇది నిబంధనలకు లోబడి ఉంటుంది మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ప్రకారం పనిచేస్తుంది. పేరు మార్పు ప్రాథమిక హక్కుగా పేర్కొంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది” అని ఈ కథనం పేర్కొంది. అలాగే ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈ కథనం పేర్కొంది.

కేసు నేపథ్యం:
ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాకు చెందిన షానవాజ్ అని పిలువబడే ఓ వ్యక్తి మొహమ్మద్ సమీర్ రావుగా 2020లో తన పేరును మార్చుకున్నాడు. సమీర్ రావు 2013 మరియు 2015లో షానవాజ్ పేరుతో హైస్కూల్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షలను పూర్తి చేశాడు. 2020లో, అతను పేరు మార్చుకున్న నేపథ్యంలో తన సర్టిఫికెట్లలో పేరు మార్చుకోవాలని, కొత్త ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు అతని పేరు మార్పునకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కాపీలను ఉత్తరప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సమర్పిస్తూ సమీర్ రావు పేరు మీద తనకు తిరిగి సర్టిఫికెట్లు అందించాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఉత్తరప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అతని దరఖాస్తును తిరస్కరించింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యాక్ట్, 1921లోని రెగ్యులేషన్ 7 ప్రకారం పేరు మార్పుకు వ్యవధి మూడేళ్ల మాత్రమే ఉందని పేర్కొంటూ ఉత్తరప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అతని దరఖాస్తును తిరస్కరించింది.
దీంతో సమీర్ రావు, ఉత్తరప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డును తన పేరు మార్పునకు అనుగుణంగా తిరిగి కొత్త సర్టిఫికెట్లను జారీ చేయాలని ఆదేశించాలని కోరుతూ, అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ (Writ-C No. 3671/2022) దాఖలు చేశాడు.
అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు:
25 మే 2023న అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి అజయ్ భానోత్, ఎండీ సమీర్ రావుకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మరియు 21 ప్రకారం, పేరును మార్చుకునే హక్కు ప్రాథమిక హక్కు అని ఈ తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పు కాపీని ఇక్కడ చూడవచ్చు.

ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, ఉత్తరప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు జూన్ 2023లో అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది (స్పెషల్ అప్పీల్ (SPLA) నం. 459/2023).
ఈ కేసులో విచారణలో ఉత్తరప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు తరుపు న్యాయవాది సింగిల్ బెంచ్ జడ్జి తన అధికార పరిధిని అధిగమించారని వాదించారు. అలాగే ఏడు సంవత్సరాల తర్వాత పేరు మార్పు నిబంధనల ప్రకారం అనుమతించబడదని, గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రచురించే ముందు ఎండీ సమీర్ రావు సివిల్ కోర్టు డిక్రీని (decree) పొందలేదని, సర్టిఫికెట్లలో పేరు మార్పునకు గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే సరిపోదని, గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పు పరిపాలనా గందరగోళానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని వాదించారు.
ఈ కేసులో విచారణలో ప్రతివాది (సమీర్ రావు) తరుపు న్యాయవాది, ఒక వ్యక్తి పేరును మార్చుకునే హక్కు ప్రాథమిక హక్కు అని, పేరు మార్పును ధృవీకరించడానికి గెజిట్ నోటిఫికేషన్, పబ్లిక్ పత్రాలు (కొత్త పేరుతో ప్రభుత్వం జారీ చేసిన PAN కార్డ్, ఆధార్ కార్డ్ మొదలైనవి) సరిపోతాయని వాదించారు. అలాగే గతంలో భారత రాజ్యాంగానికి లోబడే సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇచ్చారని వాదించారు.
కేసు విచారణలో డివిజన్ బెంచ్ వ్యాఖ్యలు:
ఈ కేసు విచారణ సందర్భంగా విద్యా సర్టిఫికెట్లలో పేరు మార్పులను అనుమతించగల షరతులను నిర్దేశించిన జిగ్యా యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ ప్రస్తావించింది.
- ఇష్టపూర్వకంగా పేరు మార్పు కోసం, సివిల్ కోర్టు నుండి ముందస్తు అనుమతి, అధికారిక గెజిట్‌లో ప్రచురించడం అవసరమని అది నొక్కి చెప్పింది.
- గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రచురించే ముందు ఎండీ సమీర్ రావు సివిల్ కోర్టు డిక్రీని పొందలేదని, కావున విద్యా సర్టిఫికెట్లలో పేరు మార్పుకు గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే సరిపోదని డివిజన్ బెంచ్ పేర్కొంది.
అలాగే సింగిల్ బెంచ్ జడ్జి నిర్ణయం సమర్థనీయం కాదని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది, సింగిల్ జడ్జికి ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే అధికార పరిధి లేదని, అటువంటి విషయాలను డివిజన్ బెంచ్ విచారించాలని పేర్కొంది.
అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు:
15 ఫిబ్రవరి 2025న, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుణ్ భన్సాలీ, జస్టిస్ జె. క్షితిజ్ శైలేంద్రతో కూడిన డివిజన్ బెంచ్, 2023లో సమీర్ రావు రిట్ పిటిషన్‌పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, ఉత్తర ప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు కాపీని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2023లో ఓ కేసులో భారత రాజ్యాంగం ప్రకారం సర్టిఫికెట్లపై పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందనే వాదన పూర్తిగా నిజం కాదు.