తెలంగాణ రాష్ట్రంలో కేవలం ముస్లింలకి మాత్రమే సివిల్ సర్వీసెస్ పరీక్షకి సంబంధించి ఉచిత శిక్షణ ఇస్తున్నారని అర్ధం వచ్చేలా ఉన్న ఒక పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తెలంగాణ రాష్ట్రంలో కేవలం ముస్లింలకి మాత్రమే సివిల్ సర్వీసెస్ పరీక్షకి సంబంధించి ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
ఫాక్ట్(నిజం): తెలంగాణ ప్రభుత్వం కేవలం ముస్లింలకి మాత్రమే కాకుండా వివిధ స్టడీ సర్కిల్స్ ద్వారా అర్హులైన అందరికీ సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్ ఉద్యోగాలు, పోలీస్ ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన అనేక పరీక్షలకి ఉచితంగా శిక్షణ ఇస్తుంది. అలాగే మైనారిటీల్లో కేవలం ముస్లింలకి మాత్రమే కాకుండా మైనారిటీల్లో అర్హులైన క్రిస్టియన్స్, సిక్కులు మరియు ఇతర మైనారిటీలకు కూడా ఉచితంగా శిక్షణ అందిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకి సివిల్ సర్వీసెస్ పరీక్షకి సంబంధించి ఉచిత శిక్షణ ఇస్తున్న మాట నిజమైనప్పటికీ, ఇది కేవలం ముస్లింలకి మాత్రమే పరిమితం కాదు. వివిధ స్టడీ సర్కిల్స్ ద్వారా హిందువులకు కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షకి సంబంధించి ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఉదాహారణకి BC స్టడీ సర్కిల్ ద్వారా BCలకి మరియు SC స్టడీ సర్కిల్ ద్వారా SCలకి మరియు ST స్టడీ సర్కిల్ ద్వారా ద్వారా STలకి ప్రభుత్వం ఉచితంగా శిక్షణ అందిస్తుంది. 2020 సివిల్స్ పరీక్షకి SC స్టడీ సర్కిల్ ద్వారా SCలకి ఉచిత కోచింగ్ ఇవ్వడానికి విడుదల చేసిన నోటిఫికేషన్ ఇక్కడ చూడొచ్చు.
అలాగే మైనారిటీల్లో కేవలం ముస్లింలకి మాత్రమే కాకుండా మైనారిటీల్లో అర్హులైన క్రిస్టియన్స్, సిక్కులు మరియు ఇతర మైనారిటీలకు కూడా ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. ఐతే ఈ శిక్షణ అనేది కేవలం సివిల్ సర్వీసెస్ పరీక్షకి మాత్రమే పరిమితం కాకుండా గ్రూప్స్, బ్యాంక్ ఉద్యోగాలు, పోలీస్ ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాల వంటి అనేక ఇతర ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకి అర్హులైన వారికి ఉచితంగ శిక్షణ ఇస్తుంటారు. పైగా ఇలా ప్రతీ సంవత్సరం శిక్షణ అందిస్తుంటారు. కాబట్టి కేవలం ముస్లింలకి మాత్రమే ఉచితంగా శిక్షణ ఇస్తున్నారన్న వాదన కరెక్ట్ కాదు.
చివరగా, తెలంగాణ ప్రభుత్వం కేవలం ముస్లింలకి మాత్రమే కాకుండా అర్హులైన అందరికి సివిల్స్ మరియు ఇతర పరీక్షలకి సంబంధించి ఉచితంగా కోచింగ్ అందిస్తుంది.