21 అక్టోబర్ 2025న హైదరాబాద్‌లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ‘ముస్లింలు మంత్రి పదవిని హ్యాండిల్ చేయలేరు’ అని అన్నారని చెప్తున్న న్యూస్ క్లిప్పింగ్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో పాటు, మహమ్మద్ అజారుద్దీన్, తన సహకారంతోనే ఎమ్మెల్సీ అయ్యారని రేవంత్ అన్నారని, ముస్లింలను ఉద్దేశిస్తూ ఆయన అనేక వ్యాఖ్యలను ఈ సభలో చేశారని ఈ వైరల్ ‘వార్తా కథనం’లో ఉంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ముస్లింలు మంత్రి పదవిని హ్యాండిల్ చేయలేరని 21 అక్టోబర్ 2025న హైదరాబాద్‌లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అని చెప్తున్న న్యూస్ పేపర్ క్లిప్.
ఫ్యాక్ట్(నిజం): 21 అక్టోబర్ 2025న హైదరాబాద్‌లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలపై ఈ వ్యాఖ్యలు చేయలేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో ముస్లింలపై ఈ విధమైన వ్యాఖలు చేసినట్లు మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు దొరకలేదు.
అదనంగా, 21 అక్టోబర్ 2025న హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) లైవ్ స్త్రీమ్ (ప్రత్యక్షప్రసారం) మేము సిఏం రేవంత్ రెడ్డి అధికారిక ఫేస్‌బుక్ పేజీలో, ‘I&PR Telangana’ యూట్యూబ్ ఛానల్‌లో చూసాము.

ఈ కార్యక్రమంలో సిఏం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో ఎక్కడా కూడా ఆయన ముస్లింలు మంత్రి పదవిని హ్యాండిల్ చేయలేరని కానీ, వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్పింగులో ముస్లింలను ఉద్దేశించి ఆయన అన్నారని చెప్తున్న వ్యాఖ్యలు కానీ చేయలేదు.
తెలంగాణ పోలీసు శాఖ గొప్పతనాన్ని, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం గురించి, విధి నిర్వహణలో దేశం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన పోలీసుల గురించి ఆయన ఈ సభలో మాట్లాడారు. అలాగే, మావోయిస్టు ఉద్యమంలో ఉన్న నాయకులను జనజీవ స్రవంతిలో కలవమని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీస్ పాత్ర కీలకమైందని చెప్తూ, పోలీస్ శాఖ తమ ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ వారందర్లో స్ఫూర్తిని నింపుతుంది అంటూ అనేక విషయాలు చెప్పారు. కానీ, వైరల్ న్యూస్ క్లిప్పింగులో చెప్పిన విషయాలు ఇవి ఆయన ఈ కార్యక్రమంలో చేసిన, సుమారు 19 నిమిషాల ప్రసంగంలో లేవు.
అయితే, వైరల్ అవుతున్న ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగును ఏ వార్త సంస్థ ప్రచురించింది అనే విషయం మాకు మా పరిశోధనలో తెలియలేదు. అందులో ఉన్న వార్త కల్పితం కాబట్టి ఇది ఎడిట్ చేసి తయారు చేయబడిన పేపర్ క్లిప్ అని మనం అనుకోవచ్చు
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 21 అక్టోబర్ నాడు జరుపుకుంటారు. 21 అక్టోబర్ 1959న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్‌లో చైనా దళాల దాడిలో 10 మంది పోలీసులు తమ వీర మరణం పొందారు. అప్పటి నుండి, అక్టోబర్ 21ని ప్రతి సంవత్సరం పోలీసు సంస్మరణ దినోత్సవంగా దేశవ్యాప్తం పాటిస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

చివరగా, 21 అక్టోబర్ 2025న జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ‘ముస్లింలు మంత్రి పదవిని హ్యాండిల్ చేయలేరు’ అని అనలేదు.

