05 ఏప్రిల్ 2025న, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025 కు తన ఆమోదాన్ని తెలిపారు, రాష్ట్రపతి ఆమోదంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది (ఇక్కడ, ఇక్కడ). ఇటీవల వక్ఫ్ (సవరణ) బిల్లును భారత పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. ఈ బిల్లును లోక్‌సభ 03 ఏప్రిల్ 2025న సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదించింది, లోక్‌సభలో ఈ బిల్లుకు 288 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు (ఇక్కడ, ఇక్కడ). అలాగే 04 ఏప్రిల్ 2024న తెల్లవారుజామున ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది, రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి (ఇక్కడ, ఇక్కడ). వక్ఫ్ (సవరణ) బిల్లుపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అన్ని సవరణలు తిరస్కరించబడ్డాయి. ఈ నేపథ్యంలోనే, “భారత పార్లమెంటులో వక్ఫ్ (సవరణ) బిల్లు ఆమోదం పొందిన తర్వాత AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నవ్వుతూ కనిపించాడు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ డీకే అరుణ, పలువురు ఇతర ఎంపీలను చూడవచ్చు. అలాగే మరో వీడియోను షేర్ చేస్తూ, భారత పార్లమెంటులో వక్ఫ్ (సవరణ) బిల్లు ఆమోదం పొందడంతో అసదుద్దీన్ ఒవైసీ ఏడుస్తూ కనిపించాడు అని క్లెయిమ్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ).ఈ కథనం ఈ వీడియోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అసదుద్దీన్ ఒవైసీ నవ్వుతున్నట్లు/ఏడుస్తున్నట్లు చూపిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలు పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందటానికి ముందు తీసినవి. ఈ వీడియోలకు ఇటీవల ఆమోదించబడిన వక్ఫ్ (సవరణ) బిల్లుకు సంబంధం లేదు. మొదటి వైరల్ వీడియో 29 జనవరి 2025న వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన JPC సమావేశానికి సంబంధించినది. రెండోవ వీడియో 07 ఆగస్టు 2024న జరిగిన లోకసభ సమావేశంలో ఒవైసీ తన కళ్ళజోడు తీసి, కళ్ళు రుద్దుకుని, తిరిగి కళ్ళజోడు ధరించిన దృశ్యాలను చూపిస్తుంది. అంతేకాకుండా, పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఒవైసీ ఏడ్చారనే వాదనకు మద్దతు ఇచ్చే ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ కూడా లేవు. ఎంఐఎం నేత ఒవైసీ వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వీడియో-1:
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ బ్రిజ్ లాల్ 29 జనవరి 2025న ఫేస్‌బుక్‌లో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. “ఈరోజు 29-1-2025న, “వక్ఫ్ సవరణ బిల్లు-2024” పై JPC సవరణను ఆమోదించిన తర్వాత, అధికార, ప్రతిపక్ష సభ్యులు టీ తాగుతూ నవ్వుతూ, జోక్ చేసుకున్నారు” అనే క్యాప్షన్‌తో ఆయన ఈ వీడియోను షేర్ చేశారు (హిందీ నుండి తెలుగులోకి అనువదించగా).

ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోను ANI, PTI వంటి వార్తా సంస్థలు కూడా 29 జనవరి 2025న షేర్ చేశాయి. ఈ వార్త సంస్థల, ఈ వీడియో వక్ఫ్ (సవరణ) బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC), వక్ఫ్ (సవరణ) బిల్లు యొక్క ముసాయిదా కాపీని ఆమోదించిన తర్వాత టీ తాగుతూ సమావేశమైన దృశ్యాలను చూపిస్తుంది, ఈ వీడియోలో ఒవైసీతో పాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎంపీ జగదాంబికా పాల్ సహా ఇతర సభ్యులు ఉన్నారు. వైరల్ వీడియోలోని దృశ్యాలనే రిపోర్ట్ చేస్తూ 29 జనవరి 2025న ప్రచురించబడిన పలు ఇతర వార్త కథనాలను ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
08 ఆగస్టు 2024న, వక్ఫ్ బోర్డు పనితీరును క్రమబద్ధీకరించడం మరియు వక్ఫ్ యొక్క సమర్థ నిర్వహణ లక్ష్యంతో లోక్‌సభలో Waqf (Amendment) Bill, 2024, and the Mussalman Waqf (Repeal) Bill, 2024, అనే రెండు బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి. పార్లమెంటులో ఈ బిల్లులపై విస్తృత చర్చ జరిగిన తర్వాత, ఈ బిల్లులను అధ్యయనం, సిఫార్సుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపారు (ఇక్కడ, ఇక్కడ). వక్ఫ్ బిల్లులపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను 30 జనవరి 2025న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. వక్ఫ్ బిల్లులపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
వీడియో-2:
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు చూపిస్తున్న అధిక నిడివి గల వీడియోను కనుగొన్నాము. ఈ వీడియోను భారత పార్లమెంట్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ‘సంసద్ టీవీ (Sansad TV)’, 07 ఆగస్ట్ 2024న “LS | రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ వ్యాఖ్యలు | ది ఫైనాన్స్ (నం.2) బిల్లు, 2024 | 07 ఆగస్టు, 2024” (ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించగా) అనే శీర్షికతో షేర్ చేశారు. ఈ వీడియోలో టైంస్టాంప్ 04:32 వద్ద ఎంపీ రాజేష్ రంజాన్ అలియాస్ పప్పు యాదవ్ మాట్లాడుతుండగా, యాదవ్ వెనుక వరుసలో కూర్చున్న ఒవైసీ, తన కళ్ళజోడు తీసి, కళ్ళు రుద్దుకుని, తిరిగి కళ్ళజోడు ధరిచడం మనం చూడవచ్చు, అంతేగాని ఓవైసీ ఏడవలేదు. అలాగే ఈ సెషన్‌కు సంబంధించిన పూర్తి వీడియోలో కూడా ఎక్కడ ఒవైసీ ఏడ్చినట్లు కనిపించలేదు.
02 ఏప్రిల్ 2024న లోకసభలో వక్ఫ్ (సవరణ) బిల్లుపై జరిగిన చర్చకు సంబంధించిన పూర్తి వీడియోను కూడా సమీక్షించాము, ఇందులో కూడా ఎక్కడ ఒవైసీ ఏడ్చినట్లు కనిపించలేదు. ఈ చర్చలో ఒవైసీ తెల్లటి రంగు దుస్తులు ధరించి కనిపించాడు, అయితే వైరల్ వీడియోలో, అతను నీలం రంగు దుస్తులు ధరించాడు (ఇక్కడ).
అంతేకాకుండా, పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఒవైసీ ఏడ్చారనే వాదనకు మద్దతు ఇచ్చే ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ కూడా లేవు. ఎంఐఎం నేత ఒవైసీ, కాంగ్రెస్, ఆప్ సహా పలు పార్టీల నేతలు వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ).
చివరగా, పార్లమెంటులో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అసదుద్దీన్ ఒవైసీ ఏడ్చారని/నవ్వారని పేర్కొంటూ సంబంధం లేని పాత వీడియోలను షేర్ చేస్తున్నారు.