‘శ్రీరంగంలో వెయ్యి సంవత్సరములు అయినా అలాగే ఉన్న శ్రీ రామానుజాచార్యుల పార్థివ దేహం’ అంటూ ఒక ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: శ్రీరంగంలో రామానుజాచార్యుల పార్థివ దేహం ఫోటో.
ఫాక్ట్: ఇది 2015లో మంగోలియాలో కనుగొన్న 200 ఏళ్ల మమ్మీఫైడ్ సన్యాసి (మాంక్) యొక్క ఫోటో. ఈ ఫోటోకి రామానుజాచార్యుల వారికి సంబంధంలేదు. రామానుజాచార్యుల వారు 1017లో పుట్టి 1137లో శ్రీరంగం రంగనాథస్వామి గుడిలో సమాధి (బృందావనం లేదా తిరుమేని) అయినట్టు చెప్తారు. ప్రత్యేక లేపనాలను అద్ది రామానుజాచార్యుల వారి శరీరాన్ని శ్రీరంగంలో భద్రపరుస్తున్నారని కొంతమంది అంటారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటోతో ఉన్న ఒక ఆర్టికల్ లభించింది. మంగోలియాలో కనుగొన్న 200 ఏళ్ల మమ్మీఫైడ్ సన్యాసి (మాంక్) యొక్క ఫోటో అని తెలుస్తుంది. మంగోలియన్ రాజధాని ఉలాన్ బాతర్ లోని సోంగినోఖైర్ ఖాన్ జిల్లాలో ఈ మృతదేహం కనుగొనబడిందని 2015లో ప్రచురించిన ఈ ఆర్టికల్‌లో తెలిపారు. మమ్మీఫై చేయబడిన ఈ శరీరం ఇంకా ధ్యానం చేస్తున్నట్లుగా పద్మాసనంలో కూర్చునట్టుగా ఉందని, ఆ శరీరం సుమారు 200 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదే ఫోటోతో మరికొన్ని వార్తసంస్థలు 200 ఏళ్ల మమ్మీఫైడ్ మాంక్ పై ఆర్టికల్స్ ప్రచురించాయి, అవి ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడొచ్చు.
రామానుజాచార్యులు విశిష్టాద్వైతం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 1017లో పుట్టి 1137లో శ్రీరంగం రంగనాథస్వామి గుడిలో సమాధి (బృందావనం లేదా తిరుమేని) అయినట్టు చెప్తారు. శ్రీరంగం రామానుజాచార్యుల వారి ప్రధాన కేంద్రంగా ఉండేది. ప్రత్యేక లేపనాలను అద్ది రామానుజాచార్యుల వారి శరీరాన్ని శ్రీరంగంలో భద్రపరుస్తున్నారని కొంతమంది ప్రాచుర్యంలోకి తెచ్చారు.
చివరగా, మంగోలియాలో కనుగొనబడిన 200 ఏళ్ల మమ్మీఫైడ్ మాంక్ యొక్క ఫోటోను పట్టుకొని శ్రీరంగంలో రామానుజాచార్యుల పార్థివ దేహం అంటున్నారు.