అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వ్యక్తులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియోలతో పాటు, కొందరి బ్యాంక్ వివరాలు, గూగుల్ పే (GPay) & ఫోన్ పే (PhonePe) నంబర్‌లను షేర్ చేస్తూ, వీడియోలలో కనిపిస్తున్న వ్యక్తులకు (ఆరోగ్య కారణాలతో బాధపడుతున్న వ్యక్తులకు) సహాయం చేయడానికి ఈ బ్యాంక్ వివరాలలో లేదా గూగుల్ పే & ఫోన్ పే నంబర్‌లలో సహాయం చేయమని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ పోస్టులకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోలతో పాటు షేర్ అవుతున్న బ్యాంక్ వివరాలు, గూగుల్ పే & ఫోన్ పే నంబర్‌లు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు, ఈ వీడియోలతో పాటు షేర్ అవుతున్న బ్యాంక్ వివరాలు, గూగుల్ పే & ఫోన్ పే నంబర్‌లకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేని వ్యక్తులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోలకు వారి స్వంత బ్యాంక్ వివరాలు, గూగుల్ పే & ఫోన్ పే నంబర్‌లు జత చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా ఈ పోస్టులో షేర్ చేసిన బ్యాంక్ వివరాలను (Account no: 135912010000918. IFSC code: UBIN0813591, Name: Akki Nagendrababu, Unionbank) పరిశీలిస్తే, ఈ అకౌంట్ నంబర్ యూనియన్ బ్యాంక్, బృందావన్ గార్డెన్స్ బ్రాంచ్, గుంటూరుకు సంబంధించినది అని తెలిసింది. అలాగే ఇవ్వబడిన గూగుల్ పే & ఫోన్ పే నంబర్‌లు (8179116626 & 8179779005) గూగుల్ పేలో వెతకగా, 8179116626 నంబర్ అక్కి నాగేంద్రబాబు (Akki Nagendrababu) పేరుతో, 8179779005 నంబర్ దీపిక అక్కి అలియాస్ భవనం శివారెడ్డి పేరుతో రిజిస్టర్ అయినట్లు తెలిసింది. అయితే, ఈ రెండు ఫోన్ నంబర్‌లు ప్రస్తుతం పని చేయడం లేదు.


తదుపరి మొదటి వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులకు సంబంధించిన పలు ఇతర వీడియోలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలు M. స్వరూప (M. Swarupa) అనే మహిళకు సంబంధించిన మహిళ ఇన్‌స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేయబడ్డాయి.

ఈ వీడియోలలో ఇవ్వబడిన ఫోన్ నంబర్ (9966099752)కి మేము కాల్ చేయగా, వీడియోలో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న మహిళ (ముద్రకోలా స్వరూప) మాతో మాట్లాడారు. మాతో మాట్లాడుతూ స్వరూప, ఈ వీడియోలో ఉంది ఆమె, ఆమె పిల్లలు రాజ్ కుమార్, సాహిత్య అని, ఆమెకు కండరాల సంబంధిత వ్యాధి ఉందని, ఆమెది తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి అని చెప్పారు. అలాగే వైరల్ పోస్టులలో షేర్ చేయబడిన బ్యాంక్ వివరాలు ((Account Number: 135912010000918. IFSC Code: UBIN0813591, Name: Akki Nagendrababu, Union Bank), గూగుల్ పే & ఫోన్ పే నంబర్లు (8179116626 & 8179779005) తన కుటుంబానికి సంబంధించినవి కాదని కూడా ఆమె అన్నారు.

తదుపరి మాతో మాట్లాడిన మహిళ (ముద్రకోలా స్వరూప) నిజంగా తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన వారేనా అని నిర్ధారించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో ఆమెకు సంబంధించిన వివరాల కోసం వెతకగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి గ్రామానికి సంబంధించిన రేషన్ కార్డు వివరాలలో ఆమె కుటుంబం వివరాలు మాకు లభించాయి. దీన్ని బట్టి మాతో మాట్లాడిన మహిళ (ముద్రకోలా స్వరూప) జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి అని, ఇచ్చిన వివరాలు కూడా నిజమే అని మనం నిర్ధారించవచ్చు.

ఇక రెండవ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను ‘Impact Guru’ అనే ఫేస్‌బుక్ పేజీ 26 మార్చి 2024న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ‘Impact Guru’ అనేది భారతదేశంలోని ఒక ప్రముఖ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్.

అయితే, ఈ వీడియోను మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇందులో వైరల్ వీడియోతో పాటు షేర్ అవుతున్న గూగుల్ పే & ఫోన్ పే నంబర్‌లు లేవు. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియోలో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న మహిళ పేరు పల్లవి, అలాగే వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు ఆమె పిల్లలు, భర్త శంకర్. కానీ వైరల్ వీడియోతో పాటు షేర్ అవుతున్న ఫోన్ నంబర్ 8179779005 దీపిక అక్కి అలియాస్ భవనం శివారెడ్డి పేరుతో గూగుల్ పే & ఫోన్ పేలో రిజిస్టర్ అయింది.
అలాగే, ‘Impact Guru’ సంస్థ వెబ్‌సైట్ ప్రకారం, కమ్మ పల్లవి w/o: కమ్మ శంకర్ కోసం చెప్పటిన క్రౌడ్ ఫండింగ్ (విరాళాల సేకరణ) ముగిసింది , ప్రస్తుతం ఎటువంటి విరాళాలు సేకరించడం లేదు.

చివరగా,ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల వీడియోలను సంబంధం లేని వ్యక్తులు ఉపయోగిస్తూ సహాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసి డబ్బులు దోచుకుంటున్నారు.


