ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకునే దిశగా ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి, 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరుతో ఇరాన్ అణు మరియు సైనిక ప్రదేశాలు లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు, డ్రోన్ దాడులను చేసింది. ఈ దాడుల్లో పలువురు అగ్రశ్రేణి ఇరాన్ సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు హతమయ్యారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’కు కౌంటర్‌గా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ -3’ని ఇరాన్ ప్రారంభించింది. ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు లక్ష్యంగా వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది (ఇక్కడ, ఇక్కడ). ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్ లోని అమెరికన్ ఎంబసీపై పడింది. ఈ దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ విషయాన్ని అమెరికన్ అంబాసిడర్ మైక్ హకేబీ ధ్రువీకరించారు. 16 జూన్ 2025,ఇజ్రాయెల్ టెహ్రాన్‌లో ఉన్న ఇరాన్ ప్రభుత్వ ఛానల్ IRIB ప్రధాన కార్యాలయంపై దాడి చేసింది. భారీ పేలుడు శబ్దాలు రావడంతో ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్ ప్రాణభయంతో పరుగులు పెట్టింది. రోజురోజుకు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, “జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించిన దృశ్యాలు” అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా ఈ వీడియోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్ అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు, డ్రోన్ దాడులను ప్రారంభించింది. ఈ దాడుల్లో పలువురు అగ్రశ్రేణి ఇరాన్ సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు హతమయ్యారు. ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’కు కౌంటర్‌గా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ -3’ని ఇరాన్ ప్రారంభించింది. టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు లక్ష్యంగా వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. అయితే, ఈ వైరల్ వీడియోలు ఇటీవల జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించినవి కావు. ఈ వీడియోలు 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించడానికి కంటే ముందు నుండి ఇంటర్నెట్లో ఉన్నవి. కావున ఈ వైరల్ పోస్టులు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వీడియో-1:
ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలంటూ ఈ క్రింది వీడియోను షేర్ చేస్తున్నారు.

అయితే, ఈ వీడియోకు ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో జనవరి 2025లో మెక్సికోలో జరిగిన అగ్నిప్రమాద దృశ్యాలను చూపిస్తుంది.
వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలనే రిపోర్ట్ చేస్తూ జనవరి 2025లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ దృశ్యాలు మెక్సికోలోని కులియాకాన్ ప్రాంతంలోని ఒక క్యాసినోలో జరిగిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించినవి.

అలాగే, వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్‌లో జియోలొకేట్ చేశాము. వైరల్ వీడియోలో కనిపిస్తుంది మెక్సికోలోని కులియాకాన్ ప్రాంతం. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించినది కాదని అని మనం నిర్థారించవచ్చు.

వీడియో-2:
ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంపై ఇరాన్ చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలంటూ ఈ క్రింది వీడియోను షేర్ చేస్తున్నారు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో ఇటీవల జూన్ 2025లో ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కంటే ముందు నుండే ఇంటర్నెట్లో అందుబాటులో ఉందని తెలిసింది (ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియో షేర్ చేస్తూ పలువురు ఈ వీడియో చైనాలో జరిగిన ఓ కెమికల్ ప్లాంట్ పేలుడుకు సంబంధించింది అని పేర్కొన్నారు. అయితే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో మేము స్వతంత్రంగా నిర్ధారించలేకపోయాము. కానీ, ఈ వీడియోకు ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఎలాంటి సంబంధం లేదని మేము నిర్ధారించగలము.

వీడియో-3:
ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు సంబంధించిన దృశ్యాలంటూ ఈ క్రింది వీడియోను షేర్ చేస్తున్నారు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో యొక్క పూర్తి నిడివి గల వీడియోను ‘aleksey__n’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ 07 అక్టోబర్ 2024న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. అంటే ఈ వీడియో ప్రస్తుతం జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కంటే ముందు నుండే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. అలాగే, ఈ ఇన్స్టాగ్రామ్ వీడియో వివరణ ప్రకారం, ఇది ఒక 3D యానిమేషన్ వీడియో. ఈ పేజీలో ఇలాంటి పలు 3D యానిమేషన్ వీడియోలను మనం చూడవచ్చు (ఇక్కడ). దీన్ని బట్టి ఈ వీడియోకు ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఎలాంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.

వీడియో-4:
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు సంబంధించిన దృశ్యాలంటూ ఈ క్రింది వీడియోను షేర్ చేస్తున్నారు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆగస్టు 2020లో మీడియా సంస్థ ‘NBC న్యూస్’ అధికారక యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేయబడిన న్యూస్ బులెటిన్ వీడియో ఒకటి లభించింది. వైరల్ వీడియోలోని దృశ్యాలు ఈ న్యూస్ బులెటిన్‌లో రిపోర్ట్ చేయబడ్డాయి. ఈ న్యూస్ బులెటిన్ ప్రకారం, ఈ వీడియో ఆగస్టు 2020లో,లెబనాన్ రాజధాని బీరుట్‌లోని మందుగుండు సామగ్రి నిల్వ చేసిన ఒక గిడ్డంగి (గోదాం)లో జరిగిన భారీ పేలుడును చూపిస్తుంది.

ఈ ఘటనను రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ప్రసారం చేసిన మరిన్ని వీడియోలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. వార్తా కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), 04 ఆగష్టు 2020న, లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఓడరేవులోని ఒక గిడ్డంగిలో నిల్వ చేసిన 2750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలిపోయింది. ఈ భారీ పేలుళ్ల కారణంగా 6000 మందికి పైగా గాయపడ్డారు మరియు దాదాపు 100 మందికి పైగా మరణించారు. అలాగే, 3,00,000 మంది వరకు ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ పేలుళ్ల శబ్దం 200 కిలోమీటర్లకు పైగా వినిపించింది.
చివరగా, జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించిన దృశ్యాలంటూ సంబంధం లేని వీడియోలను షేర్ చేస్తున్నారు.