Fake News, Telugu
 

గతంలో మధ్యప్రదేశ్‌లో గిరిజన అమ్మాయిలపై జరిగిన లైంగిక దాడికు సంబంధించిన వార్తను ఇప్పుడు రాజకీయ కోణంలో షేర్ చేస్తున్నారు

0

బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో నడి రోడ్డు మీద గిరిజన అమ్మాయిలపై బీజేపీ కార్యకర్తలు లైంగిక దాడి చేసారని ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఇద్దరు అమ్మాయిలపై కొందరు వ్యక్తులు దాడి చేస్తున్నట్టు ఉన్న ఒక స్క్రీన్ షాట్‌తో పాటు ఈ వార్తను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో నడి రోడ్డు మీద గిరిజన అమ్మాయిలపై బీజేపీ కార్యకర్తలు లైంగిక దాడి చేసారు.

ఫాక్ట్(నిజం): ఈ ఘటన మార్చ్ 2022లో మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో జరిగింది. భగోరియా అనే గిరిజన పండుగలో పాల్గొనడానికి వెళ్తున్న ఇద్దరు గిరిజన మహిళలపై కొందరు వ్యక్తులు లైంగిక దాడి చేసారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసారు. ఐతే పోలీసుల ప్రకారం ఈ నిందితులకు రాజకీయ పార్టీలతో సంబంధాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలో చెప్తున్నట్టు మధ్యప్రదేశ్‌లో రోడ్డుపై గిరిజన అమ్మాయిల మీద లైంగిక దాడి జరిగిన విషయం నిజమే అయినప్పటికీ, ఈ ఘటన 2022లో జరిగింది, పైగా ఈ ఘటనతో రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు.

ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా మార్చ్ 2022లో ఈ ఘటనను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో భగోరియా అనే గిరిజన పండుగలో పాల్గొనడానికి వెళ్తున్న ఇద్దరు గిరిజన మహిళలపై కొందరు వ్యక్తులు లైంగిక దాడి చేసారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో ఘటనకు సుమారు 15 మంది నిందితులను IPC సెక్షన్లు 354, 345-A & 34 కింద అరెస్ట్ చేసినట్టు కథనాలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడఆర్కైవ్ & ఇక్కడఆర్కైవ్). కాగా ఈ కథనాల ఆధారంగా వెతకగా ఈ ఘటనకు సంబంధించి మాకు నాలుగు FIRలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ FIRలలోని సమాచారం ప్రకారం కూడా ఇద్దరు మహిళలపై లైంగిక దాడి చేసినందుకు పైన తెలిపిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిసింది.

ఐతే ఈ ఘటనకు సంబంధించిన నిందితులకు రాజకీయ పార్టీలతో సంబంధాలు లేవని, వారు ఏ పార్టీ కార్యకర్తలు కారని పోలీసులు స్పష్టం చేసారు. ఈ మొత్తం సమాచారం బట్టి గతంలో జరిగిన ఘటనకు సంబంధించిన వార్తను ఇప్పడు రాజకీయ పార్టీలకు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నట్టు అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, గతంలో మధ్యప్రదేశ్‌లో గిరిజన అమ్మాయిలపై జరిగిన లైంగిక దాడికు సంబంధించిన వార్తను ఇప్పుడు రాజకీయ కోణంలో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll