సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ‘బీజేపీ ప్రభుత్వం పడిపోతే తప్ప చైనాకు భవిష్యత్ లేదు’ అని అన్నట్లు ‘TNews Telugu’ రిపోర్టు చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: బీజేపీ ప్రభుత్వం పడిపోతే తప్ప చైనాకు భవిష్యత్ లేదు – తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.
ఫాక్ట్(నిజం): ఈ పోస్టులో ఉన్న ఫోటో ఎడిట్ చెయ్యబడింది, ‘TNews Telugu’ వారి ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేసిన ఒక పోస్టు ఈ ఫోటోకు ఆధారం. వారు అప్లోడ్ చేసిన పోస్టులో ‘బీజేపీ ప్రభుత్వం పడిపోతే తప్ప దేశానికి భవిష్యత్ లేదు’ అని తమ్మినేని వ్యాఖ్యానించినట్లు ఉంది. ఇటీవల ఖమ్మంలో జరిగిన ప్రజా పోరుయాత్ర బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖలు చేసారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ ఫొటోలో ‘TNews Telugu’ అనే ఫేస్బుక్ పేజీ పేరు ఉండటం గమనించి, ఆ పేజీ కోసం ఫేస్బుక్లో వెతకగా అది లభించింది. ఇందులో, తమ్మినేని వీరభద్రం చేసిన వ్యాఖ్యల గురించి వారు అప్లోడ్ చేసిన పోస్టు కోసం వెతకగా ఏప్రిల్ 22న ‘బీజేపీ ప్రభుత్వం పడిపోతే తప్ప దేశానికి భవిష్యత్ లేదు #TNews#TNewstelugu’ అనే వివరణతో ‘TNews Telugu’ అప్లోడ్ చేసిన పోస్టు లభించింది.

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఖమ్మంలో ఇటీవల జరిగిన ప్రజా పోరుయాత్ర బహిరంగ సభలో ఈ వ్యాఖ్య చేసాడు, ఆ వ్యాఖ్యకు సంబంధించిన వార్త కథనమే ఈ పోస్టులో ఉంది. పోస్టులో ఉన్న వాక్యంలో దేశానికీ భవిష్యత్తు లేదు అనే చోట చైనాకు భవిష్యత్తు లేదు అని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తప్పుగా షేర్ చేస్తున్నారు .
చివరిగా, బీజేపీ ప్రభుత్వం పడిపోతే తప్ప చైనాకు భవిష్యత్తు లేదు అని తమ్మినేని వీరభద్రం అనలేదు.