Fact Check, Fake News, Telugu
 

డిసెంబర్ 2025లో జరగనున్న లోక్ అదాలత్‌లలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుకు తెలంగాణ పోలీసులు ఎటువంటి రాయితీలు అందించడం లేదు

0

“పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నవారికి సదావకాశం. డిసెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ చలాన్లు, పెనాల్టీలను సెటిల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అంతేకాకుండా 50 నుంచి 100 శాతం డిస్కౌంట్లు అందిస్తున్నారు. సీటు బెల్ట్ లేకపోవడం, సిగ్నల్ జంపింగ్ వంటి కేసులను లోక్ అదాలత్‌ సెటిల్ చేసుకోవచ్చు. అయితే డ్రంక్ అండ్ డ్రైవింగ్, హిట్ అండ్ రన్ వంటి సీరియస్ కేసులను మాత్రం లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకోలేము.డిసెంబర్ 13 జరిగే ఈ జాతీయ లోక్ అదాలత్‌లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రజలు దీన్ని వినియోగించుకోవచ్చు” అని చెప్తున్న పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ & ఇక్కడ). ఇదే విషయాన్ని పేర్కొంటూ పలు ప్రముఖ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: NALSA వెబ్‌సైట్‌లో టోకెన్ జెనరేట్ చేసుకోవడం ద్వారా, తెలంగాణ ప్రజలు 13 డిసెంబర్ 2025న జరగనున్న లోక్ అదాలత్‌లలో 50 నుండి 100 శాతం తగ్గింపుతో తమ పెండింగ్ ట్రాఫిక్ చలాన్‌లను చెల్లించవచ్చు.

ఫాక్ట్(నిజం): 13 డిసెంబర్ 2025న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నారు. అయితే, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా లోక్ అదాలత్‌ను 21 డిసెంబర్ 2025కి రీషెడ్యూల్ చేశారు. 21 డిసెంబర్ 2025లో తెలంగాణలో జరగనున్న లోక్ అదాలత్‌లలో ట్రాఫిక్ చలాన్‌ల సెటిల్మెంట్ కోసం NALSA/ TSLSA ఎటువంటి టోకెన్‌లు అందించడం లేదు. ఈ లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ చలాన్‌ల పరిష్కారం లేదని TSLSA మాకు (Factly) స్పష్టం చేసింది. అంతేకాకుండా, తెలంగాణ వ్యాప్తంగా 21 డిసెంబర్ 2025న జరగనున్న లోక్ అదాలత్‌లలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లను రాయితీపై చెల్లించే అవకాశాన్ని కల్పించడం లేదని తెలంగాణ పోలీసులు కూడా మాకు (Factly) స్పష్టం చేశారు. ఐతే గతంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ట్రాఫిక్ చలాన్‌లు సెటిల్మెంట్ చేసుకోవడం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా లోక్ అదాలత్‌లను నిర్వహించిన అనుభవాలు ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

13 డిసెంబర్ 2025న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). దీనిలో భాగంగా విచారణలో ఉన్న సివిల్‌, క్రిమినల్‌, చెక్‌బౌన్స్‌ కేసులు, మోటారు వాహన ప్రమాదాలు, కుటుంబ తగాదాలు, మొదలైన కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఈ లోక్‌ అదాలత్‌లు కల్పిస్తాయి. అయితే, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (TSLSA) రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా తెలంగాణలో లోక్ అదాలత్‌ను 21 డిసెంబర్ 2025కి రీషెడ్యూల్ చేసింది.

ఐతే ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టులో చెప్తున్నట్టు డిసెంబర్ 2025లో జరగనున్న ఈ లోక్‌ అదాలత్‌లలో తెలంగాణ ప్రజలు ట్రాఫిక్ చలాన్‌లు సెటిల్మెంట్ చేసుకునేందుకు NALSA టోకెన్‌లు అందిస్తుందన్న వార్తలో నిజం లేదు.

ఇదే విషయమై మేము (Factly) తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (TSLSA) వర్గాలను సంప్రదించగా, 21 డిసెంబర్ 2025న తెలంగాణలో జరగనున్న లోక్ అదాలత్‌లలో ట్రాఫిక్ చలాన్‌ల పరిష్కారం లేదని మాతో చెప్పారు.

అంతేకాకుండా, తెలంగాణ వ్యాప్తంగా 21 డిసెంబర్ 2025న జరగనున్న లోక్ అదాలత్‌లలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లను రాయితీపై చెల్లించే అవకాశాన్ని కల్పించడం లేదని తెలంగాణ పోలీసులు కూడా మాకు (Factly) స్పష్టం చేశారు.

ఐతే గతంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ట్రాఫిక్ చలాన్‌లు సెటిల్మెంట్ చేసుకోవడం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా లోక్ అదాలత్‌లను నిర్వహించిన అనుభవాలు ఉన్నాయి. పలు సందర్భాలలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇలాంటి లోక్ అదాలత్‌లను నిర్వహించారు. 2016లో & 2017లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గోషామహల్‌లో లోక్ అదాలత్ నిర్వహించి, 50% రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించే అవకాశం కల్పించారు.

చివరగా, డిసెంబర్ 2025లో తెలంగాణ పోలీసులు పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లను రాయితీపై చెల్లించే అవకాశాన్ని కల్పిస్తూ ఎటువంటి లోక్ అదాలత్ నిర్వహించడం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll