Fake News, Telugu
 

ఈ లిస్టులో చాలావరకు కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్ లో అమలు కావట్లేదు, అమలవుతున్న కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలవుతున్నాయి

0

ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ పాలన బాగుందని చెప్పే నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా అయన ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు/పథకాలు/చట్టాల గురించి చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఆడవారిని మరియు ఆవులను హింసిస్తే షూట్ ఎట్ సైట్ ఆర్డర్, వృద్ద దంపతులకు 3000 పెన్షన్, మొదలైన కొన్ని కార్యక్రమాలు/పథకాల గురించి ఈ పోస్టులో పేర్కొన్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు/పథకాలు/చట్టాల వివరాలు.

ఫాక్ట్ (నిజం): ఈ లిస్టులో చాలావరకు కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తునట్టు ఎటువంటి సమాచారం లేదు. కొన్ని కార్యక్రమాలు అమలుచేస్తునప్పటికీ, ఇవి కేవలం ఉత్తరప్రదేశ్ లో మాత్రమే అమలు కావడంలేదు, వేరే చాలా రాష్ట్రాలు కూడా వీటిని అమలు చేస్తున్నాయి. ఇకపోతే కొన్ని కార్యక్రమాల గురించి తప్పు సమాచారం అందించారు, ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ లో వృద్దులకు ఇస్తున్న పెన్షన్ రూ. 500 మాత్రమే, రూ. 3000 కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

లిస్టులో పేర్కొన్న ఒక్కొక్క కార్యక్రమం/పథకం గురించి కింద వివరంగా చూద్దాం.

ఆడవారిని, ఆవులను హింసిస్తే షూట్ ఎట్ సైట్ ఆర్డర్:

భారతీయ చట్టాలలో ‘షూట్ ఎట్ సైట్’ అనే కాన్సెప్ట్ లేదా పదాన్ని ఎక్కడ కూడా పేర్కొనలేదు. దీనికి ఒక కచ్చితమైన నిర్వచనం లేక పరిధి ఎక్కడ కూడా నిర్వచించలేదు. పైగా షూట్ ఎట్ సైట్ అనేది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల ద్వారా పేర్కొన ఆర్టికల్ 21 (రైట్ టూ లైఫ్)ని ఉల్లంఘిస్తుంది. కాబట్టి షూట్ ఎట్ సైట్ అనేది చట్టబద్దం కాదు, అందువల్ల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చట్టం చేసే అవకాశం లేదు.

సాధారణంగా చాలా కాలంగా చట్టం నుండి తప్పించుకుంటున్న నేరస్తున్ని పట్టుకునే నేపథ్యంలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇష్యూ చేస్తుంటారు. ఐతే ఈ అధికారం మేజిస్ట్రేట్ కి మాత్రమే ఉంటుంది. అల్లర్లు, హింసాత్మక సంఘటనల వల్ల శాంతి భద్రతలు అదుపు తప్పిన సందర్భాలలో పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 144ని అమలు చేస్తుంటారు. 144 సెక్షన్ విధించినప్పుడు నలుగురి కంటే ఎక్కువ మంది కలిసి ఒక చోట గుమిగూడకూడదు. ఐతే ఈ సెక్షన్ విధించే అధికారం జిల్లా మేజిస్ట్రేట్/కలెక్టర్ కి మాత్రమే ఉంటుంది. పరిస్థితి అంచనా వేసి తప్పదు అనుకున్న సందర్భాల్లోనే మేజిస్ట్రేట్ ఈ సెక్షన్ ని విధిస్తుంటారు, పైగా పరిస్థితి చేయి దాటినప్పుడు మేజిస్ట్రేట్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్ కూడా ఇష్యూ చేస్తుంటారు. చాలా అరుదైన, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఇలా  షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇష్యూ చేసారు.

ఐతే ప్రత్యేకించి మహిళలు, ఆవులను రక్షించడానికి యోగి ప్రభుత్వం ఇలా షూట్ ఎట్ సైట్ చట్టం చేసినట్టు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ ఇలా చేసి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని ఈ విషయానికి సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లభించలేదు.

మద్యపానం, గుట్కా, సిగరేట్, ప్లాస్టిక్ నిషేధం:

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ప్లాస్టిక్ ని నిషేదించలేదు, కేవలం 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ని మాత్రమే నిషేధించింది. ఐతే ఇలా కేవలం ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలోని చాలా వరకు రాష్ట్రాలు తక్కువ మందం గల ప్లాస్టిక్ ని నిషేదించాయి. సింగల్ యూజ్ ప్లాస్టిక్ ని వినియోగాన్ని దశలవారిగా తగ్గించి 2022 కల్లా పూర్తిగా నిషేదిస్తామని 2019లోనే ప్రధానమంత్రి ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం గతంలోనే దేశవ్యాప్తంగా గుట్కా, ఇతర నమిలే పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించింది. దీనికి అనుగుణంగానే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులపై నిషేదాన్ని విధించాయి, ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఈ నిర్ణయం తీసుకోలేదు.

ఉత్తరప్రదేశ్ లో మద్యపానంపై ఎటువంటి నిషేధం లేదు. జనవరి 2021లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడుతూ మద్యపానంపై నిషేదానికి సంబంధించి అడిగిన ప్రశ్నకి బదులిస్తూ ‘మేము బలవంతంగా దేనిపైన నిషేధం విధించలేమని, కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏది అవసరమో ఆ చర్యలు తీసుకుంటామని’ అన్నారు. రాష్ట్రంలో అమలులోకి తెచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం, రాష్ట్రంలో మద్యం కొనుగోలు, రవాణా లేదా ప్రైవేట్ స్వాధీనం ఆరు లీటర్లకు మాత్రమే పరిమితం. పరిమితికి మించి మద్యం ఉంచుకోవడానికి ఎక్సైజ్ శాఖ నుండి లైసెన్స్ పొందాలి. ఐతే ఇటీవల 30 ఆగస్ట్ 2021న కృష్ణాష్టమి సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని మథుర ప్రాంతంలో మద్యం మరియు మాంసం పూర్తిగా నిషేదించారు.

వృద్దులకు 3000 పెన్షన్, బియ్యం, మెడికల్ ఖర్చులు ఉచితం:

ఉత్తరప్రదేశ్  సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంటు వెబ్సైటులోని సమాచారం ప్రకారం గ్రామీణ ప్రాంతంలో రూ. 46,080 మరియు పట్టణ ప్రాంతాల్లో రూ. 56,460 లోపు ఆదాయం ఉండి, 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి వృద్ధాప్య పెన్షన్ పథకానికి అర్హులు. ఈ పథకం కింద, 60 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు నెలకు రూ. 500 చొప్పున మూడు నెలలకోసారి  పెన్షన్ ఇస్తారు.

కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీం కింద 60 ఏళ్లు పైబడిన వృద్దులకు ఈ పథకం కింద నెలకు రూ.300 (200 కేంద్రం, 100 రాష్ట్రం) మరియు 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు నెలకు రూ.500 ఇస్తుంది. ఈ పెన్షన్ కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఇస్తారు. దీనికి అఅదనంగా ఇవ్వలనుకున్నా, ఇతర లబ్దిదారులకు ఇవ్వలనుకున్నా ఆ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ కేంద్ర పథకానికి, రాష్ట వాటా జోడిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు నెలకు రూ. 500 చొప్పున మూడు నెలలకోసారి పెన్షన్ ఇస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్ లో చాలా తక్కువ వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం 2013లో చేసిన ఆహార భద్రతా చట్టం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారందరికీ ప్రతీ నెల సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలు అందిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది, ఇందులో రాష్ట్రాల వాటా చాలా తక్కువ. కాబట్టి ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్దులకు ఆహార ధాన్యాలు ఏమీ అందించట్లేదు. పైగా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అర్హులైన అందరికి ప్రతీ నెల 10 కిలోల ఆహార ధాన్యాలను అందిస్తుంది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా మాత్రమే అర్హులైన వారికి ఉచిత వైద్యం అందిస్తుంది. చాలా వరకు రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి సంబంధించి ప్రత్యేకించి ఎటువంటి స్కీం అమలు చేయట్లేదు.

రైతులకు పది లక్షల భీమా; మద్దతు ధర; ఐదు లక్షల వడ్డీలేని రుణం:

ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి కిసాన్ ఏవం సర్వీత్ బీమా యోజన’ పేరుతో రైతులకు భీమా అందిస్తుంది. ఈ పథకం కింద  రైతులు మరణిస్తే రూ. 5 లక్షలు, శాశ్వత వైకల్యం పొందితే రూ.2 లక్షలు ఇన్సూరెన్సు అందిస్తుంది. ఐతే ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ పథకాన్ని రైతు కుటుంబంలోని అందరికీ, ఇంకా కౌలు రైతులకు కూడా వర్తింప చేయడానికి ప్రణాళికకు రూపొందించాలని ఆదేశించారు.

ఇక పంటలకు మద్దతు ధర విషయానికి వస్తే, ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. మద్దతు ధరలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం ద్వారానే రైతులకు రుణాలను అందిస్తుంది. ప్రత్యేకించి వేరే ఏ పథకం ద్వారా రైతులకు రుణాలు అందించట్లేదు. ఐతే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పొందే రుణాలకు వడ్డీ వర్తిస్తుంది, కాకపోతే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రైతులకు 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తుందన్న వాదనలో నిజం లేదు.

ఎవరైనా అడుక్కుంటే 14 సంవత్సరాల జైలు :

కథనం ప్రకారం భారతదేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో అడుక్కోవడం నేరం. ఈ చట్టాల ప్రకారం పోలీసులు వారిని వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోని పునరావాస కేంద్రాలలో నిర్బంధించవచ్చు. చాలావరకు రాష్ట్రాలు భిక్షాటనను నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటన చేస్తూ తరుచూ పట్టుబడితే 5 సంవత్సరాల వరకు నిర్బంధించబడే అవకాశం ఉంది, అందులో రెండు సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉండే అవకాశం ఉంది. ఐతే 2016లో కేంద్ర ప్రభుత్వం భిక్షాటనను నేరంగా పరిగణించకుండా The Persons in Destitution (Protection, Care and Rehabilitation) Model Bill రూపొందించింది.

బలవంతంగా మత మార్పిడి చేస్తే నాన్ బెయిలబుల్ కేసు:

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 2020లో బలవంతపు మత మార్పిడిని నిషేధిస్తూ The Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Ordinance, 2020 తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ కింద అన్ని నేరాలను నాన్-బెయిలబుల్ గుర్తించారు. ఫిబ్రవరి 2021లో ఈ ఆర్డినెన్స్ ని రీప్లేస్ చేస్తూ The Prohibition of Unlawful Religious Conversion Bill, 2021చట్టం చేసింది.

అనాధ పిల్లలకు భోజనం, బట్టలు చదువు ఉచితం:

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కరోనాతో తల్లితండ్రులు ఇద్దరిని కోల్పోయిన పిల్లకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని బాల్ సేవా యోజన ప్రారంభించింది. కోవిడ్ -19 ద్వారా అనాథలైన పిల్లల పెంపకం మరియు విద్యను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఐతే కరోనా కంటే ముందు అనాధ పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పథకం/కార్యక్రమం గానీ ఉన్నట్టు వివరాలైతే మాకు లభించలేదు. సాధారణంగా చాలావరకు రాష్ట్రాల్లో అనాధ పిల్లల కోసం స్వచ్ఛంద సంస్థలు నడిపే అనాధ శరణాలయాలలో కొన్నింటికి ప్రభుత్వం సహాయం అందిస్తూ ఉంటుంది.

ప్రతి ఊరికి ఇద్దరు కానిస్టేబుల్స్; నిత్యం యజ్ఞయాగాలు; ప్రతి ఉద్యోగి కింది నుంచి ప్రమోషన్ తో పోవాలి; అందరు గవర్నమెంట్ బడుల్లోనే చదువుకోవాలి:

ఈ విషయాలకి సంబంధించి మాకు ఎటువంటి వార్తా కథనాలు గాని లేక ఇతర సమాచారం గాని లభించలేదు. ఒకవేళ నిజంగానే ఉత్తరప్రదేశ్ లో ఈ కార్యక్రమాలు అమలవుతుంటే వీటి గురించి మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి, కాని ఈ విషయాలకి సంబంధించి మాకు ఎటువంటి కథనాలు లభించలేదు.

చివరగా, ఈ లిస్టులో చాలావరకు కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్ లో అమలుకావట్లేదు, కొన్ని అమలవుతున్న అవి ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ మాత్రమే కాకుండా చాలావరకు రాష్ట్రాల్లో అమలవుతున్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll