Fake News, Telugu
 

కొలంబియాలోని నిరసనల్లో భాగంగా తీసిన వీడియోను అఫ్గానిస్తాన్‌లో మనుషులను ప్లాస్టిక్ కవర్లో బంధించినట్టు షేర్ చేస్తున్నారు

0

“దేవుని వాక్యం బోధించిన స్త్రీ. పు. లను ప్లాస్టిక్ కవర్లో బంధించిన అఫ్గానిస్తాన్‌” అని అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: అఫ్గానిస్తాన్‌లో మనుషులను ప్లాస్టిక్ కవర్లో బంధించిన వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో కొలంబియాలో తీసింది, అఫ్గానిస్తాన్‌కు సంబంధించింది కాదు. ప్రతిపాదిత పన్ను పెంపుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 2021 చివరిలో కొలంబియాలో నిరసనలు జరిగాయి. ఆ నిరసనల్లో భాగంగా, తమ హక్కుల కోసం పోరాడటానికి వెళ్లి తిరిగి రాలేకపోయిన వారందరి గౌరవార్థం, “ఎంపాక్వెటాడోస్” (packaging) అనే ఈ నిరసన మేలో తెలిపారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల అరాచక పాలన గురించి అందరికీ తెలిసిందే. ప్రాథమిక స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారిని చాలా చోట్ల అణచివేస్తున్నారు. కానీ, ఈ వీడియో అఫ్గానిస్తాన్‌కు సంబంధించినది కాదు, కొలంబియా దేశానికి సంబంధించినది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న ఒక యూట్యూబ్‌ వీడియో లభించింది. ఈ యూట్యూబ్‌ వీడియోను 1.11 టైం స్టాంప్ వద్ద క్లిప్ చేసి ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోను షేర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. యూట్యూబ్‌లో వీడియోను 27 మే 2021న అప్లోడ్ చేసారు, వీడియో యొక్క టైటిల్ (ఇంగ్లీష్లో) ‘performance packed the town Medellin national strike May 26, 2021’. మెడెలిన్ కొలంబియా దేశం యొక్క రెండవ అతిపెద్ద నగరం.

వీడియో మెడెలిన్, కొలంబియాకు సంబంధించి అయ్యుంటుందన్న క్లూతో, గూగుల్లో కీ వర్డ్స్ యూస్ చేసి వెతకగా, ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్‌లో మనుషులు ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఫోటోలు కొన్ని లభించాయి. కొలంబియాకు చెందిన డిజిటల్ మీడియా సంస్థ ‘లే కుయెంటో’ 28 మే 2021న ఈవెంట్ యొక్క ఫోటోలను పోస్ట్ చేసాయి. ఈ వీడియో మెడెలిన్, కొలంబియాకు సంబంధించినవిగా తెలిసింది.

ప్రతిపాదిత పన్ను పెంపుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 2021 చివరిలో కొలంబియాలో నిరసనలు జరిగాయి. ఆ నిరసనల్లో భాగంగా, తమ హక్కుల కోసం పోరాడటానికి వెళ్లి తిరిగి రాలేకపోయిన వారందరి గౌరవార్థం, “ఎంపాక్వెటాడోస్” (packaging) అనే ఈ నిరసన తెలిపినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల అరాచక పాలన గురించి అందరికీ తెలిసిందే. ప్రాథమిక స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారిని చాలా చోట్ల అణచివేస్తున్నారు. కానీ, ఈ వీడియో అఫ్గానిస్తాన్‌కు సంబంధించినది కాదు, కొలంబియా దేశానికి సంబంధించినది.

చివరగా, కొలంబియాలో నిరసనల్లో భాగంగా తీసిన వీడియోను అఫ్గానిస్తాన్‌లో మనుషులను ప్లాస్టిక్ కవర్లో బంధించిన వీడియో అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll