ఇండియా, పాకిస్తాన్ వాఘా బోర్డర్ దగ్గర అటారి ప్రాంతంలో 360ft వైశాల్యంగల భారత జెండాని ఏర్పాటు చేసారని, ఇది ఒక ప్రపంచ రికార్డు అని ఇంకా ఈ జెండాకి సంబంధించిన ప్రత్యేకతలు తెలుపుతున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోని కూడా ఈ పోస్టులో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇండియా, పాకిస్తాన్ వాఘా బోర్డర్ దగ్గర అటారి ప్రాంతంలో 360ft వైశాల్యంగల భారత జెండాని ఏర్పాటు చేసారని, ఇది ఒక ప్రపంచ రికార్డు అని ఇంకా ఈ జెండాకి సంబంధించిన ప్రత్యేకతలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో హైదరాబాద్ లో 291ft ఎత్తుగల స్తంభంపై 108 X 72 ft వైశాల్యంగల భారత జెండాని ఏర్పాటు చేసినప్పుడు తీసింది. ఈ వీడియోకి వాఘా బోర్డర్ లో ఏర్పాటు చేసిన జెండాకి సంబంధం లేదు. ఇంకా అటారీలో( వాఘా దగ్గరి) ఏర్పాటు చేసిన జెండా పేరు పైన ఎటువంటి ప్రపంచ రికార్డు లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో ఉన్న వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 2017లో ఒక ఫేస్ బుక్ వినియోగదారుడు తన ఎకౌంటులో హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన ఎగరవేసిన భారత జెండా అని చెపుతూ షేర్ చేసాడు. ఈ ఆధారం ద్వారా యూట్యూబ్ లో కీ వర్డ్ సెర్చ్ చేయగా పోస్టులో ఉన్న వీడియోని వేరే కోణంలో చూపించే వీడియో ఒకటి మాకు కనిపించింది. యూట్యూబ్ లో వీడియో కింద ఇచ్చిన వివరణ ఈ విదంగా ఉంది ‘CM KCR Hoists Largest Indian Biggest Flag in Hyderabad’ . రెండు వీడియోల్లో కూడా ఒకే రకమైన చెట్లు, కార్ చూడొచ్చు. ఇంకా రెండు వీడియోల్లో ఒకే టైం దగ్గర సంగీతం మొదలవుతుంది. ఈ వీడియో 2 June 2016 తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్ లో 291ft ఎత్తుగల స్తంభంపై 108 X 72 ft వైశాల్యంగల భారత జెండాని ఏర్పాటు చేసినప్పుడు తీసింది, అప్పటికి ఇది దేశంలోనే రెండో అతి పెద్ద జెండా. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరికొన్ని వీడియోస్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఐతే మార్చ్ 2017లో ఇండియా,పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన అటారీ, పంజాబ్ లో 360ft ఎత్తైన స్తంభంపైన (అప్పటికి దేశంలోనే ఎత్తైన) అతిపెద్ద భారత జెండాని ఏర్పాటు చేసింది. దీని తరవాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన జెండా దేశంలోనే అతిపెద్దది అన్న కీర్తి కోల్పోయింది. ఐతే అటారీలో జెండా ఏర్పాటు చేసే సమయంలో పాకిస్తాన్ మొదట అభ్యంతరం తెలిపినప్పటికీ తరువాత సరిహద్దు దగ్గర తమవైపు ప్రాంతంలో 400ft ఎత్తైన స్తంభంపై భారత జెండాకు ధీటుగా తమ దేశ జెండాని ఏర్పాటు చేసుకుంది. దీని తరువాత 2018లో కర్ణాటకలోని బెల్గావి లో 361ft(అటారీలోని స్తంభం కన్నా ఒక ft ఎక్కువ ఎత్తు) ఎత్తైన స్తంభంపైన దేశాలోనే పెద్ద జెండాని ఏర్పాటు చేసింది. ఇంకా చాలా రాష్ట్రాలు దేశాలోనే పొడవైన, వైశాల్యంలో పెద్దవైన జెండాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. 2019లో వచ్చిన కొన్ని వార్తా కథనాల ప్రకారం మీరట్ లో 380ft ఎత్తైన స్తంభంపైన భారత జెండాని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ప్రపంచంలోనే ఎత్తైన మరియు పెద్దవైన జెండాల గురించి ఇక్కడ మరియు ఇక్కడ తెలుసుకోవచ్చు.
చివరగా, హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన జెండాకి సంబంధించిన వీడియోని, వాఘాలో ఏర్పాటు చేసిన జెండాకి సంబంధించిన వీడియో అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.