“ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా జమ్మూకాశ్మీర్‌లోని భారత సైన్యానికి 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో జీపులను విరాళంగా అందించారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ). వైరల్ పోస్టుతో పాటు కామోఫ్లాజ్ లాంటి రంగు కల్గిన మహీంద్రా స్కార్పియో వాహనాలను చూపిస్తున్న ఫొటోలను జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా జమ్మూ కాశ్మీర్‌లోని భారత సైన్యానికి 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో జీపులను విరాళంగా అందించారు.
ఫాక్ట్(నిజం): ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా జమ్మూ కాశ్మీర్‌లోని భారత సైన్యానికి 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనాలను విరాళంగా ఇవ్వలేదు. ఆయన ఇలాంటి విరాళం ఇచ్చారని చెప్పే ఎలాంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ ఏవీ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, ఇటీవల రతన్ టాటా భారత సైన్యానికి 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో జీపులను విరాళంగా అందించారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, రతన్ టాటా లేదా టాటా గ్రూపు గతంలో కానీ, ఇటీవల కానీ 2500 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను భారత సైన్యానికి విరాళంగా అందించారని చెప్పే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. ఒక వేళ రతన్ టాటా లేదా టాటా గ్రూపు సంస్థలు 2500 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను భారత సైన్యానికి విరాళంగా విరాళాన్ని చేసి ఉంటే, ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్టు చేసి ఉండేవి. తదుపరి మేము రతన్ టాటా మరియు టాటా గ్రూపుకు సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ , & ఇక్కడ) మరియు భారత సైన్యానికి సంబంధించిన వెబ్‌సైట్‌లను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మరియు అధికారిక సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) కూడా పరిశీలించాము, ఎక్కడ కూడా రతన్ టాటా లేదా టాటా సంస్థలు ఇలాంటి విరాళం భారత సైన్యానికి ఇచ్చినట్లు చెప్పే పోస్ట్‌లు లేదా ప్రకటనలు ఏవీ కనుగొనబడలేదు.
ఈ వెతికే క్రమంలోనే, ఈ వైరల్ పోస్ట్‌లోని ఫోటోలు 2016 నుండి ఇదే విధమైన క్లెయిమ్ తో వైరల్ అవుతున్నాయని మేము కనుగొన్నాము (ఇక్కడ).
తదుపరి ఈ వైరల్ ఫొటోలకు సంబంధించిన సమాచారం కోసం, గూగల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, 01 ఏప్రిల్ 2012న ‘ఇండియన్ ఆటోస్ బ్లాగ్ (Indian Autos Blog)’ అనే వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయిన కథనం ఒకటి లభించింది. ఈ కథనం వైరల్ పోస్టులోని రెండు ఫోటోలను కలిగి ఉంది. ఈ కథనం ప్రకారం, ఈ ఫోటోలు లెవెల్ -3 రక్షణను కలిగిన మహీంద్రా రక్షక్ ప్లస్ (మెడిఫైడ్ స్కార్పియో) వాహనాన్ని చూపిస్తున్నాయి. ఈ వాహనాన్ని మొట్టమొదటిసారిగా 2012లో డిఫెన్స్ ఎక్సపో 2012 (DEFEXPO)లో ప్రదర్శించారు, మహీంద్రా రక్షక్ ప్లస్ వాహనం కేవలం రక్షణ దళాల కోసం ప్రత్యేకంగా తయారుచేయబడింది అని ఈ కథనం పేర్కొంది. ఈ మహీంద్రా రక్షక్ ప్లస్ వాహనానికి సంబంధించిన ఫోటోలతో కూడిన పలు కథనాలను ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
2019లో పబ్లిష్ అయిన ‘అమర్ ఉజాలా’ వార్తా కథనం ప్రకారం , జమ్మూ&కాశ్మీర్ పోలీసు అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో (మహీంద్రా రక్షక్ ప్లస్) వాహనాలు అందించబడ్డాయి అని తెలుస్తుంది. అలాగే ఈ మహీంద్రా రక్షక్ ప్లస్ వాహనాలను అనేక సంవత్సరాలుగా జమ్మూ&కాశ్మీర్‌లో భారత సైన్యం ఉపయోగిస్తుంది అని తెలిసింది (ఇక్కడ , ఇక్కడ, & ఇక్కడ). అలాగే, 12 జనవరి 2023న ప్రచురించబడిన ‘ది ఎకనామిక్ టైమ్స్’ వార్తాకథనం ప్రకారం, దాదాపు 1500 మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUVలను భారత సైన్యం ఆర్డర్ చేసింది. 11 జనవరి 2023న ఇదే విషయాన్ని తెలుపుతూ మహీంద్రా సంస్థ (మహీంద్రా ఆటోమోటివ్) తమ అధికారిక X(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
తదుపరి మేము వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన సమాచారం కోసం మహీంద్రా ఆటోమోటివ్ యొక్క అధికారిక X(ట్విట్టర్) ఖాతాను కూడా పరిశీలించాము, అయితే ఇండియన్ ఆర్మీ ఇటీవలే 2,500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోలను ఆర్డర్ చేసినట్లు లేదా కొనుగోలు చేసినట్లు ధృవీకరించే ఎలాంటి పోస్ట్ మాకు కనుగొనబడలేదు. భారత సైన్యం నిజంగానే అలాంటి ఆర్డర్‌ను చేసి ఉంటే, పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్టు చేసి ఉండేవి మరియు మహీంద్రా ఆటోమోటివ్ కూడా ఖచ్చితంగా ప్రకటన చేసి ఉండేది. దీన్ని బట్టి మనం ఇటీవల భారత సైన్యం 2500 బుల్లెట్ ప్రూఫ్ మహీంద్రా స్కార్పియో వాహనాలను ఆర్డర్ చేయలేదని నిర్ధారించవచ్చు.
ఇంతకుముందు, రతన్ టాటా భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ బస్సును విరాళంగా ఇచ్చారని పేర్కొంటూ ఒక బస్సు ఫోటోతో కూడిన పోస్ట్ వైరల్ కాగా, దానిని డీబంక్ చేస్తూ Factly పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు
చివరగా, ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా జమ్మూ కాశ్మీర్‌లోని భారత సైన్యానికి 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనాలను విరాళంగా ఇవ్వలేదు. అందించలేదు; ఈ వైరల్ పోస్టు ఫేక్.