“మేము దాడులు చేస్తున్న ప్రాంతంలో ఒక వేళ భారతీయులు ఉంటే వారు తమ ఇళ్లపై భారతీయ త్రివర్ణ జెండాను ఎగురవేయండి. మేమే వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం”, అని రష్యా ఆర్మీ ప్రకటించినట్టు చెప్తూ, ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తాము దాడులు చేస్తున్న ప్రాంతంలో భారతీయులు తమ ఇళ్లపై భారతీయ త్రివర్ణ జెండాను ఎగురవేస్తే, వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని రష్యా ఆర్మీ ప్రకటించింది.
ఫాక్ట్: రష్యా ఆర్మీ అలాంటి ఒక ప్రకటన చేసినట్టు ఎక్కడా ఎటువంటి సమాచారం లేదు. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం వారు ఇచ్చిన అడ్వైజరీలో మాత్రం ప్రయాణిస్తున్నప్పుడు భారతీయ జెండాను ముద్రించి, వాహనాలు మరియు బస్సులపై బాగా కనిపించేలా అతకించమని చెప్పినట్టు తెలిసింది. అయితే, భారతీయ విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని రష్యా హామీ ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కావున పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్ట్‌లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, రష్యా ఆర్మీ అలాంటి ఒక ప్రకటన చేసినట్టు ఎక్కడా ఎటువంటి సమాచారం దొరకలేదు. ఒక వేళ రష్యా ఆర్మీ అలాంటి ప్రకటన ఏదైనా చేసి ఉంటే, అన్నీ మీడియా సంస్థలు దాని గురించి ప్రచురించేవి, కానీ ప్రముఖ మీడియా సంస్థలు ఏవీ అలాంటి వార్తను ప్రచురించలేదు. రష్యాలోని భారత రాయబార కార్యాలయం కూడా అలాంటి ట్వీట్ చేయలేదు.
అయితే, 25 ఫిబ్రవరి 2022న ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇచ్చిన అడ్వైజరీలో – “ప్రయాణిస్తున్నప్పుడు భారతీయ జెండాను ముద్రించి, వాహనాలు మరియు బస్సులపై బాగా కనిపించేలా అతికించండి” (తెలుగు అనువాదం), అని సూచించినట్టు ఇక్కడ చదవచ్చు. అందులో ఎక్కడా ఇంటిపై జెండా పెట్టుకోమని, అలా చేస్తే రష్యా ఆర్మీ సురక్షిత ప్రాంతానికి తరలిస్తారని లేదు.
‘ANI’ వారితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ – “బైక్‌లు, కార్లు, బస్సులపై వెళ్లే విద్యార్థులకు వాహనాలపై భారత జెండాను ప్రదర్శించాలని కోరాము. జెండాల చిత్రాలను తీసుకెళ్లని వ్యక్తులకు సోషల్ మీడియా ద్వారా జెండాలను పంపాము. భారతీయ విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని రష్యా హామీ ఇచ్చింది. భారత జెండాలతో ఉక్రెయిన్ సరిహద్దుకు చేరుకోవాలని భారతీయులను కోరాము” (తెలుగు అనువాదం), అని చెప్పినట్టు ఇక్కడ చదవచ్చు.

తాజాగా (01 మార్చి 2022న) ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం వారు భారతీయులందరినీ, విద్యార్థులతో సహా, ఈ రోజు కీవ్ నుండి అత్యవసరంగా బయలుదేరమని సూచించింది. అంతేకానీ, పోస్ట్‌లో చెప్పినట్టు ఇళ్లపై భారతీయ త్రివర్ణ జెండాను ఎగురవేస్తే, వారిని రష్యా ఆర్మీ సురక్షిత ప్రాంతానికి తరలిస్తుందని సూచించలేదు.
చివరగా, భారతీయులు తమ ఇళ్లపై భారతీయ త్రివర్ణ జెండాను ఎగురవేస్తే, వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని రష్యా ఆర్మీ ప్రకటించలేదు.