ఆంధ్ర ప్రదేశ్‌లో విద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రజలు ధ్వంసం చేస్తున్నారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్ర ప్రదేశ్‌లోవిద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రజలు పగలగొట్టడాన్ని చూపుతున్న వీడియో.
ఫాక్ట్: ఈ వీడియో ఒడిశా రాష్ట్రానికి చెందినది. స్మార్ట్ మీటర్ల వళ్ల విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తుందని బర్గార్ జిల్లాలో విద్యుత్ కార్యాలయం ఎదుట స్థానికులు ఆగస్టు 2024లో స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేశారు. అయితే జూలై 2025లో ఆంధ్ర ప్రదేశ్‌లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, వైరల్ వీడియోలో ‘Kanak News’ అనే ఒడిశా రాష్ట్రానికి చెందిన మీడియా ఛానెల్ లోగో ఉండడం గమనించాం. దీని ఆధారంగా వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియోని 17 ఆగస్టు 2024లో Kanak News యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ (ఆర్కైవ్) చేసినట్లు గుర్తించాం.

వీడియోలోని వివరాల ప్రకారం, ఒడిశాలో బర్గార్ జిల్లాలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా స్థానిక విద్యుత కార్యాలయాల ముందు స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేశారు. స్మార్ట్ మీటర్లు అమర్చిన తర్వాత విద్యుత్ బిల్లు సాధారణంగా వచ్చే దానికంటే ఎక్కువ వస్తుందని నిరసనకారులు ఆరోపించారు. అందువలన వెంటనే స్మార్ట్ మీటర్లను తొలగించాలని ఆ ప్రాంతంలో స్మార్ట్ మీటర్లు అమర్చే టాటా పవర్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.
అయితే, ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేటప్పుడు కూడా పలు చోట్ల వ్యతిరేకత వ్యక్తమైనట్లు మీడియా కథనాలు (ఇక్కడ & ఇక్కడ) పేర్కొన్నాయి. అలాగే, విద్యుత్ మీటర్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు నిరసన ర్యాలీలు చేపట్టాయి.

అయితే, విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అపోహలు అవసరం లేదని, వీటి వల్ల వినియోగదారులపై ఎటువంటి అదనపు ఛార్జీల భారం పడదని ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ పేర్కొన్నారు. విద్యుత్ సేవలలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం (RDSS) కింద అన్ని రాష్ట్రాలలో 2021లో స్మార్ట్ మీటర్ల అమలును ప్రారంభించింది. దీనికి అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) 2021లో సాంప్రదాయ మీటర్లను స్మార్ట్ మీటర్లతో భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది.

చివరిగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేస్తున్నారంటూ ఒడిశాకి చెందిన వీడియోని షేర్ చేస్తున్నారు.