ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 27 జూలై 2025 నుంచి 31జూలై 2025 వరకు సింగపూర్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో, సింగపూర్‌లో చంద్రబాబు కాన్వాయ్ దృశ్యాలంటూ భారీ సంఖ్యలో మోటార్ సైకిళ్లు, కార్లను చూపుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: జూలై 2025 సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ యొక్క దృశ్యాలు.
ఫాక్ట్: ఈ వీడియో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 2025లో చేపట్టిన ప్యారిస్, ఫ్రాన్స్ పర్యటనకి సంబంధించినది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న పూర్తి వీడియో ‘Stephane Paris production’ అనే యూట్యూబ్ ఛానెల్లో 16 ఫిబ్రవరి 2025న అప్లోడ్ చేయబడినట్లు గుర్తించాం. ఈ వీడియో ఫిబ్రవరి 2025లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో పర్యటించినప్పుడు ఆయన వాహనశ్రేణిని (Motorcade) చూపుతుందని పేర్కొనబడింది.

అలాగే పూర్తి వీడియోలోని కనిపించిన కారు నెంబరు(IN BS 5966) , ఫ్రాన్స్ పర్యటనలో మోదీ ప్రయాణించిన కారు నెంబరు ఒకటే ఉండడం గమనించవచ్చు.

అదనంగా, పూర్తి వీడియో యొక్క లొకేషన్ కోసం గూగుల్ మ్యాప్స్ ద్వారా వెతకగా, ఈ వీడియో ప్యారిస్‌లోని ఇన్వాలైడ్స్ బ్రిడ్జి ప్రాంతంలో చిత్రీకరించినట్లుగా గుర్తించాం.

ఇక జూలై 2025 చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించిన దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, సింగపూర్‌లో చంద్రబాబు కాన్వాయ్ అంటూ ప్యారిస్‌లో మోదీ కాన్వాయ్ దృశ్యాలను షేర్ చేస్తున్నారు.