“ఏపీ ప్రభుత్వం కుక్కలకు, పందులకు లైసెన్సులు ఉండాలంటూ విచిత్రమైన G.O తెచ్చింది” అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. “లైసెన్సు లేని కుక్కలను పందులను అధికారులు పట్టుకుంటే వాటి యజమానులు జరిమానా కట్టాలి. ఎవరూ కూడా యజమానిగా అంగీకరించకపోతే వాటిని కూడా వీధి కుక్కల, పందులు లాగా పరిగణించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని G.O లో చెప్పింది” అని వీడియోలో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: కుక్కలకు, పందులకు లైసెన్సు తప్పనిసరి చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా G.O తెచ్చింది.
ఫాక్ట్: హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఆంధ్ర ప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965 మరియు ఆంధ్రపదేశ్ పంచాయత్ రాజ్ చట్టం 1994 లో పెంపుడు కుక్కలకు/పందులకు లైసెన్సు ఉండాలనే నిబంధన ఉంది. అయితే, ఈ నిబంధనలను ఎక్కువ మంది పాటించకపోవడం వలన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకు విజ్ఞప్తి చేయడం మరియు జరిమానా పెంచడం చేస్తున్నాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వార్త 30 డిసెంబర్ 2022లో ‘TV5 News’ యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం అయ్యింది అని తెలిసింది. ఈ వీడియోలో ప్రస్తావించిన G.O.Ms.NO. 693 లో చెప్పిన విషయాల గురించి మేము పరిశీలించాo. ఈ G.Oను ఆంధ్ర ప్రదేశ్ పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ 29 డిసెంబర్ 2022లో జారీ చేసింది. పందులు మరియు కుక్కల లైసెన్సుకు సంబంధించి ఇదివరకే 1996లో జారీ చేసిన G.Oలోని నిబంధనలను మారుస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు.
ఆంధ్రపదేశ్ పంచాయత్ రాజ్ చట్టం, 1994 ఇచ్చిన అధికారాలకు లోబడి ఈ G.O ద్వారా ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ (బిశ్వభూషణ్ హరి చందన్) కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం.
- పెంపుడు కుక్క/పందికి తీసుకునే వార్షిక లైసెన్సు గడువు ముగిసిన 10 రోజుల లోపల దానిని పునరుద్ధరించుకోవాలి.
- కుక్కలకు లైసెన్సు కోసం అయితే హెల్త్ సర్టిఫికేట్ తో పాటు ‘Anti-Rabies vaccination’ ను సమర్పించాలి. పందులకు కేవలం హెల్త్ సర్టిఫికేట్ సరిపోతుంది.
- లైసెన్సు ఉన్న పెంపుడు జంతువులను గుర్తించడానికి పంచాయితీ అధికారులు ఇచ్చిన టోకెన్‌ను జంతువు మెడలో వేయాలి. అందువలన లైసెన్సు లేని జంతువులను గుర్తించడం సులభం అవుతుంది.
- వీధుల్లో తిరిగే లైసెన్సు లేని కుక్కలు, పందులని పట్టుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి గ్రామ పంచాయితీ ఎప్పుడైనా ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఉంటుంది. ఒకవేళ ఏదైనా పెంపుడు కుక్క/పందిని పంచాయితీ వారు పట్టుకుంటే సంబంధిత యజమాని లైసెన్సు చూపించి జంతువుని తీసుకొని వెళ్ళవచ్చు. లైసెన్సు లేకుంటే ₹500 మరియు ఆలస్యం చేసిన ప్రతి రోజూ ₹250 కట్టాల్సి ఉంటుంది.
- ఒకవేళ యజమాని ఎవరు రాకపోతే వాటిని వీధి కుక్కలుగా పరిగణించి తగిన చర్యలు చేపడతారు.
అయితే పైన చెప్పిన నియమాలు కొత్తగా తెచ్చినవి కాదు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1955 సెక్షన్ 249లో కూడా హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో పెంపుడు కుక్కకు లైసెన్సు తీసుకోవాలని, ఒకవేళ లైసెన్సు లేకుండా సంబంధిత అధికారికి దొరికితే జరిమానా కట్టాల్సి ఉంటుంది అని చూడవచ్చు.
అలాగే, ఆంధ్ర ప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం, 1965 మరియు ఆంధ్ర ప్రదేశ్ పంచాయత్ రాజ్ చట్టం, 1994 లో కూడా గ్రామాలు/ మునిసిపాలిటీల పరిధిలో లైసెన్సు లేని వీధి కుక్కలు మరియు పందులని స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పబడింది. అయితే ఈ నిబంధనలు ఎవరూ అంతగా పాటించకపోవడం వలన అనేక సార్లు 2008 నుంచి కూడా లైసెన్సు తప్పనిసరిగా తీసుకోవాలి అని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి మరియు జరిమానా కూడా పెంచాయి. వాటికి సంబంధించిన వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
అదే విధంగా దేశంలో వివిధ రాష్ట్రాలు, నగరాల్లో కూడా పెంపుడు జంతువులకు లైసెన్సు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. పలు దేశాలలో కూడా ఈ లైసెన్సులు తప్పని సరిగా ఉండాలని నిబంధనలు ఉన్నాయి.
చివరిగా, ఆంధ్ర ప్రదేశ్‌లో పెంపుడు కుక్క/పందులకు లైసెన్సు ఉండాలనే నిబంధన కొత్తగా తెచ్చినది కాదు. 1965 నుంచే దీని పైన చట్టాలు ఉన్నాయి.