“PM వెల్ఫేర్ ట్రస్ట్‌కు జమకానున్న జిలానీ దోచిన ఆదాయానికి మించిన ఆస్తులు. స్టోన్ పెల్టింగ్‌కు వసూలు చేసిన సొమ్ములు దేశాసేవలో” అని అంటూ ఒక పోస్టును బాగా షేర్ చేస్తున్నారు. కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు, ఈ నేపథ్యంలో అతని ఆస్తులకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: PM వెల్ఫేర్ ట్రస్ట్‌కు జమకానున్న గిలానీ దోచిన ఆదాయానికి మించిన ఆస్తులు.
ఫాక్ట్: ‘PM వెల్ఫేర్ ట్రస్ట్’ అనబడే ట్రస్ట్ భారత దేశంలో లేనేలేదు. అటువంటప్పుడు ఆ ట్రస్ట్‌లో ఆస్తులు జమచేస్తారు అనడంలో అర్ధంలేదు. ప్రధానమంత్రికి సంబంధించి రెండు ఫండ్స్ భారత దేశంలో ఉన్నాయి: మొదటిది ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్), రెండవది పిఎం కేర్స్ ఫండ్; ఇవి రెండు స్వచ్ఛంద విరాళాలను మాత్రమే సేకరిస్తాయి. 2019లో, 3.62 కోట్ల పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఢిల్లీలో కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీకి చెందిన ఇంటిని ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. ఇటీవల సయ్యద్ అలీ షా గిలానీకి చెందిన ఆస్తులను ప్రభుత్వం జమచేసుకున్నట్లు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ లభించలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అలాంటి విషయం గురించి ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటిది జరిగుంటే, వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.
అసలు ‘PM వెల్ఫేర్ ట్రస్ట్’ అనబడే ట్రస్ట్ భారత దేశంలో లేనేలేదు. అటువంటప్పుడు ఆ ట్రస్ట్‌లో ఆస్తులు జమచేస్తారు అనడంలో అర్ధంలేదు. ప్రధానమంత్రికి సంబంధించి రెండు ఫండ్స్ భారత దేశంలో ఉన్నాయి. మొదటిది ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్), రెండవది పిఎం కేర్స్ ఫండ్. ఇవి రెండు స్వచ్ఛంద విరాళాలను మాత్రమే సేకరిస్తాయి. వ్యక్తులు, సంస్థలు, ట్రస్టులు, కంపెనీలు నుంచి స్వచ్ఛంద విరాళాలను పిఎంఎన్ఆర్ఎఫ్ స్వీకరిస్తుంది. పిఎం కేర్స్ ఫండ్ ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. వ్యక్తులు/సంస్థల ద్వారా స్వచ్ఛంద విరాళాలతో పాటు కంపెనీలు/పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (పి.ఎస్.యు)ల నుంచి CSR రూపంలో స్వచ్ఛంద విరాళాలను స్వీకరిస్తుంది. ఈ రెండు ఫండ్స్ స్వచ్ఛంద విరాళాలను మాత్రమే సేకరిస్తాయి గనక, ప్రభుత్వం ఒకరికి సంబంధించిన ఆస్తులను వీటిల్లో జమచేయడం అనేది జరగదు.
2019లో, 3.62 కోట్ల పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఢిల్లీలో కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీకి చెందిన ఇంటిని ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఉన్న ఈ ఆస్తి 1996-97 నుండి 2001-02 సంవత్సరాలకు గాను ఆదాయపు పన్ను చెల్లించడంలో “విఫలమైందని” ఆరోపించిన తరువాత సీల్ చేయబడింది.
ఇటీవల సయ్యద్ అలీ షా గిలానీకి చెందిన ఆస్తులను ప్రభుత్వం జమచేసుకుంది అని చెప్పే ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ మాకు లభించలేదు.
చివరగా, కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీకి చెందిన ఆస్తులను ‘PM వెల్ఫేర్ ట్రస్ట్’లో జమచేసారు అని అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.