ఇటీవల భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగరేయడానికి నిరాకరించిన వార్తని ప్రచురించిన ఒక న్యూస్ పేపర్ క్లిప్ ని చాలా షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఖమ్మం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ 2021 స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగరేయడానికి నిరాకరించాడు.
ఫాక్ట్(నిజం): ఈ న్యూస్ పేపర్ క్లిప్ ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనకి సంబంధించింది కాదు. న్యూస్ పేపర్ క్లిప్‌లో ఉన్న సమాచారం ప్రకారం అది 2014 స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించినట్టు తెలుస్తుంది. ఇదే క్లిప్ సోషల్ మీడియాలో 2014 నుండే షేర్ అవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులోని న్యూస్ పేపర్ క్లిప్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ క్లిప్‌లో తేది 15 ఆగస్ట్ అని ఉంది, వారం శుక్రవారం అని ఉంది. కాని 2021లో 15 ఆగస్ట్ ఆదివారం అయింది, అంటే ఈ వార్త మొన్నటి స్వాతంత్ర్య దినోత్సవంకి సంబంధించింది కాదని స్పష్టంగా అర్ధమవుతుంది. పైగా ఇటీవల జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలో ఇలా ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ జాతీయ జెండా ఎగరేయడానికి నిరాకరించాడని వార్తా సంస్థలేవి కూడా రిపోర్ట్ చేయలేదు.
ఐతే 2014లో 15 ఆగస్ట్ శుక్రవారం నాడు అయ్యింది, దీన్నిబట్టి ఈ క్లిప్ 2014లో జరిగిన ఘటనకి సంబంధించిందని అయ్యుండొచ్చు. పైగా 2014లో ఇదే న్యూస్ క్లిప్‌ని సోషల్ మీడియాలో కూడా చాలా మంది షేర్ చేసారు. కొన్ని ఆన్లైన్ బ్లాగ్స్ కూడా ఈ క్లిప్‌ని 2014 మరియు 2015లో కూడా షేర్ చేసాయి. ఐతే 2014లో ఈ ఘటనని రిపోర్ట్ చేసిన ప్రముఖ వార్తా కథానాలేవి మాకు లభించలేదు. కాకపొతే అందుబాటులోని ఈ సమాచారం మేరకు ఈ వార్త ఇప్పటిది కాదని స్పష్టంగా అర్ధమవుతుంది.
చివరగా, 2014 స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ప్రచురించిన న్యూస్ పేపర్ క్లిప్‌ని ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తున్నారు.