Fake News, Telugu
 

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి శశి థరూర్ ఈ వ్యాఖ్యలు చేయలేదు

0

“షారుఖ్ ఖాన్ కుమారుడు లోకం తెలియని పిల్లవాడు. ఒకవేళ నేరం రుజువైనా అతనిని నేరస్తునిగా చూడకూడదు” అని శశి థరూర్ అన్నాడని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ముంబై డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: “షారుఖ్ ఖాన్ కుమారుడు లోకం తెలియని పిల్లవాడు. ఒకవేళ నేరం రుజువైనా అతనిని నేరస్తునిగా చూడకూడదు” అని శశి థరూర్ అన్నాడు.

ఫాక్ట్: ‘షారుఖ్ ఖాన్ కుమారుడు లోకం తెలియని పిల్లవాడు, ఒకవేళ నేరం రుజువైనా అతనిని నేరస్తునిగా చూడకూడదు’, అని శశి థరూర్ అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకొని షారుఖ్ ఖాన్‌పై ప్రతీకార దాహంతో పరిగెడుతున్న విధానం చూస్తుంటే తనకు అసహ్యంగా ఉందని థరూర్ అన్నారు. 02 అక్టోబర్ 2021 రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్‌ షిప్‌పై దాడి చేసిన NCB షారుఖ్ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో సహా కొందరిని అరెస్ట్ చేసారు. పోలీసులు పలు రకాల నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెయిల్ కోసం అప్లై చేయగా, ముంబై కోర్టు బెయిల్ నిరాకరించి 07 అక్టోబర్ 2021 వరకు NCB కస్టడిలో ఉండాల్సిందిగా ఆదేశించింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ అలా అన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటి వ్యాఖ్యలు గనక చేసుంటే వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.

శశి థరూర్ ముంబై డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన విషయం గురించి, దాని తరువాత జరుగుతున్న పరిణామాల గురించి ఒక ట్వీట్ చేసారు. షారుఖ్ ఖాన్ కుమారుడు లోకం తెలియని పిల్లవాడు, ఒకవేళ నేరం రుజువైనా అతనిని నేరస్తునిగా చూడకూడదు అని ఈ ట్వీట్‌లో అనలేదు. ఈ విషయంపై షారుఖ్ ఖాన్ కుటుంబం పట్ల ప్రజలు సానుభూతి చూపించాలని శశి థరూర్ పిలుపునిచ్చారు. “23 ఏళ్ల కుర్రాడిని మరీ అంతలా పట్టుకుని షారుఖ్ ఖాన్‌పై రుద్ధాల్సిన అవసరం లేదు” అని అన్నారు.

డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకొని షారుఖ్ ఖాన్‌పై ప్రతీకార దాహంతో పరిగెడుతున్న విధానం చూస్తుంటే తనకు అసహ్యంగా ఉందని అన్నారు. “నాకు డ్రగ్స్ అంటే ఇష్టం లేదు, ఎప్పుడూ వాటి జోలికి కూడా పోలేదు. కానీ, కొంత మంది వీటిని అడ్డం పెట్టుకొని షారుఖ్ ఖాన్‌ని విచ్ హంట్ చేస్తున్నారు“, అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

02 అక్టోబర్ 2021 రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్‌ షిప్‌పై దాడి చేసిన NCB ఆర్యన్ ఖాన్‌తో సహా కొందరిని అరెస్ట్ చేసారు. NCB వారు అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గరనుండి పలు రకాల నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెయిల్ కోసం అప్లై చేయగా, ముంబై కోర్టు బెయిల్ నిరాకరించి 07 అక్టోబర్ 2021 వరకు NCBకి కస్టడి ఇచ్చింది. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్‌కు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు మద్దుతుగా నిలుస్తున్నారని ఈ ఆర్టికల్ ద్వారా చూడొచ్చు.

చివరగా, షారుఖ్ ఖాన్ కుమారుడు లోకం తెలియని పిల్లవాడు, ఒకవేళ నేరం రుజువైనా అతనిని నేరస్తునిగా చూడకూడదు అని శశి థరూర్ అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll