Fake News, Telugu
 

ఇళ్లని దోచుకునే ముఠా నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికను భారత్‌కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

“ఇళ్లను దోచుకోవడానికి కొందరు వ్యక్తులు హోమ్ వ్యవహారాల అధికారులమంటూ తిరుగుతున్నారు, అందువలన ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలి” అని చెప్తున్న ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ‘ఆయుష్మాన్ భారత్’ నమోదు కోసం వచ్చిన ప్రభుత్వ అధికారులమంటూ ఇళ్లని దోచుకునే ముఠా తిరుగుతోంది. అందువలన ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలి.

ఫ్యాక్ట్: ఈ హెచ్చరిక దక్షిణాఫ్రికా ప్రభుత్వం 20 అక్టోబర్ 2017లో జారీ చేసింది. ఎన్నికల కార్డును ధృవీకరించడానికి హోమ్ వ్యవహారాల డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చాం అంటూ చెప్పుకునే వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దోచుకుంటున్నారు, అందువలన ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని ఈ హెచ్చరికలో ఉంది. ఈ హెచ్చరికతో భారత దేశానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇంటర్నెట్లో సంబంధిత కీ వర్డ్స్ తో వెతకగా , దక్షిణాఫ్రికాకు సంబంధించిన ప్రభుత్వ వెబ్‌సైటులో ఇలాంటి హెచ్చరిక ఒకటి లభించింది. ఈ హెచ్చరికను   దక్షిణాఫ్రికాకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు 20 అక్టోబర్ 2017న జారీ చేశారు. ఈ హెచ్చరిక ప్రకారం, “హోమ్ వ్యవహారాల డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చినట్లు చెప్పుకునే వ్యక్తులు ఎన్నికల గుర్తింపు కార్డులను ధృవీకరించాలంటూ ఇంట్లోకి  ప్రవేశిస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఇంటిని దోచుకుంటారు. ప్రభుత్వం తరపున అలాంటి ధృవీకరణ కార్యక్రమం ఎక్కడా జరగటం లేదు. ఒకవేళ జరపాలి అనుకుంటే ప్రభుత్వ వార్తా ఛానెళ్ల ద్వారా ప్రజలకు తెలియచేస్తాం”

ఇదే విషయాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం వారు 20 అక్టోబర్ 2017న ట్విట్టర్‌లో  కూడా పోస్టు చేశారు.

ఇక ఇదే హెచ్చరిక కేవలం ఇక్కడే కాకుండా, సింగాపుర్, మలేషియాలో కూడా ప్రచారంలో ఉంది. వాటిని అక్కడి వార్తా పత్రికలు కూడా దక్షిణాఫ్రికాకు చెందిన వార్తగా నిర్ధారణ చేశాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఇక ఇదే అంశంపైన భారత ప్రభుత్వం ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు.

చివరిగా, ఇళ్లని దోచుకునే ముఠా నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికను భారత్‌కు సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll